పార్లమెంట్​ను అడ్డుకుని ప్రతిపక్షాలు సాధించిందేంటి?

కరోనా సంక్షోభం సహా అనేక అంశాలపై విస్తృత చర్చ కోసం పార్లమెంట్​ను సమావేశపరచాలని ఆరు నెలలుగా ప్రతిపక్షం డిమాండ్‌‌ చేస్తూ వచ్చింది. తీరా పార్లమంట్​ మొదలయ్యాక ఈ వర్షాకాల సమావేశాల్లో కనీసం ఒక్క రోజైనా చర్చల్లో పాల్గొనేందుకు ప్రతిపక్ష నాయకులు ఆసక్తి చూపలేదు. అంతేకాదు.. తమకు సంబంధించినంత వరకూ పార్లమెంట్​ సమావేశాలు పూర్తిగా నిష్ప్రయోజనమేనని తమ ప్రకటనల ద్వారా స్పష్టం చేశారు. తమ చర్యల ద్వారా ప్రతిపక్షం మొత్తంగా దేశాన్ని పూర్తిగా నిరాశలో ముంచింది. ప్రస్తుతం కొన్ని ప్రతిపక్షాల బాధ్యతారహిత రాజకీయాలకు నాయకత్వం వహిస్తున్నది ఘనమైన ప్రాచీన కాంగ్రెస్‌‌ పార్టీయే. ఈ ఏడాది మేలో పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలను తక్షణం ఏర్పాటు చేయాలని లోక్‌‌సభలో కాంగ్రెస్‌‌ నాయకుడు అధిర్‌‌ రంజన్‌‌ చౌదరి రాష్ట్రపతిని కోరారు. కరోనా మహమ్మారి పీడిత రాష్ట్రాల్లోని ఎంపీలు తమ తమ ప్రాంతాల్లో తలెత్తిన సంక్షోభ పరిస్థితులపై చర్చించడానికి పార్లమెంట్​ను సమావేశపరచడం అవసరమని అప్పుడు ఆయన చెప్పారు. కాంగ్రెస్‌‌ కొత్త మిత్రుడు, శివసేన ఎంపీ సంజయ్‌‌ రౌత్‌‌ కూడా పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల కోసం డిమాండ్‌‌ చేశారు. 
కరోనా నియంత్రణలో ఉన్నా కూడా..
పాలనా యంత్రాంగం మొత్తం కరోనా రెండో దశ నియంత్రణ కృషిలో నిమగ్నమై ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇలాంటి కరోనా మహమ్మారి పరిస్థితుల నడుమ పార్లమెంట్​లో భారీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు సమావేశం కావడం ప్రమాదకరం కాగలదని కూడా స్పష్టం చేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ప్రతిపక్షాలు ప్రకటనలు చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పటికి రెండు వారాలుగా సాగుతున్నాయి. అయితే, కరోనా రెండో దశలో పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల కోసం డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు ఒక్కరోజు కూడా పార్లమెంట్​ను సజావుగా నడవనివ్వకపోవడం విచిత్రం. అంతేకాదు.. కరోనా సంక్షోభంపై ప్రభుత్వ చర్యలను వివరించి, తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ప్రత్యేకంగా కలుద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేతలందర్నీ ఆహ్వానించారు. కానీ, పార్లమెంటు సమావేశాలు మొదలైనందున ప్రత్యేక భేటీ అవసరం ఏమిటని కాంగ్రెస్‌‌ సహా పలు పార్టీల నాయకులు ప్రశ్నించడమేగాక కేంద్ర ప్రభుత్వం చెప్పదలచిందేదో పార్లమెంట్​ సమావేశాల్లోనే తెలియజేయాలని డిమాండ్‌‌ చేశారు.
గందరగోళం సృష్టించడం కోసమే..
పార్లమెంట్​ సమావేశాలు మొదలయ్యాక పెద్దల సభగా పేరున్న రాజ్యసభలో సీనియర్‌‌ మంత్రి చేతిలో నుంచి కాగితాలు లాగిపారేయడంతోనే ప్రతిపక్ష నేతల్లోగల కపట శ్రద్ధ కాస్తా తొలి వారంలోనే మాయమైంది. ఇక లోక్‌‌సభలో సమావేశ నిర్వహణ కార్యక్రమ కాగితాలను చింపి, స్పీకర్​ మీదకు విసరడం ద్వారా ప్రతిపక్ష సభ్యులు సభా మర్యాదను మంటగలిపేలా ప్రవర్తించారు. వారు విసిరిన కాగితపు ముక్కలు స్పీకర్​ స్థానానికి ఎగువనగల ప్రెస్‌‌ గ్యాలరీలోనూ పడ్డాయి. చివరకు సభా కార్యక్రమాలను నమోదు చేసే అధికారులు కూడా కొన్ని ప్రతిపక్షాల హింసాత్మక వైఖరి నుంచి తప్పించుకోలేని దుస్థితి ఏర్పడింది. మరోవైపు తమ బాధ్యతారహిత వైఖరిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా పెగాసస్‌‌ సమస్యను ప్రతిపక్షం కవచంలా వాడుకుంది. కానీ, పెగాసస్‌‌ అంశంపై సంబంధిత శాఖా మంత్రి పార్లమెంట్​ ఉభయ సభల్లోనూ ప్రకటన చేశారు. లోకసభలో మంత్రి ప్రకటనపై ప్రతిపక్షం సంతృప్తి చెందకపోతే.. నిబంధనల ప్రకారం దానిపై వివరణ కోరేందుకు రాజ్యసభ సరైన వేదిక. కానీ, ప్రతిపక్షం మాత్రం గందరగోళం సృష్టించి, అక్కడ మంత్రి ప్రకటనను వినిపించకుండా చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.
అన్ని అంశాలపై చర్చలకు కేంద్రం సిద్ధం
కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న వేళ సమైక్యంగా దానిపై పోరాడటానికి బదులుగా కేంద్ర ప్రభుత్వ కృషిని దెబ్బతీయడానికి మాత్రమే ప్రతిపక్షాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కోసం డిమాండ్‌‌ చేశాయి. నేడు దేశ ప్రజల ప్రయోజనాలతో సంబంధమే లేని పెగాసస్‌‌ వంటి ఓ కల్పిత సమస్యపై ఎలాంటి రుజువులు, ఆధారాలు లేని వాదనతో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. లోగడ కూడా దేశ ప్రజల మనోభావాలను అవగతం చేసుకోకుండా ప్రతిపక్షం ఇదే తరహా కుతర్కం ప్రదర్శించినందుకు తగిన మూల్యం చెల్లించింది. వారికి ఇప్పుడు కూడా అదే దుర్గతి పట్టడం ఖాయం. ఉభయ సభల్లోనూ నియమ-నిబంధనల ప్రకారం.. రాజ్యసభ చైర్మన్, లోక్‌‌సభ స్పీకర్​ ఆదేశాలకు అనుగుణంగా అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధమేనని కేంద్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తూనే ఉంది. ఆ మేరకు కరోనా మహమ్మారి, రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, వరదలు వగైరాలన్నింటిపైనా చర్చిద్దామని చెబుతూనే ఉంది. చివరకు పెగాసస్‌‌ మీద కూడా ఎలాంటి జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రకటన చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్‌‌ మాత్రం ‘గిచ్చి రచ్చకక్కే’ పద్ధతినే అనుసరిస్తోంది. ప్రతిపక్షం మొత్తం తమ ప్రతికూల-ప్రతిబంధక పద్ధతిని తమ వైఖరిగా చాటుకుంటుండగా, పార్లమెంటులో చర్చకు, సభ సజావుగా సాగడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ప్రతిపక్షాల సానుకూల వైఖరిని కాంగ్రెస్‌‌ పార్టీ చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉంది.
ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఏది?
ఇక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యత గురించి నాయకులు ప్రకటిస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో ఒక్కొక్క అంశంపైనా చర్చ సాగేకొద్దీ సదరు నామమాత్రపు ఐక్యత చెల్లాచెదరు కాగలదన్న భయం కూడా కారణమై ఉండొచ్చు! అదే నిజమైతే ప్రతిపక్షాల ఐక్యతలోని డొల్లతనం రోజురోజుకూ ప్రస్ఫుతమవుతున్నదని చెప్పడం సబబుగా ఉంటుంది. ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌‌ పార్టీ పిలుపునిస్తుండగా, తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌ ఎంపీలు అదృశ్యం అవుతున్నారు. అదేవిధంగా తృణమూల్‌‌ నేతలు ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసే సమయంలో కాంగ్రెస్‌‌ దూరంగా ఉంటోంది. అసలు వాస్తవం ఏమిటంటే- మహమ్మారి విజృంభణ వేళ పరిష్కారంలో భాగస్వాములు కావడానికి బదులు కొన్ని పార్టీలు రాజకీయ కాలుష్య వ్యాప్తిలో మునిగాయి. ఆ విధంగా ఈ జాతీయ విపత్తును అవి ఒక రాజకీయ అవకాశంగా మలచుకోదలిచాయి.
ప్రతిపక్షం ఎందుకు పారిపోతోంది?
ప్రతిపక్షం వ్యవహార శైలి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన సందేహాలు తలెత్తుతున్నాయి. కరోనాపై ప్రభుత్వ ఏకాగ్రతను పక్కదోవ పట్టించే ఎత్తుగడలో భాగంగానే పార్లమెంట్​ అత్యవసర సమావేశాల కోసం డిమాండ్‌‌ చేసిందా? ఈ అంశంపై చర్చించాలన్నదే నిజంగా ప్రతిపక్షం ఉద్దేశమైతే దాదాపు రెండు వారాలుగా సాగుతున్న సమావేశాల్లో చర్చ నుంచి ఎందుకు పారిపోతున్నట్టు? దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ నియంత్రణలో ఉన్నా ప్రతిపక్షాలు అధికారంలోగల కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న కారణంగా ఈ చర్చలో తమకు ఎదురుదెబ్బ తప్పదన్న భయంతో వెన్నుచూపుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. లేక విస్తృత చర్చ కొనసాగితే తమ పార్టీల ముఖ్యమంత్రుల అసమర్థత బయటపడుతుందని ప్రతిపక్షాలు భయపడుతున్నాయేమో?