
బ్రహ్మ నిర్వాణము పొందిన వారికి నియమబద్ధమైన ప్రవర్తన సహజమై ఉంటుంది. అది ప్రయత్నపూర్వకం కాదు. దానికి కారణం వారు విదితాత్యులు అయి ఉండటమే. ''ఆత్మ' అంటే ఏమిటో తెలిసినవాడు విదితాత్ముడు.. ఆత్మ అంటే 'తాను'. అలాంటి వాడికి కామ క్రోధాలు ఉండవు. ఎందుకంటే ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి 'నేను'లో అంతర్భాగం అయి ఉంటాయి. వాటికి ప్రత్యేక అస్తిత్వం లేనప్పుడు కోరికలకి తావెక్కడ? కోరికలు లేనప్పుడు క్రోధం, దాని వెంట నడిచి వచ్చే మిగిలిన శత్రువులు ఉండవు.
అసలు 'నేను' అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్నైనా 'నాది' అంటామే కాని, దేనిని కూడా 'నేను' అనము కదా. శరీరం 'నేను' కాదు కనుక, మనసు నేను అవుతుందా? అలా చూసినా 'నా మనసు' అంటాము. కనుక మనసు 'నాది', అంటే 'నేను' కాదు.
'నేను' అనేది సముద్రం వంటిది. అందులో ఎగసిపడే అలల వంటివి 'నేను' అనే మాట ఉపయోగించినప్పుడు కలిగే భావనలు, దీనిని గమనించగలిగిన వాడు విదితాత్ముడు. గమనించి, అర్థం చేసుకుంటే ఎగసిపడే అలల వంటి వాటిలో చిక్కుకోడు. చూస్తూ ఉంటాడు. సముద్రం అలలలో చిక్కుకోదు కదా. అలలనన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. ఈ స్థితిని చేరుకున్న వానికి తనలో ఉన్న అన్ని భావనలు, పరిసరాలు, సమస్తం అఖండంగా కనిపిస్తాయి.
Also Read : కర్బూజతో మిల్క్ షేక్, రసగుల్లా, కస్టర్డ్
- కొండ మీద నిలబడిన వ్యక్తికి దిగువన ఉన్న గ్రామాలన్నీ స్పష్టంగా కనపడినట్టు.. అంతా అఖండంగా కనిపిస్తుంది కనుక అతడిపై వాతావరణం, పరిసరాలు ప్రభావాన్ని చూపించవు. అవి ఉండవని కాదు. అద్దంలో ప్రతిబింబంలాగా కనబడతాయే కాని, కాగితం మీదనో, వస్త్రం మీదనో అంటుకున్నట్టు అంటుకోవు. కాగా పరిసరాల మీద అతడి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. దేనినీ కోరకుండా. వద్దనకుండా ఏది జరిగినా అనందిస్తూ ఉంటాడు.
ఆటలో మునిగిన పిల్లలకి పరిసరాల ధ్యాస ఉంటుందా? పరిసరాలే కాదు, ఇంద్రియార్థాలు కూడా ప్రభావం చూపవు. అతడి కంటికి చూడదలచినది మాత్రమే కనబడుతుంది. చెవికి వినదలచినది మాత్రమే వినబడుతుంది. తినదలచినది తింటాడేకాని రుచి కోసం తినటం ఉండదు. దీనిని ఇంద్రియ నిగ్రహం అంటారు. కాని అది ప్రయత్నపూర్వకం కాక అప్రయత్నసిద్ధమై ఉండాలి.
ప్రయత్నిస్తున్నంత సమయం మనసు వాటినే తలుచుకుంటూ ఉంది కదా. ప్రారంభ దశలో ప్రయత్నం ఉన్నా క్రమంగా అది అప్రయత్నంగా సిద్ధించాలి. మనసు లయమైనప్పుడు మాత్రమే అది కుదురుతుంది. ఆ స్థితి మానవులు పొందగలరనటానికి ఎన్నో ఉదాహరణలు నిత్యజీవితంలో కనపడుతూ ఉంటాయి..
సంగీత ప్రియులకి తమకి ఇష్టమైన సంగీతం వింటున్నప్పుడు, క్రికెట్ ప్రేమికులకి ఆట చూస్తున్నప్పుడు, పుస్తకప్రియులకి మంచి పుస్తకం చదువుతున్నప్పుడు ఒళ్లు తెలియదు. తన్మయులైపోతారు. పిడుగులు పడినా వినబడదు. పెద్దపులి ఎదుట నిలబడినా కనపడదు. ఈ స్థితికి కారణం తమకి ఇష్టమైనది తప్ప మిగిలినవన్ని అప్రధానాలు అవటమే. అవి గమనిక నుండి తప్పుకుంటాయి.
రెండు భావాల సంఘర్షణ ఉండదు కనుక విదితాత్ముడు యతచేతస్సు కలవాడు. ఈ స్థితి సిద్ధించిన వాని ప్రజ్ఞయే నిజమైన 'తను'. దీనినే 'ఆత్మ' అని, బ్రహ్మజ్ఞానమని అంటారు. అందులో మిగిలిన భావాలన్నీ కరగిపోయి ఉంటాయి. ఈ బ్రహ్మనిర్వాణ స్థితి విదితాత్ముడికి సహజ స్థితిగా ఉంటుంది.
ఇందుకు సాధన ఎలా చేయాలి? ముందుగా భ్రూ మధ్యము నందు దృష్టిని నిలపాలి. దానితో మనసు ఊర్ధ్వముఖంగా కదులుతుంది. తనలో ఉన్న తనను గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల దృష్టి దాని మీదనే లగ్నం అవటంతో మనసులో తమకు చోటు లేకపోవటం వల్ల పరిసరాలు మొదలైనవి తప్పుకుంటాయి. 'తనని' గుర్తించటం ఎట్లా? దానికి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలని గమనించాలి - అంటే అవి ఎట్లా జరుగుతున్నాయి? గాలి పీల్చటం వదలటం నేను చేస్తున్నానా? నా చేత చేయించబడుతున్నాయా? అవే జరుగుతున్నాయా? అని ప్రశ్నించుకొని సమాధానాల కోసం చూడాలి.
అప్పుడు ఒక శక్తి వల్ల గాలి పీల్చటం. మరొక శక్తి వల్ల గాలి వదలటం జరుగుతోంది అని తెలుస్తుంది. అవే ప్రాణాపానాలు. వాటిని సమస్థితికి తేవాలి. అంటే హెచ్చు తగ్గులు లేకుండా, సమవేగంతో, ప్రశాంతంగా, దీర్ఘంగా గాలి పీల్చటం. వదలటం చేయాలి. క్రమంగా ఈ రెండు శక్తులు సమత్వం పొంది, అఖండమైన ఒకే శక్తిగాలి. పీల్చి వదలటం అనే రెండు పనులని చేయటం. జరుగుతుంది. ఆ తరువాత మనసుకి శ్వాసతో సౌమ్యం కలుగుతుంది. అంటే ఈ రెండు ఒకదానితో ఇంకొకటి లీనమవుతాయి. ఆస్థితి ఉన్నంత సేపు శ్వాస జరగదు. మనసు లేకుండా 'తాను' ఉంటాడు. మనసు లేదు కనుక ఇంద్రియాలు పనిచేయవు. మౌనం పాటిస్తాయి. కనుక ఆ స్థితిలో ఉన్న సాధకుణ్ణి 'ముని' అంటారు. మనసే లేదు కనుక భయము మొదలైన భావనలు ఉండవు. కనుక ముక్తుడు అనబడతాడు.
ముందు సాధన సమయంలో ఉన్న ఈ స్థితి నిరంతర సాధన వల్ల ఎల్లప్పుడూ ఉంటుంది. లౌకిక జీవనం సాగిస్తున్నా అది అతడికి పట్టదు. పసులు జరుగుతాయి, తాను చేయడు. తన ద్వారా జరపబడుతూ ఉంటాయి. అప్పుడు తాను చేసిన పని ఏదైనా యజ్ఞమై, తాను యజ్ఞభోక్త అవుతాడు. ప్రవృత్తి తపస్సు అయి, తపస్సుకి గమ్యం తానే అవుతాడు. ఈ తానే సర్వలోకమహేశ్వరుడు. సర్వజీవులకు హృదయము నందున్న మిత్రుడు ఆ స్థితియే శాంతి. విదితాత్ముడికి కలిగేది సర్వలోక మహేశ్వరత్వమే అని పురాణాలు చెబుతున్నాయి.