ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 జులై 31న నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లు ఆగస్టు 6న ఆమోదం పొందింది. సెప్టెంబర్14న గవర్నర్ తమిళిసై ఆమోదంతో మరుసటి రోజు 15 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో చట్టం రూపంలోకి వచ్చింది. అయితే ఈ చట్టం అమలులోకి రావాలంటే అందుకు అవసరమైన రూల్స్‌ను తయారు చేసి ఏ రోజు నుంచి వాటిని అమలులోకి తెస్తారో ఇంకా తెలియదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సుమారు రెండు నెలలు అవుతున్నా కూడా ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించిన ఏ విషయాన్ని స్పష్టం చేయడం లేదు. అదేవిధంగా విలీనం ప్రక్రియకు ముందే పరిష్కారం కావాల్సిన సమస్యలపై స్పష్టత రాకుండా, వాటిని పరిష్కరించకుండా కార్మికుల ప్రయోజనాలు ఎలా సురక్షితమవుతాయనే దానికి సరైన జవాబు ఇవ్వడం లేదు. ప్రధానమైన సమస్య అయిన వేతన ఒప్పందాలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.
ఆర్టీసీలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి 4ఏండ్లకు ఒకసారి వేతన ఒప్పందం జరగాలి. 2017 ఏప్రిల్ నాటికి ఉన్న కరువు భత్యం, డీఏ 31.1 శాతం బేసిక్ పేలో మెర్జ్ చేసి కొత్త వేతన ఒప్పందం చేయాలి. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు జీతాల మధ్యన సుమారు 49శాతం వ్యత్యాసం ఉంది. ఆ అంతరం పూడ్చే విధంగా ఫిట్‌మెంటును ప్రకటించి అమలులోకి తేవాలి.
ఆ తర్వాతనే తెలంగాణ రాష్ర్ట మొదటి పీఆర్సీ ద్వారా అమలు అయిన స్కేల్స్ లో సమానమైన క్యాడర్లో ఉంచేలా చూడాలి. అదే సందర్భంలో పారిశ్రామికంగా కార్మికులుగా ఉన్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు ప్రభుత్వోద్యోగుల కంటే ఎక్కువ ఉంచేందుకు ప్రయత్నించాలి. అలాగే 2021 నుంచి రావాల్సిన వేతన ఒప్పందం గురించి కూడా స్పష్టత ఇవ్వాలి. అలా జరగకపోతే 2017 నుంచి విలీన సమయం వరకు రిటైర్మెంటు/వీఆర్ఎస్/ చనిపోయిన కార్మిక కుటుంబంతోపాటు సర్వీసులు ఉన్నవారు లక్షల రూపాయలు నష్టపోతారు.
అలాగే ఆర్పీఎస్2013లోని 50శాతం ఎరియర్స్ కు 5సంవత్సరాల కాలపరిమితితో 8.75శాతం వడ్డీతో చెల్లిస్తామని 2015 సెప్టెంబర్‌లో బాండ్స్‌ని ఇచ్చారు. 2020 సెప్టెంబర్‌తో బాండ్స్ కాలపరిమితి ముగిసిపోయింది. ఆ బాండ్స్ ను తిరిగి రెన్యువల్ చేయలేదు. డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. తమ డబ్బులు వస్తాయో రావో అని ఆందోళనలో కార్మికులు ఉన్నారు.
న్యాయస్థానాల తీర్పు సైతం ఉల్లంఘన
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అనుసరించిన వైఖరి వల్ల కార్మికుల స్వంత సంస్థ అయిన సీసీఎస్ దివాలా వైపు నెట్టబడుతున్నది. 50వేల మంది వాటాదారుల ఆర్థిక భద్రతకున్న భరోసా నిర్వీర్యం అవుతున్నది. న్యాయస్థానాల తీర్పును సైతం ఉల్లంఘిస్తున్నారు. ఆ సంస్థకు డబ్బులు అసలు, వడ్డీతో కలిపి రూ.1,070 కోట్లు ఆర్టీసీ వాడుకుని, ఒక్క పైసా తిరిగి చెల్లించడం లేదు.
కనీసం నెలవారీ ఆర్టీసీ చేస్తున్న రికవరీలను సైతం సీసీఎస్ లో జమ చేయడం లేదు. విలీనంతో ఆర్టీసీ కార్మికులకు భద్రత వస్తుందని చెపుతున్నా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయకుండా ఆర్థిక భద్రత వస్తుందని ఎలా చెపుతారు? అదే దారిలో పీఎఫ్‌కు చెందిన రూ.1300 కోట్లు, ఎస్ఆర్బీఎస్కు సంబంధించిన రూ.540కోట్లు, ఎస్బీసీకి చెందిన రూ.140 కోట్లుపైగా ఆర్టీసీ వాడుకున్నది.
ఫలితంగా పీఎఫ్ హయ్యర్ పెన్షన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది. ఇవి పరిష్కారం కాకుండా విలీనం వల్ల భద్రత భరోసా వస్తుందనేది అనుమానమే.
సర్వీస్ కండిషన్స్ కీలకం
అలాగే సర్వీసు కండీషన్స్ ప్రధానమైనవి. ప్రభుత్వోద్యోగులకు అమలవుతున్న మెరుగైన సర్వీసు కండీషన్స్ అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న రెగ్యులేషన్స్ లో మార్పులు చేస్తామన్న గ్యారంటీనీ ప్రభుత్వం కల్పించాలి. ఈ అంశంలో కార్మిక సంఘాలు కోరుతున్న 16కుపైగా ఉన్న సమస్యలకు సరైన పద్ధతిలో అమలు జరిగేలా చూస్తామని ప్రభుత్వం కార్మికులకు భరోసా ఇవ్వగలగాలి.
అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలను కొనసాగించాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్‌ను కొనసాగించాలని, రిటైరైనవారికి కార్పొరేట్ వైద్యం కోసం ఇస్తున్న రూ.4లక్షలను రూ.10లక్షలకు పెంచాలి. అలాగే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపు చేయాలి. ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులు భరించలేని స్థాయిలో ఉన్నాయి. అనేకమంది తమ ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు జరిగాయి.
ప్రభుత్వోద్యోగులుగా మారిన తరవాతైనా ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఈ పరిస్థితిని సంపూర్ణంగా మారుస్తామన్న గ్యారంటీనీ ప్రభుత్వం ఇవ్వాలి. మనకంటే ముందే ప్రభుత్వంలో విలీనం చేసిన ఏపీలో వారి సమస్యలను పరిష్కరించాలని నాలుగు ఏండ్ల అనంతరం కూడా ఆందోళనలు చేస్తున్నారంటే విలీనం ప్రక్రియలో సరైన న్యాయం జరగలేదని అర్థం అవుతోంది. అందుకని అటువంటి పరిస్థితి ఇక్కడ తలెత్తకుండా చూస్తామన్న గ్యారెంటీనీ ప్రభుత్వం కల్పించాలి.
కరువు భత్యం బకాయిలు
2019 జులై నుంచి కరువు భత్యం బకాయిలు ఉన్నాయి. సంస్థకు నూతన ఎండీ, చైర్మన్ వచ్చిన తర్వాత వరకు బకాయి ఉన్న 9డీఏల్లో ఏడింటిని అమలు చేశారు. 2023 జనవరి డీఏను ఈ నెల జీతంలో చెల్లింపునకు ఉత్తర్వులు ఇచ్చారు. 2023 జులై డీఏ అమలు చేయాల్సి ఉంది. అయితే ఇవన్నీ కూడా అవి అమలు కావాల్సిన తేదీ నుంచి అమలు చేయడం కాకుండా యాజమాన్యం ప్రకటించిన తేదీ నుంచి మాత్రమే అమలు చేశారు.
ఫలితంగా సర్వీసు నుంచి రిటైర్ అయినవారికి ఆ సమయంలో రావాల్సిన కరువు భత్యం రానందున వారి రిటైర్మెంటు బెన్ఫిట్స్ లో నష్టం జరిగింది. అలాగే సర్వీసులు ఉన్నవారికి 170 నెలల బకాయిలు చెల్లించాలి. సగటున ప్రతి కుటుంబానికి రూ.1,60,000 వరకు రావాల్సి ఉంది. ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పడం లేదు.
కార్మికుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ కార్మికులను మాత్రమే విలీనం చేస్తారని ఆర్టీసీ సంస్థ యథావిధిగా పనిచేస్తుందని చట్టం నిర్దేశిస్తున్నది. దీని ద్వారా ఆర్టీసీ సంస్థ లాభనష్టాలతో తమకు ఎటువంటి బాధ ఉండదని కార్మికులు భావిస్తున్నారు. మరో కోణంలో చెప్పాలంటే ఆర్టీసీ సంస్థ నుంచి ఆర్టీసీ కార్మికులను డీ లింకు చేస్తున్నది అని అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం ఆర్టీసీ విస్తరణ దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. సర్వీసులు పెంపు, కొత్త బస్సులు కొనుగోలు, పన్నులు తగ్గింపులతోపాటు ఆర్టీసీ ఆదాయం మొత్తం ఆర్టీసీ అభివృద్ధికి వాడుకునేలా చూడాలి. అందుకు అవసరమైనవిధంగా రూల్స్ రూపొందించాలి.
మరో ప్రధానమైన సమస్య ఉద్యోగ భద్రత. తమకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కావాలని, దానికి ఆటంకంగా ఉన్న రెగ్యులేషన్స్ లో సమూల మార్పులు జరగాలని కార్మికులు కోరుకుంటున్నారు.
- పుష్పా శ్రీనివాస్టీ ఎస్ ఆర్టీసీ-ఎస్‌డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ