హైదరాబాద్, వెలుగు : లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇన్ చార్జ్ మంత్రులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫామ్ 17 సీ గురించి వివరించారు. దీంతో ఈ ఫామ్ 17 సీ అంటే ఏంటిదనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.
ఫామ్ 17 సీ అంటే..
ఒక్క మాటలో చెప్పాలంటే ఫామ్ 17 సీ.. పోలింగ్ లో, కౌంటింగ్ లో అక్రమాలు జరిగితే అడ్డుకట్ట వేసే ఆయుధమని చెప్పవచ్చు. ఫామ్ 17 సీ లో రెండు పార్ట్ లు ఉంటాయి. అందులో ఒకటి 17 సీ (ఏ), రెండోది 17 సీ (బీ). ఫామ్17 సీ పార్ట్ ఏ అంటే.. పోలింగ్ జరిగిన 48 గంటల్లో ఎన్నికల అధికారులు దీన్ని అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలాసార్లు ఇది సాధ్యపడడం లేదు.
తమకు ఇంకా అన్ని చోట్ల నుంచి పూర్తి పోలింగ్ వివరాలు రాలేదంటూ ఎన్నికల అధికారులు ఆలస్యం చేస్తున్నారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు చాలాసార్లు ఎన్నికల అధికారులపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ)కు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఫామ్ 17 సీ పార్ట్ ఏ..
పోలింగ్ జరిగిన శాతం, పోలింగ్ బూత్ ల వారీగా నమోదు అయిన ఓట్లు, పోలింగ్ స్టేషన్ పేరు, దాని కోడ్ నంబర్, మొత్తం ఓటర్ల సంఖ్య, ఓటు వేసిన వారి సంఖ్య, ఆమోదించిన, తిరస్కరించిన ఓట్ల వివరాలు, తిరస్కరణకు కారణం ఏమిటి అనే వివరాలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ డేటా మొత్తాన్ని పోలింగ్ ముగిసిన 48 గంటల్లో ఎన్నికల అధికారులు ఈ పార్ట్ ఏ లో నమోదు చేసి అభ్యర్థులకు ఇవ్వాలి. అలాగే వారికి కలిగే అనుమానాలను అధికారులు తీర్చాల్సి ఉంటుంది.
ఫామ్ 17 సీ పార్ట్ బీ..
కౌంటింగ్ సెంటర్ వివరాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి వచ్చిన మొత్తం ఓట్లను ఇందులో పొందుపరుస్తారు. లెక్కించాల్సిన మొత్తం ఓట్లకు బూత్ ల వారీగా లెక్కించిన ఓట్ల సంఖ్య సమానంగా ఉందా.. లేదా.. అనేది ఇందులో నమోదు చేస్తారు. పోలైన మొత్తం ఓట్లకు.. లెక్కించాల్సిన ఓట్లకు ఏమైనా వ్యత్యాసం ఉందా, సమానంగానే ఉన్నాయా.. అనే వివరాలు ఇందులో ఉంటాయి.
పోలింగ్ రోజున రాజకీయ పార్టీలు ఏమైనా గోల్ మాల్ చేసినా కౌంటింగ్ రోజున ఇందులో దొరికిపోతారు. వీటన్నింటిని కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే సూపర్ వైజర్లు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు.