నేను ఓడిపోతనంటే మీరే నమ్మితె ఎట్ల? : కేటీఆర్​

సిరిసిల్లలో తాను ఓడిపోతానని ఎవరో ఏదో అంటే.. బీఆర్ఎస్ నేతలే ఆ మాటలు నమ్మితే ఎట్లా? అని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘నేను ఓడిపోతున్నానని వాడెవడో వీడెవడో రాసిన్రు.. దానిని మీరు పట్టుకుంటరా? ఆ ఊళ్లె బాగాలేదు.. ఈ ఊళ్లె బాగాలేదు అని మీరే చెప్పుకుంటే ఎట్లా? మౌత్ టాక్ పుట్టిచ్చి మనకేదో మెజారిటీ తగ్గుతుందని మనోళ్లే పిచ్చి మాటలు మాట్లాడి నెత్తి ఖరాబు చేసుకుంటున్రు.. ఈ మాటల వల్ల మన పరిస్థితి ఏడిదాకా వచ్చిందో చూడున్రి.. మనం ఎన్ని వేల కోట్లతో డెవలప్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయం నాకు అర్థమైంది..

’’ అని కేటీఆర్ ​సిరిసిల్ల లీడర్లు, కార్య కర్తలతో వాపోయారు. సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ మంగళవారం నిర్వహించిన​ టెలీ కాన్ఫ్ రెన్స్ బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిరి సిల్లలో గెలుపు కోసం కేటీఆర్ ఎదురీదుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆడియో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 

డోర్ ​టూ డోర్​ వెళ్లండి..  

కాంగ్రెస్ పార్టీ గాలి వార్తలు పుట్టిస్తున్నదని.. సిరిసిల్లలో ఏమో అవుతోందంట అనే బక్వాస్ మాటలు ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ లో ఫైర్ అయ్యారు. ‘‘ఇంక వారం రోజులే మిగిలింది.  బీఆర్ఎస్ కౌన్సిలర్లు,  మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు డోర్ టూ డోర్ ప్రచారం చేయండి. దయచేసి కోరుతున్న. గాలి వార్తలు నమ్మద్దు. వాడొగడు, వీడొగడు  బఫూన్​గాళ్ల మాటలు పట్టించుకోవద్దు. సిరిసిల్లలో కేటీఆర్ పరిస్థితి కిందమీద అయితందని కన్​ప్యూజన్ కావద్దు. నేను15 మంది కౌన్సిలర్లతో మాట్లాడిన. అందరూ చెప్పేది ఏందంటే నా వార్డు గొప్పగా ఉందన్నా.

కానీ పక్క వార్డే బాగాలేదు. కొద్దిగా దాన్ని చూసుకోండి అని చెప్తున్నరు. సర్పంచ్ లు కూడా అదే అంటున్నరు. దయచేసి కార్యకర్తలు ఆ పని చేయకండి. నేను సర్వే చేయించిన. మనం మంచి మెజార్టీతో గెలుస్తున్నం. నాయకులు, కార్యకర్తలు ఆగం కావద్దు. అభివృద్ధిని వివరించండి. బీఆర్ఎస్​ లేకపోతే సిరిసిల్లలో సాంచాలు అమ్ముకునే పరిస్థితి వస్తదని చెప్పండి. నాకు ఒక్కటైతే తెలిసిపోయింది. ఎన్ని వేల కోట్లు వెచ్చించి డెవలప్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉండాలనే సూత్రం అర్థమైంది. మళ్లీ మనం గెలిచాక ఆ పని చేద్దాం’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.