
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఓ ప్రశ్న అందరిలో వస్తుంది. ఇంతకీ చంద్రబాబు చేసిన అవినీతి ఏంటీ.. ఎంత అవినీతి చేశారు.. ముఖ్యమంత్రిగా ఉండి ఎలా చేశారు అనేది ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఇంతకీ స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో సీమెన్స్ స్కాం?..
కొత్త ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ, బీజేపీ పార్టీలతో కలిసి సీఎం అయ్యారు చంద్రబాబు. ఆ తర్వాత ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా.. యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు.. సీమెన్స్, డిజైన్ టెక్ అనే సంస్థలతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 3 వేల 300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తామని ఈ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 3 వేల 300 కోట్ల రూపాయల్లో 10 శాతం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ పెట్టుండి పెట్టేలా ఒప్పందం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 10 శాతం వాటాగా.. జీఎస్టీతో కలిపి 370 కోట్ల రూపాయలను ఆ రెండు సంస్థలకు చెల్లించింది. ఇందులో 240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థకు కాకుండా.. డిజైన్ టెక్ సంస్థకు బదలాయించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే డిజైన్ టెక్ ఐటీ సంస్థలో జీఎస్టీ తనిఖీల్లో తప్పుడు ఇన్ వాయిస్ లను గుర్తించారు జీఎస్టీ అధికారులు. ఈ విషయాన్ని అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసును సీఐడీకి అప్పగించారు. ఈ 240 కోట్ల రూపాయలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ దృష్టికి కూడా వెళ్లింది. ఈడీ విచారణ కూడా చేసింది.
Also Read ; చంద్రబాబు అవినీతి కనిపెట్టింది జీఎస్టీ వాళ్లే.. అన్నీ తెలిసే డ్రామాలు : సజ్జల
కేసు విచారణలో భాగంగా 240 కోట్ల రూపాయల అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన ఏపీ సీఐడీ.. అప్పటి ప్రభుత్వం షెల్ కంపెనీలకు 240 కోట్ల రూపాయలు మళ్లించినట్లు గుర్తించింది. ప్రభుత్వం చెల్లించిన 371 కోట్ల రూపాయల్లో 240 కోట్లను వివిధ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేల్చింది. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు ఆ నిధులు మళ్లించినట్లు గుర్తించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాం సమయంలో సీమెన్స్ సంస్థ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వికర్లు కుంభకోణంలో భాగం అయ్యారని సీఐడీ విచారణలో తేలింది. 3 వేల 300 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం జీవోలో చూపించలేదని ఏపీ సీఐడీ గుర్తించింది.
సిమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రాజెక్టు విలువను కృత్రిమంగా 3 వేల 300 కోట్లకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని ఆ సంస్థ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ ను 2023, మార్చి నెలలోనే ఢిల్లీ నోయిడాలో అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ అధికారులు. సిమెన్స్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ ప్రాజెక్టు రిపోర్ట్ తారుమారు చేయటం వల్ల అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై అదనంగా 371 కోట్ల రూపాయల భారం వేశారని తేల్చింది సీఐడీ విచారణ. 371 కోట్ల రూపాయలను ప్రభుత్వం దగ్గర తీసుకున్న సిమెన్స్ సంస్థ.. స్కిల్ డెవలప్ మెంట్ సాఫ్ట్ వేర్ ధరను మాత్రం కేవలం 58 కోట్ల రూపాయలుగానే చూపించింది. మిగతా 240 కోట్ల రూపాయలను షెల్ అంటే.. డమ్మీ, నకిలీ కంపెనీల ద్వారా చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు ఈ నిధులు అక్రమంగా తరలించినట్లు నిర్థారించింది సీఐడీ.
ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అసలు బయటపడింది ఏపీ రాష్ట్రంలో కాదు.. పూణెలోని ఆయా కంపెనీల్లో జీఎస్టీ అధికారులు తనిఖీ చేయగా.. చంద్రబాబు అవినీతి డొంక కదిలింది అనేది మొత్తం వ్యవహారంతో స్పష్టం అవుతుంది.