- అంత ఖర్చు పెట్టినందుకే నీళ్లొస్తున్నయ్: సీఎం కేసీఆర్
- నో డౌట్ .. మనది ధనిక రాష్ట్రమే
- రైతులను కోటీశ్వరులను చేస్త అని చెప్తలేను.. వాళ్ల బాగే మా లక్ష్యం
- రోహిణి కార్తెలో నాట్లు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నయ్
- మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం ప్రారంభం
- అడవులు కాపాడేందుకు ప్రత్యేక ఇంటెలిజెన్స్ టీమ్
మెదక్/నర్సాపూర్, వెలుగు: తెలంగాణ డెఫినెట్‌గా ధనిక రాష్ట్రమేనని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని , గట్టిగా ధైర్యం చేస్తే వెయ్యి కోట్లు వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా లక్ష కోట్లకు పెరిగిందని కొందరు అంటున్నారని, అలాంటివాళ్లకు కాళేశ్వరం నీళ్ల ద్వారా రైతులకు ఎంత మేలు జరుగుతున్నదనే విషయం తెలియదని విమర్శించారు. కలప స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులను కాపాడేందుకు ఎంత ఖర్చయినా చేస్తామని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని అర్బన్ పార్క్‌ను గురువారం సీఎం కేసీఆర్ ఓపెన్ చేశారు. అక్కడే మొక్కలు నాటి ఆరో విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్బన్ పార్క్ ఏరియాలో నిర్మించిన వాచ్ టవర్ పై నుంచి నర్సాపూర్ అడవి అందాలను చూశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.సీఎం ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
కాళేశ్వరానికి లక్ష కోట్లా అన్నోళ్లు ఉన్నరు
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు పాములపర్తి దాకా వచ్చినయ్. యాడాది లోపే నర్సాపూర్ దాటి సంగారెడ్డికి అందుతయ్. చాలా మందికి పడదు.. మాటలు మాట్లాడుతరు. గదేం ఖర్చు వయా.. గా నమూన్నావయా ఖర్చు పెట్టుడు.. లక్షకోట్లా కాళేశ్వరానికి అని మాట్లాడినోళ్లు కూడా ఉన్నరు. నువ్వోడివిరా భయ్ అంటే.. ఎకానమిస్ట్ అంటడు. వాడి బొంద ఎకానమిస్ట్. తిండికి సస్తున్నమురా అంటే.. వాడు ఇంగ్లిష్‌ల ఏదో చెప్తడు. అట్ల అనేటోళ్లకు ఇక్కడ ఏం జరుగుతుందో తెల్వది. నీళ్లను చూస్తుంటే రైతులకు కలిగే సంతోషం, వారి జీవితాల్లో కలిగే మార్పు కనిపించినయ్. ఇవాళ ఎవ్వల దగ్గర పైసలు లేకున్నా రైతుల దగ్గర ఉన్నయ్. కాళేశ్వరం నీళ్లొస్తే రైతులు మొగులుకు ముఖం పెట్టి చూడాల్సిన అవసరమే ఉండదు. రోహిణి కార్తెలోనే నాటు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నయ్. యాడాది గడచిన తర్వాత నర్సాపూర్ ఏరియాకు వస్తే నాగార్జున సాగర్‌కు పోయినట్టు కనిపిస్తది.
అద్భుతంగా సౌండ్ ఎకానమీ ఉంది
డబ్బులది సమస్య కానే కాదు. గట్టిగ ధైర్యం చేసి నాలుగు అడుగులు చేస్తే వెయ్యి కోట్లు వస్తయి. మనం గరీబోళ్లం కాదు.. అద్భుతంగా సౌండ్ ఎకానమీ ఉంది. తెలంగాణ డెఫినెట్‌గా ధనికరాష్ట్రమే. దాంట్ల డౌట్ లేదు. ఎవడో సన్నాసి.. తలకు మాసినోడు ఏదో మాట్లాడుతడు. అది లెక్క కాదు. అధికారికంగా నేను చెప్తున్న.. వంద శాతం మనది అద్భుతమైన రాష్ట్రం. ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే. పైసలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చినం. కొద్దిగా వెసులుబాటు కావడంతో మళ్లీ పికప్ అయినం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు ఆపినం గానీ.. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఫండ్స్ ఆపలేదు. రైతులకు పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దని రైతు బంధు పైసలు ఖాతాల్లో జమ చేస్తున్నం. రైతులకు పైసలిచ్చి.. మాకు ఆపిండ్రెందుకని ఓ ఎంప్లాయ్ లీడర్ అంటే ఒకటే చెప్పిన.. రైతులకు ఇచ్చెటందుకే మీకు ఆపినం అని చెప్పిన. రూ. 25 వేల లోపు లోన్ ఉన్న ఆరు లక్షల మంది రైతులకు ఒకేసారి రుణమాఫీ వర్తింపజేసినం.
కలప స్మగ్లర్లపై కఠిన చర్యలు
అడవుల్లో చెట్లు నరికి కలప స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటం. అక్రమ కలప రవాణాపై నిఘా కోసం ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినం. ఎక్కడ చీమ చిటుక్కు మన్నా నాకు ఇంటెలిజెన్స్ రిపోర్టు వస్తది. ఇక నుంచి కలప దొంగలను ఎవరూ కాపాడలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ పరిధిలో అయినా కలప స్మగ్లింగ్ జరిగితే వారిపై యాక్షన్ తీసుకోవాలని పీసీసీఎఫ్ శోభకు ఆదేశిస్తున్న. తెలంగాణ అడవిని స్మగ్లర్లకు అప్పగించి మాయం చేసిన గత పాలకులు ఇప్పుడు పెద్ద నోరు పెట్టుకుని అడవుల గురించి ఏదేదో మాట్లాడుతున్నరు. వాళ్లకు సిగ్గుండాలె. గతంలో ఎక్కడ వాన పడకున్నా నర్సాపూర్ అడవిలో పడేది. హైదరాబాద్ నుంచి ఎంతో మంది ఇక్కడికి వేటకు వచ్చే వారు. తరచూ సినిమా షూటింగ్‌లు జరిగేవి. అడవి క్షీణించడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అడవుల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను గుర్తించే అడవులను కాపాడేందుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నది. అడవులకు పూర్వ వైభవం తీసుకురావడమే హరితహారం ఉద్దేశం. ఇందుకోసం ఎన్ని పైసలైనా ఖర్చు పెడుతం. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్లో రెండు వేల ఉద్యోగాలు భర్తీచేసినం. 2,200 వెహికిల్స్ ఇచ్చినం. మీకు దండం పెట్టి చెబుతున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అందరూ శ్రద్ధ తీసుకుని పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్ సమకూర్చినం. హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసేందుకు వాటిని వాడాలి.
రైతులనేదో కోటీశ్వరులను చేస్త అని చెప్పలేదు
రైతులు బాగుపడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఆరు నూరైనా సరే వందశాతం రైతు బాగుపడి తీరాలి. నేను కోరింది ఒక్కటే.. రైతులనేదో కోటీశ్వరులను చేస్తనని నేను చెప్తలేదు. అట్ల డమ్కీలు చెప్తే కరెక్ట్ కాదు. రైతుకు కావాల్సింది ఏమిటంటే.. ఉన్న అప్పులు తీరిపోవాలి. రైతుకు సొంతంగా రెండు లక్షలో నాలుగు లక్షలో ఉంటే.. పంటకు సొంతంగా పెట్టుబడి పెట్టుకోగలడు. రైతుల మేలు కోసమే నియంత్రిత సాగు విధానం ప్రవేశ పెట్టినం. డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి. పంటల ఉత్పత్తులు కొనుగోలు ఎలా చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్న. ఏ ఒక్క రైతు కూడా పంటల ఉత్పత్తులను అమ్ముకునేందుకు తిప్పలు పడొద్దనేది నా ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్ కేంద్రాల్లో వీటిని వచ్చే యాసంగి సీజన్ వరకల్లా పూర్తి చేయాలని ఆదేశించినం. నేనే స్వయంగా హైదరాబాద్ నుంచి రైతు వేదికలతో కనెక్ట్ అయి రైతులతో మాట్లాడుత.’’ అని కేసీఆర్ చెప్పారు.