
కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తొలినాళ్ల నుంచి జరుగుతున్న దాడి ఒక ఎత్తయితే, తాజాగా సీఎం రేవంత్ పాలనానుభవంపై గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చ మరోఎత్తు. అసలు పాలనానుభవానికి కొలమానాలేంటి? రేవంత్‌కు పాలనానుభవం లేదని బీఆర్ఎస్ నేతల రాజకీయ విమర్శల వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
రాజకీయ ఎత్తుగడా లేక పాలన చేజారిందన్న అక్కసా.. ఏదేమైనా ఇటీవల బీఆర్ఎస్ నేతలు వాళ్ల సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో సీఎం రేవంత్ రెడ్డి పాలనానుభవం, నిర్ణయాలపై రకరకాల ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పాలనలో పట్టు రాలేదని అంటున్నారు. మరోవైపు అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితం అవడం, సచివాలయానికి రాకపోవడంపై మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ప్రభుత్వాలేవైనా, నాయకుడెవరైనా పౌరసమాజాన్ని అధ్యయనం చేయగలిగినప్పుడే ఆ సమూహంపై పట్టు సాధించినట్టు లెక్క. వాస్తవానికి రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించాలంటే రాజనీతి శాస్త్రం పుస్తకాలక్కర్లేదని అనేకమంది ప్రముఖులు నిరూపించుకున్నారు. ఏ అనుభవం లేకపోయినా ఇందిరాగాంధీ ప్రపంచంలో శక్తిమంతమైన మహిళగా, ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కష్టకాలంలో దేశంలోనే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆ పదవికే వన్నె తెచ్చారు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించి, 1983లో ముఖ్యమంత్రి అయ్యారు.
సీఎంగా రేవంత్ తనదైన ముద్ర
కేవలం ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వైఎస్సార్ 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. పేదలకు అండగా, రైతుల సంక్షేమానికి కట్టుబడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్ కూడా సీఎంగా పాలన అనుభవం లేకుండానే 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే, ఆయన పాలనను వద్దనుకున్న తెలంగాణ సమాజం సీఎంగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. రాజకీయ సమర్థతతో అధికారంలోకి రాగలిగిన రేవంత్‌రెడ్డి, నిరంతరం పాలనపై సమీక్షలు చేస్తునారు. సెక్రటేరియెట్కే వెళ్లని కేసీఆర్ కన్నా రేవంత్‌రెడ్డి చాలా నయం అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పాలనపై పట్టు సాధించనిదే, రేవంత్ సర్కార్ వేలాది కొలువులు నింపగలిగిందా? డ్రగ్స్ మాఫియాను, బెట్టింగ్ గేమ్ లను కట్టడి చేయగలుగుతున్నదా? పాలనపై పట్టు సాధించారా లేదా అనేది ప్రజలకు బాగా తెలుసు.
‘గ్రోక్’ ఏఐలో చర్చ
గత కొంతకాలంగా అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డిల పాలనల తీరుతెన్నులపై జరుగుతున్న చర్చ రాజకీయ పార్టీలకే పరిమితం కాలేదు. వీరిద్దరి పాలనా శైలిపై, ప్రజాభిప్రాయ ఆధారంగా కృతిమ మేధ (ఏఐ) గ్రోక్ లోనూ విశ్లేషణ జరుగుతున్నది. గ్రోక్ ఆధారంగా విశ్వవ్యాపితమైన కొంత సమాచారాన్ని సేకరిస్తే కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని, పరిపాలనను స్థిరపరచడంలో ఆయనకు అనుభవం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతుబంధు సహా కొన్ని పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. అప్పుల భారం, అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన.. ఆయన వైఫల్యాలకు మచ్చుతునకలు. అధికార కేంద్రీకరణ , ఆయన పాలన ఒక నియంత పాలనగా, ఓ సమస్యగా గ్రోక్ చెబుతున్నది.
అభాసుపాలైన కేసీఆర్ పాలన
కాళేశ్వరం ప్రాజెక్టుతో అభాసుపాలైన ఆయన పదేండ్ల పాలనను ఎక్కిరించిన దుస్థితి ఒక ఎత్తయితే.. గోదావరి, కృష్ణా జలాల వాటా పదేండ్ల దాకా తేల్చకపోవడంతో ఆయన పాలనానుభవాల్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సమైక్యవాదులకు వ్యతిరేకంగా తెలంగాణవాళ్ల కోసం రాష్ట్రం తెచ్చుకున్నా కాళేశ్వరం, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, అమరవీరుల స్తూపం సహా ప్రతి నిర్మాణంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రా కూలీలకే అవకాశమివ్వడం విమర్శలకు తావిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర గీతం లేకపోవడం, తెలంగాణ తల్లిని అధికారికం చేయకపోవడం వంటి వాటితో సహా తెలంగాణలో 80 శాతంగా ఉన్న బహుజనుల అస్తిత్వాన్ని దెబ్బతీసారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి ఆ వర్గాలకు పైసా ప్రయోజనం చేకూర్చకపోగా ఏటా రూ. వెయి కోట్లు ఎంబీసీ కార్పొరేషన్లో వేస్తామని మరిచారు. ఇలా చెప్పుకుంటే శాఖలవారీగా లోపాలు, వైఫల్యాలు బోలెడున్నాయి.
కేసీఆర్ తప్పులను సరిదిద్దుతున్న రేవంత్
పాలమూరు జిల్లా స్వతంత్ర జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా, పీసీసీ చీఫ్‌గా పనిచేసి ప్రజలతో నేరుగా మాట్లాడే శైలి, యువతను ఆకర్షించే వాగ్ధాటితో రేవంత్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలతో ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని వదలి ప్రగతి భవన్ ముళ్ల కంచెలు బద్దలు కొట్టి దాన్ని ప్రజాభవన్‌గా మార్చారు. ఉచిత బస్సు, రైతు రుణమాఫీ వంటి పథకాలను ఆరంభించారు.
వాస్తవానికి పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచే ఒక్కో విభాగంపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుని దిశా నిర్దేశం చేస్తున్నారు. రూ.21,000 కోట్లతో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం, ఏడాదిన్నరలోనే 59 వేల ఉద్యోగాలివ్వడం, ప్రధానంగా మంత్రులకు పూర్తి స్థాయిలో స్వేచ్చ ఇవ్వడం వంటి అంశాల్లో కేసీఆర్ తప్పులను రేవంత్ సరిదిద్దుతున్నారని చెప్పాలి.. పాలనపై పట్టు కాదా ఇది?
ఖుల్లం ఖుల్లా
ఏడున్నర లక్షలకోట్ల అప్పులతో ఉన్న రాష్ట్రంలో హామీల అమలు అనుకున్న టైంలో సాధించడం కష్టం. ఎలాగైనా హామీలు నెరవేరుస్తాం కాస్త టైం ఇవ్వండంటూనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రజల ముందుంచుతున్నారు. ఖుల్లం ఖుల్లాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అప్పులు, పాలనా వైఫల్యాలను విశదీకరిస్తున్నారు. అయితే, అప్పులున్నాయని రాష్ట్ర పరువు తీస్తున్నారని, రేవంత్‌కు పాలనానుభవం లేదని బీఆర్ఎస్ రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నది. కానీ, అబద్ధాలు చెప్పి మోసం చేసేవారికన్నా, ఉన్న పరిస్థితిని నిర్భయంగా చెప్పేవాడే నిజమైన నాయకుడని ప్రజలు నమ్ముతున్నారు.
కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణన చేపట్టడం, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంతో పాటు ఇటీవల ఎమ్మెల్సీల ఎంపికలోనూ సామాజిక వర్గాల సమన్యాయం పరిఢవిల్లింది.పాలనపై పట్టంటే ఇది కాదా?
పరిపాలనా శైలి
కేసీఆర్‌తో పోలిస్తే రేవంత్ రెడ్డి తన మంత్రులకు ఎక్కువ అధికారాలు అప్పగించి ప్రోత్సహిస్తున్నారు. అధికారులతో సమీక్షలు, ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ పాలన నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులు భారంగా మారినా.. అన్ని సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతుండటమే రేవంత్ పరిపాలనపై పట్టు సాధించారనడానికి ప్రబల సాక్ష్యం.
పడిపోయిన బీఆర్ఎస్ ఓటు బ్యాంక్
అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో 37 శాతం ఓట్లతో ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్రనిచ్చినా కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. రూ.58 లక్షల జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదని అధికారపక్షం దుమ్మెత్తిపోసే దుస్థితిని ఆయనకు ఆయనే కొని తెచ్చుకుంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు బ్యాంక్ 17 శాతానికి పడిపోయింది. ఇటీవల మండలి ఎన్నికలకు ఒక రాజకీయ పార్టీగా పోటీకి దూరంగా ఉంది. అయితే పాలనానుభవం, ప్రజాకర్షక పథకాలపై ప్రజలకు నమ్మకం ఉంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేవాళ్లా అన్నది మననం చేసుకోవాలి. అధికారం కోల్పోయినా, ప్రజలు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా కనీసం అసెంబ్లీకి రాకపోవడం ఇప్పటికీ ఫాం హౌస్‌కే పరిమితం కావడం వల్ల కేసీఆర్ పట్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగింది.
-వెంకట్ గుంటిపల్లి,తెలంగాణ జర్నలిస్టుల ఫోరం-