ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమిటి ?

ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమిటి ?

ఒక నేరానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లేదా వ్యక్తులపై సంబంధిత పోలీస్ అధికారి చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి మొదటగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి విచారణ ప్రారంభించాలి. కానీ,  ప్రస్తుతకాలంలో  సంబంధిత  పోలీస్  అధికారులు వివిధ  కారణాల రీత్యా కొన్ని సందర్భాలలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తిరస్కరిస్తున్నారు. అలాంటి సందర్భాలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఫిర్యాదుదారుడు చేయవలసినది ఏమిటంటే.. ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇచ్చి మరొక కాపీపై వారికి ఫిర్యాదు అందజేసినట్టుగా  లిఖితపూర్వక  రిసీవ్డ్​ కాపీ  తీసుకోవాలి.

ఒకవేళ  పోలీస్ వారు రిసీవ్డ్ ఇవ్వకపోతే  ఫిర్యాదుదారుడు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత  ఎస్సై లేదా  సీఐ, డీఎస్పీ లేదా ఏసీపీ, ఎస్పీ లేదా డీసీపీ, సీపీ, డీజీపీ స్థాయి అధికారివరకు కూడా ఫిర్యాదు కాపీని చేరవేయాలి.  ఆ తరువాత  ఫిర్యాదు అధికారులకు చేరిన తరువాత రిజిస్టర్  పోస్ట్  డెలివరీ  కాపీలను,  మొదటగా పంపించిన ఫిర్యాదు కాపీకి  జోడించాలి.  సీఆర్పీసీ సెక్షన్ 200 ప్రకారం, నూతనంగా వచ్చిన చట్టంలోని సెక్షన్ 223 బీఎన్ఎస్ఎస్  ప్రకారం ఒక న్యాయవాది ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ను సంబంధిత  జ్యుడీషియల్  ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది.

ఆ తరువాత  ఫిర్యాదుదారుడికి జరిగిన అన్యాయాన్ని మెజిస్ట్రేట్ విన్నాక,  ఫిర్యాదుదారుడి తరఫున  సాక్షులను విచారించిన తరువాత తదుపరి విచారణ నిమిత్తం సెక్షన్ 175(3) బీఎన్ఎస్ఎస్  ప్రకారం మేజిస్ట్రేట్ సంబంధిత పోలీస్ వారికి తక్షణమే ఎఫ్ఐఆర్  నమోదు చేసి  నిర్ణీత గడువులోపు కోర్టులో  సమర్పించాలి అని ఆదేశాలు జారీ చేస్తారు. ఆ తరువాత నిర్ణీత సమయంలో పోలీస్ వారు సెక్షన్ 175(3) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఎఫ్ఐ ఆర్​ను నమోదు చేసి కోర్టుకు సమర్పిస్తారు.  ఆ తర్వాత  కేసును దర్యాప్తు చేసి  పూర్తి సమాచారాన్ని కోర్టుకి సమర్పిస్తారు.  కోర్టు ద్వారా కాకుండా మొదటగా ఫిర్యాదుదారుడి ఫిర్యాదుతో అయితే సెక్షన్ 173 బీఎన్ఎస్ఎస్  ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.

శివ, తెలంగాణ హైకోర్టు న్యాయవాది