మాల్దీవుల నుంచి భారత సైన్యం వెనక్కి ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది?

మాల్దీవుల్లో భారత సైన్యం చివరి ట్రూప్ తిరిగి స్వదేశానికి చేరుకుంది. శనివారం (మే 11) చివరి భారత ఆర్మీ చివరి ట్రూప్ లో 76 మంది స్వదేశానికి చేరు కున్నారు. మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరణకు గడువు (మే 10) ముగియడంతో మాల్దీవులనుంచి ఆర్మీ వెనక్కి వచ్చేసింది. భారతదేశం బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ల నిర్వహణకోసం మాల్దీవుల్లోఉన్న 76 మంది భారత సైనికుల స్థానంలో పౌరు ఉద్యోగులతో భర్తీ చేశామని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ శనివారం ప్రకటిం చారు. 

మే నెల నాటికి తమ భూభాగంలో ఉన్న 80 మంది సైనికులను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు భారత్ ను కోరిన విషయం తెలి సిందే. ముయిజ్జు తీసుకున్న ఈ నిర్ణయం చైనా వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా మాల్దీవులు.. చైనాకు దగ్గరైనట్లు తెలుస్తోంది. 

మాల్దీవుల నుంచి విడతలవారీగా భారత బలగాలను ఉపసంహరించుకుంది. ఇటీవల మాల్దీవుల ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముయిజ్జు.. ఎన్నికల ప్రచారం నాటినుంచే భారత బలగాలను వెనక్కి పంపించే విషయంలో దూకుడుగా ఉన్నారు. మే 10  తేదీ తర్వాత యూనిఫాంలో గానీ, సాధారణ దుస్తుల్లో గానీ ఒక్క భారత సైనికుడు కూడా మాల్దీవుల్లో ఉండరని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల చెప్పారు. 

మాల్దీవుల్లో భారత సైనికులు ఏం చేస్తున్నారు?

మాల్దీవులకు సాయంగా అందజేసిన హెలికాప్టర్లు, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ కోసం సైనికులు అక్కడ ఉన్నారని భారత్ చెబుతోంది. ఈ హెలికాప్టర్లను భారత్ కొన్నేళ్ల కిందట మాల్దీవులకు అందజేసింది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్‌కు మాల్దీవులు చాలా కీలకం. ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంపై పట్టు సాధ్యమవుతుంది.

అయితే ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య దూరం పెరిగింది. భారత్,మాల్దీవుల సంబంధాల్లో నెలకొన్న సమస్యలను అనుకూలంగా మార్చుకుని ఆ ప్రాంతంలో పట్టు సాధించాలని చైనా కాచుకొని కూర్చుంది. 

సైనికులకు బదులు సాంకేతిక సిబ్బందిని నియమించేలా భారత్, మాల్దీవులు అంగీకరించినట్లు ఇటీవల వార్తలొచ్చిన క్రమంలో అందులో భాగంగా, సాంకేతిక బృందం మాల్దీవులకు చేరింది. ఈ క్రమంలో ముయిజ్జు నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

ఇటీవల ముయిజ్జు మాట్లాడుతూ మే 10 తర్వాత దేశంలో భారత సైనికులు ఎవరూ ఉండరు.. యూనిఫాంలో గానీ, సాధారణ దుస్తుల్లో గానీ ఎవరూ ఎండరు అని చెప్పారు. 

చైనాకి దగ్గరవుతున్న మాల్దీవులు

గత కొన్నేళ్లుగా చిన్న దేశమైన మాల్దీవులకు చైనా మిలియన్ డాలర్ల రుణాలు ఇస్తోంది. ఎక్కువ భాగం ఆర్థిక, నిర్మాణ రంగాల అభివృద్ధికి ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి.

గతంలో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్షులు భారత్‌లో పర్యటించేవారు. కానీ, ముయిజ్జు విషయంలో అలా జరగలేదు. ముయిజ్జు మొదట తుర్కియే..ఆ తర్వాత యూఏఈ, చైనాల్లో పర్యటించారు. ఇంతవరకూ భారత్‌కు రాలేదు.

చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముయిజ్జు మాట్లాడుతూ..మాది చిన్నదేశం అయినంత మాత్రాన మమ్మల్ని బెదిరించే హక్కు లేదన్నట్లుగా మారారు. ముయిజ్జు చేసిన ఈ ప్రకటనకు భారత్‌కు సంబంధం ఉన్నట్లుగా కనిపించింది. కానీ ముయిజ్జు భారత్ పేరును ప్రస్తావించలేదు.


చైనా,మాల్దీవుల ఒప్పందం

ఇటీవల మాల్దీవుల ప్రభుత్వం, చైనా మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం భారత్ ఆందోళనలను పెంచింది. ఎలాంటి చెల్లింపులూ లేకుండానే ఈ ఒప్పందం జరిగినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాల్దీవులకు చైనా భీకర ఆయుధాలను ఉచితంగా అందజేయనుందని, మాల్దీవుల భద్రతా దళాలకు శిక్షణ కూడా ఇస్తుందని మంగళవారం జరిగిన ర్యాలీలో ముయిజ్జు చెప్పారు.
గతంలో భారత్, అమెరికాలు మాల్దీవుల సైన్యానికి శిక్షణనిచ్చాయి.

మాల్దీవుల ఆందోళనలు

ముయిజ్జు భారత్‌తో దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ  చారిత్రకపరంగా చూస్తే భారత్ చాలాకాలంగా మాల్దీవులకు సాయం చేస్తోంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో కీలకం అయిన పర్యాటకానికి భారత్ దిక్కు. పర్యాటకుల్లో భారతీయులే ఎక్కువ.  అంతేకాకుండా ఔషధాలు, ఆహారం, నిర్మాణ రంగంలోని వినియోగించే వస్తువుల కోసం మాల్దీవులు భారత్‌పై ఆధారపడి వుంది. కరోనా సమయంలో మాల్దీవులకు వచ్చిన వ్యాక్సిన్‌లలోనూ అత్యధిక శాతం భారత్ నుంచే వచ్చాయి. 

ఈ ఏడాది మొదట్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన ఫోటోలపై ముయిజ్జు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు భారత్‌లో ఆగ్రహం వ్యక్తమైంది. కొన్ని టూరిజం కంపెనీలు కూడా మాల్దీవులను బహిష్కరించాలంటూ మాట్లాడాయి.

ఈ వివాదం తర్వాత ఇటీవలి రెండు నెలల్లో దాదాపు నాలుగు లక్షల మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. వారిలో 13 శాతం మంది చైనా పర్యాటకులు. వివాదానికి ముందు భారత్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది. ఈ వైఖరి కారణంగా మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం తన దేశంలోనూ విమర్శలను ఎదుర్కుంటోంది.