
ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే చాలు... జనాలు చాలా జాగ్రత్తగా మెలుగుగారు. ఎందుకంటే.. తోటి ఉద్యోగులు.. ఇంట్లో వారు.. బంధువులు.. స్నేహితులు.. ఇలా మనకు తెలిసిన వారందరు ఎక్కడ ఫూల్స్‌ను చేస్తారోనని అప్రమత్తంగా ఉంటారు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా చాలామంది ఫూల్స్ అవుతుంటారు.. అందుకు ఏప్రిల్ ఫస్ట్ .. ఫూల్స్ డే స్పెషల్ ప్రత్యేక కథనం..
ఏప్రిల్ ఫస్ట్ ... ఆ రోజు... ఫూల్స్ డే... ఉన్నవి, లేనివి ఎక్కడెక్కడివో కథలు చెప్పి పక్కోళ్లను ఆటపట్టించి, వాళ్లు దాన్ని నమ్మేసరికి 'హేయ్..ఏప్రిల్ పూల్..' అని అరవడమే ఏప్రిల్ ఫస్ట్ స్పెషల్. ఏప్రిల్ ఫస్ట్ ... ఫూల్స్ డే గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం..
ఎందుకు ఏప్రిల్ ఫూల్...
ఏప్రిల్ ఒకటిన జనాలను ఆటపట్టించి ఫూల్స్ చేయడమనేది ఎలా వచ్చిందన్న దానిపై చాలా కథలు ఉన్నాయి. అందరూ నిజమని నమ్మేది మాత్రం ఒకటి ఉంది. 1582లో జూలియన్ క్యాలెండర్ నుంచి జార్జియన్ క్యాలెండర్ వైపునకు సమాజం మారింది. జార్జియన్ క్యాలెండర్లో కొత్త సంవత్సరం జనవరి 1న ఉంటుంది. జూలియన్ క్యాలెండర్లో ఇది ఏప్రిల్ 1. అయితే ఈ కొత్త క్యాలెండరు ఇంకా అలవాటు పడని కొంతమంది జనం మాత్రం ఏప్రిల్ ఒకటినే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే...ఏయ్.. ఏప్రిల్ ఫూల్స్... అని ఆట పట్టించారట. అప్పట్నుంచి ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఫూల్స్ అనటం కామన్ అయిందని చెప్పుకుంటారు. అందుకే ప్రపంచమంతటా ఏప్రిల్ ఫస్ట్ ను ఫూల్ డేగా సెలబ్రేట్ చేస్తుంటారు
ఇప్పటికి పాపులర్ ..!
'ఏప్రిల్ ఫూల్' అని ఆటపట్టించడంలో పిల్లలు నెంబర్ వన్ ఉంటారు. ఏ తరం పిల్లలకైనా ఇది రొటీన్. 'నీ మీద బల్లి పడింది', 'ఆ షర్ట్ మీద రంగేంటి?', 'పెన్ ఇంకు పడింది' అని రకరకాల ప్రాంక్స్ చేసి ఏప్రిల్ ఫూల్ ఆటలు ఆడుతుంటారు పిల్లలు. ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేయడానికి వాళ్లకంటూ కొన్ని ప్లాన్లు ఉంటాయి. ముందుగా ఎవరిని ఫూల్ చెయ్యాలో వారిని దూరం నుంచి పసిగట్టి అప్పటికప్పుడు పైన చెప్పిన మాటలే ఏదో ఒకటి రెడీ చేసుకుంటారు. వాళ్లు దగ్గరికి రాగానే ఆ మాటను అనేస్తారు. వాళ్లు నిజమేనేమో అని నమ్మేసరికి, 'ఏప్రిల్ ఫూల్' అని గట్టిగా అరుస్తారు. దీన్నంతా ఒక ఆటలా, కనిపించిన ఫ్రెండ్స్ అందరితో ఆడేస్తూ ఉంటారు. ఏప్రిల్ ఒకటంటే పిల్లలకు పెద్ద సరదా. ఇంకొందరు పిల్లలైతే ఏకంగా నెలంతా 'ఏప్రిల్ ఫూల్' ఆటలోనే మునిగి తేలుతుంటారు
స్టార్టప్ కంపెనీల స్ట్రాటజీ
'ఏప్రిల్ ఫూల్ డే'ని సరిగ్గా వాడుకున్నదంటే స్టార్టప్ కంపెనీలనే చెప్పాలి. 'ఓయో, ఓలా, అర్బన్ లాడర్' లాంటి సంస్థలు ఈ రోజుని తమ బ్రాండింగ్ కోసం బాగా వాడుకున్నాయి. 'ఓయో' స్మార్ట్ కాయిన్స్ తీసుకొస్తున్నట్టు ఆట పట్టించింది. 'ఇది తింటే మీ వయసు తగ్గిపోతుంది' అని ఊబర్ ఈట్స్ సోషల్ మీడియాలో చేసిన ఏప్రిల్ ఫూల్ యాడ్ సూపర్ హిట్ అయింది. ఈ యాడ్స్ అంతకుముందు అసలు పరిచయమే లేని కంపెనీలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయి. స్టార్టప్ కంపెనీ స్ట్రాటజీల్లో ఏప్రిల్ ఒకటిని వాడుకోవడం కూడా ఒకటి.
–వెలుగు,లైఫ్–