బీమా పాలసీలన్నీ ఒకేచోట.. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాతో బోలెడు ప్రయోజనాలు

బీమా పాలసీలన్నీ ఒకేచోట.. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాతో బోలెడు ప్రయోజనాలు

బీమా పాలసీలను డిజిటలైజేషన్‌ చేయడాన్ని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. ఈ రూల్ ప్రకారం, అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే (E- insurance) పాలసీలను అందించాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్యం, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఇ-ఇన్సూరెన్స్ ఖాతా అంటే ఏంటి..?

ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ ఖాతా(EIA) అంటే ఒకరకంగా డీమ్యాట్ ఖాతా లాగా అన్నమాట. డీమ్యాట్ ఖాతాలో షేర్ల క్రయవిక్రయాలు ఎలా ఎలక్ట్రానిక్‌ రూపంలో పొందుపరుస్తారో.. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాలో బీమా పాలసీల వివరాలు ఎలక్ట్రానిక్‌ రూపంలో సేవ్‌ చేస్తారు. ఈ ఖాతా సాయంతో పాలసీదారులు బీమా ప్లాన్లను ఆన్‌లైన్‌లోనే యాక్సెస్‌ చేయొచ్చు. దీంతో వీటి నిర్వహణ మరింత సౌకర్యంగా ఉంటుంది. 

ఖాతా తెరవడం ఎలా?

ఆన్‌లైన్, ఆన్ లైన్ రెండు మార్గాల్లో ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాల బాధ్యతను IRDAI.. నాలుగు బీమా రిపోజిటరీలకు అప్పగించింది. ఆ నాలుగు సీఏఎంఎస్ (CAMS), కార్వి (Karvy), ఎన్‌ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ (NDML), సెంట్రల్ ఇన్సూరెన్స్ రెపోజిటరీ ఆఫ్ ఇండియా. ఈ నాలుగింటిలో దేనిలోనైనా మీరు ఇ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవవచ్చు.

ఆన్‌లైన్

మీరు ఆన్‌లైన్ లో ఇ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవాలనుకుంటే పైన చెప్పబడిన నాలుగు రిపోజిటరీలలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అప్పుడు మీరు సంబంధిత వెబ్‌సైట్‌కి వెళ్లి ఓపెన్ ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ పాన్ లేదా ఆధార్ నంబర్ ద్వారా తదుపరి ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఖాతాను తెరవవచ్చు.

ఆఫ్ లైన్

ఒకవేళ ఆఫ్ లైన్ ద్వారా ఖాతా తెరవాలనుకుంటే బీమా రిపోజిటరీ సైట్‌కి వెళ్లి ఫామ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో మీ వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లను జత చేసి గుర్తింపు పొందిన వ్యక్తి లేదా ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసు లేదా ఇన్సూరెన్స్ రిపోజిటరీ వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌ను కొరియర్ లేదా పోస్టాఫీసు ద్వారా కూడా పంపవచ్చు. ఏడు రోజుల్లోపు మీ ఖాతా తెరుస్తారు.

చార్జీలు 

మీరు రిపోజిటరీ ద్వారా ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను తెరిస్తే ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు. అదే బీమా కంపెనీ ద్వారా తెరిస్తే రూ. 50-నుండి రూ. 100 దాకా వసూలు చేయవచ్చు.

ప్రయోజనాలు

ఇ-ఇన్సూరెన్స్ ఖాతా వల్ల బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఖాతా ద్వారా అన్ని బీమా పాలసీల వివరాలను ఒకేచోట యాక్సెస్‌ చేయొచ్చు. పాలసీని ఎప్పుడు పునరుద్ధరించాలి లేదా ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది అనే పూర్తి వివరాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. అలాగే, పాలసీ డాక్యుమెంట్లు పోయాయని లేదా చిరిగిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా , ఎక్కడి నుండైనా ఈ ఖాతాను ఆపరేట్ చేయవచ్చు. వ్రాతపని భారం కూడా తగ్గుతుంది. కావున మీ వద్ద పాత పాలసీలు ఉంటే, వాటిని వెంటనే ఇ-ఫార్మాట్‌లోకి మార్చుకోండి.