దేశంలో విభజన వాదం దేనికోసం?

దేశంలో విభజన వాదం దేనికోసం?

గత వారంలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తమ్ముడు, పార్లమెంట్‌ సభ్యుడు డీకే సురేష్‌ మాట్లాడుతూ.. దక్షిణ భారత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది, అందుకే దక్షిణ భారతాన్ని విభజించాలంటూ మాట్లాడారు. తర్వాత ఢిల్లీలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే, మంత్రులు నిధుల వివక్ష అంటూ ధర్నా చేశారు. ఇదే కారణంతో కేరళ ముఖ్యమంత్రి  పి. విజయన్​ఢిల్లీలో ధర్నా చేశారు. ఢిల్లీలో జరిగే ఈ ధర్నాలను డీఎంకే నాయకుడు స్టాలిన్‌ సమర్థించారు. ఈ విషయాలపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో స్పందించారు.  కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, డీఎంకే నాయకులు దేశానికి వ్యతిరేకంగా మూడు కారణాలతో మాట్లాడుతున్నారు. ఒకటి.. ఈ నాయకులందరూ అవినీతిలో కూరుకుపోవడం, ఈడీ నోటీసులు అందుకుని ఆందోళనలో ఉండడం. రెండు.. అధికారం కోసం విచ్చలవిడి ఉచితాలు ఇచ్చి నిధుల కొరతను అధిగమించలేకపోవడం. మూడు.. రేపు వచ్చే పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనేందుకు మోదీ చరిష్మాను తట్టుకోలేకపోవడం. అందుకే వారు విభజన గురించి మాట్లాడుతున్నారు అని అన్నారు. 


దక్షిణ భారతం విభజనపై మాట్లాడేవారికి ఈడీ కేసులో, అవినీతి కేసులో వేధిస్తూ ఉంటాయేమో?.  అనేక రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు అవినీతిలో మునిగి ఈడీ అధికారులపై దాడులు చేయడం, తప్పించుకునేందుకు ఎదురు కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కవిత లిక్కర్‌ స్కాంలో ఈడీ నోటీసులను తప్పించుకుంటూ తిరగడం మనకు తెలిసినదే. దక్షిణ భారత రాష్ట్రాలలోని ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు విపరీతమైన అవినీతిలో కూరుకుపోయి దక్షిణ భారత విభజన మాటలు మాట్లాడుతున్నారనే వాదన ఉంది. దీనిపై మను జోసెఫ్‌ అనే  ప్రముఖ రచయిత డీకే సురేష్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. 
 
ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు

 ఇప్పటికే అనేక రాష్ట్రాలు అనాలోచితంగా, విచ్చలవిడిగా ఉచిత పథకాలు ప్రకటించి  అప్పుల్లో కూరుకుపోయాయి.  నిధులు సరిపోక ఉచిత హామీలు అమలు చేయలేకపోతున్నారు.  దాంతోనే  దేశ విభజన మాటలు వస్తున్నాయా?. అందుకే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను కూడా నిర్వర్తించలేకపోతున్నది అని అన్నారు. ఈ దేశానికి నిర్మాణాత్మక ప్రతిపక్షం ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వాస్తవంగా రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో చట్టబద్ధమైన ఆర్థిక సంఘం ద్వారా కొన్ని కొలమానాలు ఆధారం చేసుకొని రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర నిధుల్లో రాష్ట్రాల వాటా యూపీఏలో 31 శాతం ఉంటే మోదీ ప్రభుత్వం 41 శాతానికి పెంచింది. 2014 తర్వాత నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా రాష్ట్రాల ఆదాయం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా కూడా పెరిగింది. దేశంలో కేంద్రానికి వచ్చే ఆదాయంలో ఒక ముంబై నుంచే 25 శాతం ఉంటుంది.  ముంబై ఆదాయం ముంబైలోనే, బెంగళూరు ఆదాయం బెంగళూరులోనే పంచాలంటారా?.  మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ ఏ రాష్ట్రం నదులు ఆ రాష్ట్రంలో, ఏ రాష్ట్రం బొగ్గు ఆ రాష్ట్రంలో, ఏ రాష్ట్రం నిధులు ఆ రాష్ట్రంలో పంచడం మొదలుపెడితే ఇక దేశం ఉంటుందా అని అన్నారు. మేం దేశాన్ని ఒక శరీరంగా చూస్తాం. శరీరంలో ఏ ఒక్క అంగానికి బాధ కలిగినా మొత్తం శరీరం బాధపడుతుంది. కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఏ ముక్కకు ఆ ముక్కగా చూస్తుంది.  పాలనా సౌకర్యం కోసం రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ, రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లి యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అంటూ విభజించి మాట్లాడుతున్నారు. 

మౌలిక సదుపాయాలు పెరిగాయి

2014లో  రెండంకెలు ఉన్న ద్రవ్యోల్బణాన్ని 5 శాతంలోనికి తీసుకొస్తూ, అదుపు చేస్తూ వచ్చింది. ఒకప్పుడు మనదేశంలో సెల్‌ ఫోన్‌ అవసరాల్లో 80 శాతం చైనా నుంచి దిగుమతి అయ్యేవి. నేడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద సెల్‌ ఫోన్‌ ఉత్పత్తిదారుగా భారత్‌ నిలబడింది, తద్వారా లక్షలాది మందికి ఉపాధి చేకూరింది. నేడు భారత్‌ స్వయంగా సెమీ కండక్టర్స్‌ తయారు చేస్తూ, దీనికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ పది సంవత్సరాల్లో కొత్తగా 18 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 10 కోట్ల మంది ముద్ర యోజన ద్వారా లబ్ధి పొందారు. 10 ఏండ్లలో విమానాశ్రయాలు రెట్టింపయ్యాయి. పర్యాటకం 2014 కంటే ఇప్పుడు వెయ్యి శాతం కనీస మూలధన పెట్టుబడితో ముందుకు తీసుకెళ్లడం జరిగింది.  రూ.2.80 లక్షల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రైతులకు అందించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టి, నిధులిచ్చి దేశంలోని మత్స్యకారులకు ఆర్థిక సాధికారత కల్పించాం. పశు సంపద కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, నిధులిచ్చి, ఆ వర్గాలను ఆదుకున్నారు. 18 రకాల చేతి వృత్తులను గుర్తించి, విశ్వకర్మ యోజన ద్వారా రూ.15వేల కోట్ల పెట్టుబడితో వారికి ఆర్థిక సాధికారత కల్పించనుంది. 

ఓబీసీలకు పెద్దపీట

ఓబీసీలకు క్యాబినెట్​లో పెద్దపీట వేశారు. 50 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిచి, ఆర్థిక సాధికారత కల్పించారు. 11 కోట్ల మందికి నల్లా ద్వారా తాగునీరు, 55 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు అందించారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇప్పటికీ అందుతున్నది. నారీ శక్తి వందన్‌ పేరుతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పాస్‌ చేయించింది. భారత్‌ ఎలెక్ట్రానిక్‌ గూడ్స్‌ ఉత్పత్తిలో 300 రెట్లు అభివృద్ధి చెంది, ఎగుమతులు చేస్తున్నది. మేక్‌ ఇన్‌ ఇండియాకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.  ఇవన్నీ చూసిన ప్రజలు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అవినీతి రహిత మోదీ ప్రభుత్వాన్ని మరోసారి  కోరుకుంటున్నారని ఎన్నికల సర్వేలే చెపుతున్నాయి. కొందరు దేశ విభజన వ్యాఖ్యలు చేయడం చూస్తే, వారికి అధికారం తప్ప మరోయావ లేదని అర్థమవుతుంది. దేశం ప్రధానం అనే  మోదీ పాలనలో విభజన వాదుల పప్పులు ఉడకవు.

పేదరికం తగ్గింది

ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కలిసి ఒక టీమిండియాగా పని చేయాలని 2014లో ఆయన కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఇటీవల లోక్‌ సభలో అన్నారు. మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి అధిగమించారని అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రోడ్డు, ఆధునిక రైల్వేలు, విమానాశ్రయాలు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు, గృహనిర్మాణం, మొదలైనవాటిపై ఈ 10 ఏండ్లలో రూ.50లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. కరోనా కాలంలో 9 నెలల్లో వ్యాక్సిన్‌ తయారు చేసి, దేశ ప్రజలకు అందించి, ప్రజల విశ్వాసం పొందారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు రూ.9 లక్షల కోట్లు ఉంటే బీజేపీ ప్రభుత్వం వచ్చాక వాటిని రూ.75 లక్షల కోట్లకు పెంచారు. నేడు ఎల్‌ఐసీ షేర్‌ రికార్డు స్థాయిలో పెరిగి లాభాల బాట పట్టింది. నష్టాల్లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌, హెచ్‌ఏఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా మొదలైన సంస్థలను నష్టాల నుంచి అధిగమించి లాభాల బాట పట్టించారు. 10 ఏళ్లలో రక్షణ రంగం పటిష్టమైనది, సైన్యమూ పటిష్టమైనది. తీవ్రవాదం జీరో టోలరెన్స్‌ కు చేరువైంది. కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించి, అక్కడి పేద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్‌ ఫలాలు అందించారు. 

-  నరహరి వేణుగోపాల్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు

  • Beta
Beta feature
  • Beta
Beta feature