తెల్లవారుజాము 3, 4 గంటల మధ్య విశిష్టత ఏంటీ.. బ్రహ్మముమూర్తం అని ఎందుకు అంటారు.

తెల్లవారుజాము 3, 4 గంటల మధ్య విశిష్టత ఏంటీ.. బ్రహ్మముమూర్తం అని ఎందుకు అంటారు.

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలని పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి? తెల్లవారుజాము 3, 4 గంటల మధ్యే బ్రహ్మముహూర్తం ఉంటుందని పండితులు చెబుతున్నార.  అసలు  బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్ర లేవాలి...  బ్రహ్మముహూర్తం ఎప్పుడు? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం..

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే రోజూ పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల మధ్యలో నిద్ర లేవాలని చెప్తారు. పూర్వం ఆ సమయంలో కోడి కూసేది. కోడి కూసింది ఇక లేవండి అని మన తండ్రుల తాతలు.. అవ్వలు చెప్పుకొనేవారు.  చెప్పడమే కాదు వారు ఆచరించేవారు  కూడా. అందరికన్నా ముందుగానే లేచి వారి కార్యకలాపాలను ప్రారంభిస్తారు. కొన్ని నియమాలను పాటించారు కాబట్టే వారు ఇప్పటితరం వారికంటే దృఢంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు.

 పురాతన కాలంలో హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో (తెల్లవారుజామున 3 నుంచి 4 గంటలమధ్య)  మేల్కొలనాలని ఉంది. ఎప్పుడు లేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆయుర్వేద శాస్త్రంలో వివరంగా ఉంది. మన పెద్దవాళ్లు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడం మంచిది అని చెప్తారు. విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చదివితే వారికి ఎలాంటి క్లిష్టమైన విషయం అయినా సులభంగా అర్థం అవుతుంది. ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు అని గురువులు తరచూ సూచిస్తారు.

బ్రహ్మముహూర్తం ఎప్పుడు?

  • బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమై 88 నిమిషాలలో ముగుస్తుంది. ఈ 88 నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని కాల పురాణం చెబుతుంది. ఈ సమయంలో నిద్రలేచి కొన్ని కార్యకలాపాలు చేస్తే ప్రభావవంతంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. 

  • సూర్యోదయం కంటే ముందు లేదా సూర్యుడు ఉదయించేటపుడు మేల్కొంటే త్వరగా కార్యకలాపాలను పూర్తిచేసుకోవచ్చు. ఎక్కువ పగటి సమయాన్ని కలిగి ఉంటారు. దీంతో మరింత శక్తివంతంగా పనిచేయవచ్చు. రోజంతా చురుకుగా ఉంటారు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. 

  • జ్ఞానాన్ని పొందడానికి (ధ్యానం, ఆత్మపరిశీలన)
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి (విద్యార్థులకు)
  • మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి (పర్యావరణం ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది కాబట్టి)
  • పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి (మీ మానసిక దృష్టి పెరుగుతుంది, ఏకాగ్రతను బలోపేతం అవుతుంది)

ధ్యానం చేయడానికి, పుస్తకాలు చదవడానికి, వ్యాయామం చేయడానికి బ్రహ్మ ముహూర్తం అత్యుత్తమమైనదని పెద్దలు చెబుతుంటారు.  తెల్లవారు జామున బ్రహ్మముహూర్తం అతి ముఖ్యమైన సమయమని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తంలో మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీ జీవితంపై మీకు స్పష్టత లభిస్తుంది. విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారు.  మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు లోపలి నుంచి దృఢంగా తయారవుతారు. 

ఎప్పుడు మేల్కోవాలి?

బ్రహ్మ ముహూర్తం ప్రారంభమైన నుంచి సూర్యోదయం అయ్యేలోపు ఏ సమయంలోనైనా మేల్కొనడం ఉత్తమం. ఇలా మేల్కొంటే  ఇంద్రియాలకు తాజాదనాన్ని కలిగించే ప్రేమ (సాత్విక) గుణాలు ప్రకృతి ద్వారా  అందుతాయి.  ఇది మనశ్శాంతిని చేకూరుస్తుంది. ఒకవేళ ఈ ముహూర్తంలో లేవలేని పక్షంలో సూర్యోదయంతో పాటే నిద్రలేచేలా చూసుకోండి.  సూర్యోదయం తర్వాత లేవడం సరికాదు అని చెబుతున్నారు. కాబట్టి గడియారంలో అలారం కాకుండా సహజంగానే నిద్రలేచి పనులు చేసుకునే ప్రణాళికను రూపొందించుకోవాలి. ఎందుకంటే సూర్యోదయం అన్ని రుతువుల్లో ఒకే సమయంలో ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రకృతితో మనస్సును, శరీరాన్ని అనుసంధానం చేయాలని సిఫారసు చేస్తున్నారు.

బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే లాభాలు

  • వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని శుభకార్యాలకు బ్రహ్మ ముహూర్తాన్ని అనువైన సమయంగా ఎంచుకుంటారు. లోకం అంతటికీ కాంతి ఇవ్వగలిగిన వారు సూర్యభగవానులు. ఈ కాంతి ఇవ్వడానికి 88 నిమిషాల ముందుగా ఉన్న ప్రభాత కాలంలో ప్రకృతి అంతా భగవత్ శక్తితో నిండిఉంటుంది. దీనినే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. సరస్వతీ దేవి అనుగ్రహం ప్రసరణ కలిగే సమయం.

  • ఈ బ్రహ్మ ముహూర్తం మనస్సులో తలెత్తే సమస్యలను తొలగించడానికి , దైవిక ఆలోచనను మనస్సులో ఉంచడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన సమయం అని చెబుతారు. ఇంత యోగ్యమైన కాలం కాబట్టే దీనికి ప్రభాతకాలం అంటారు.

  • ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెబుతారు. ఈ సమయంలో శివుడిని పూజించడం ద్వారా బ్రహ్మదేవుడు అనేక వరాలను పొందాడని కూడా చెబుతారు. అందుకే ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి.

  • సూర్యోదయానికి 88 నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుందని చదువుకున్నాం కదా.. ఇది అత్యంత పవిత్రమైన ముహూర్తంగా భావిస్తారు. ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో వివాహం, గృహ ప్రవేశం వంటి అన్ని శుభకార్యాలు జరిగితే, ఇంటికి శుభ స్వభావం కొనసాగుతుందని చెబుతారు.

  • బ్రహ్మముహూర్త సమయంలో నక్షత్ర, యోగ దోషాలు ఉండవని, ఆ సమయం ఎల్లప్పుడూ శుభకార్యాలకు ముహూర్తం అని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ శుభసమయంలో ఇంట్లోని పూజగదిలో దీపం వెలిగించి పూజిస్తే సకల సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం

  • ఈ సమయంలో మనం కూడా నిద్రలేచి స్నానం చేసి మనకు కావలసిన పనులు మొదలుపెడితే అది విజయంతో ముగుస్తుందని చెబుతారు. స్నానం చేయలేని వారు పళ్లు తోముకుంటే కనీసం చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవచ్చని చెబుతున్నారు