ఫ్రిజ్ స్కేపింగ్ లేదా రిఫ్రిజిరేటర్స్కేపింగ్ ... పేరు ఏదైతేనేం ఆ రెండు పదాలకు అర్థం ఒకటే. ల్యాండ్ స్కేపింగ్లా ఫ్రిజ్ స్కేపింగ్ అన్నమాట! మామూలుగా అయితే ఫ్రిజ్‌లో పాలు, పెరుగు, కూరగాయలు, పచ్చళ్లు, కారాలు, వంట పదార్థాలు, వంటకాల వంటివి పాడుకాకుండా కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకునే ఒక ‘సద్దిపెట్టె’. ‘ఈ సద్దిపెట్టెను ఒక కళాఖండంలా మార్చొచ్చు తెలుసా’ అని సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది.
రిఫ్రిజిరేటర్ కాన్వాస్ అయితే... అందులో ఉంచే పదార్థాలన్నీ రంగురంగుల పెయింట్స్ అయిపోతాయి. దాంతో రిఫ్రిజిరేటర్ ఒక కళాఖండం అయిపోతుంది. అదే రిఫ్రిజిరేటర్ స్కేపింగ్ అంటున్నారు. ఇది చదువుతుంటే నవ్వులాటగా అనిపించొచ్చు. కానీ దీన్నే సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రిజ్‌ను నీట్‌గా సర్దుకోవడం అన్నమాట. చాలామందికి నెలల తరబడి ఫ్రిజ్‌ల్లో ఏం ఉందో తెలియదు అంటే అతిశయోక్తి కాదు. కాయగూరలు, ఫ్రూట్స్, వంటకు అవసరమయ్యే దినుసులు, చాక్లెట్లు, బిస్కెట్లు, జీలకర్ర, ఆవాలు, కారం, ఉప్పు, పప్పు... అన్నింటినీ సద్దిపెట్టెలోకి చల్లగా నెడతారు.
అలా ఒకదానిమీద ఒకటి చేరుకుని ఏం ఉన్నాయి? ఏం లేవు? అనేది చూసుకునేసరికి వాటిలో ముప్పావువంతు పాడయిపోతాయి. లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండాలి. కొన్ని ఈస్తటిక్స్ పాటించాలి అంటున్నారు. పనికొచ్చే విషయం అయినప్పుడు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది కదా!
మొదట చేయాల్సింది..
ఫ్రిజ్స్కేపింగ్లో ప్రధానంగా ఫ్రిజ్‌లో ఉన్న ప్లేస్‌ను సరిగ్గా వాడుకోవడం ఎలా అనేది ముఖ్యం. అలాగే ఫ్రిజ్‌లో పెట్టే వాటన్నింటినీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. దాని వల్ల ఫ్రిజ్‌లో ఏం ఉన్నాయి? ఏం లేవు? అనేది ట్రాక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. దాంతో వేస్టేజ్ తగ్గిపోతుంది.
- ఫ్రిజ్‌లో ఉన్న వాటన్నింటినీ తీసి బయట పెట్టాలి. అలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో స్టాక్ ఉన్నవి ఏవో కళ్లముందు కనిపిస్తాయి. వాటిలో ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి, పాడైపోయినవి ఉంటే వాటిని బయట పారేయాలి.
- ఆ తరువాత ఫ్రిజ్‌లో బయటకు తీసేలా ఉన్న ర్యాక్స్, డ్రాయర్స్ను సబ్బుతో రుద్ది, నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఫ్రిజ్‌లోపల, డోర్ సీల్స్‌ను తడి బట్టతో తుడవాలి.
- కొన్ని పార్ట్స్ దుమ్ము కొట్టుకుపోయి, వాసన వస్తుంటాయి. వాటిని శుభ్రం చేయాలంటే బేకింగ్ సోడా కావాలి. బేకింగ్ సోడాను నీళ్లలో కలపాలి. అందులో ఒక బట్టను ముంచాలి. ఆ బట్టతో దుమ్ము కొట్టుకుపోయి, వాసన వస్తున్న పార్ట్స్‌ను రుద్దుతూ శుభ్రం చేయాలి. ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే నిమ్మరసంలో ముంచిన తడి బట్టతో తుడవొచ్చు. ఆ తరువాత మెత్తటి టవల్‌తో తడిపోయేలా ఫ్రిజ్ అంతా తుడవాలి. ఆ తరువాత శుభ్రం చేసిన ర్యాక్స్, డ్రాయర్స్ ఫ్రిజ్‌లో పెట్టేయాలి.
సర్దుకోవడం ఇలా...
ఫ్రిజ్‌లో వండిన, వండని పదార్థాలు పెడుతుంటారు. వాటిని పెట్టేందుకు సరిపడా కంటెయినర్స్ కొనాలి. అవి మ్యాచింగ్ సెట్స్ అయితే అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. చాలా వెరైటీలు దొరుకుతున్నాయి. స్క్రూటాప్స్ లేదా సిలికాన్ రింగ్ లిడ్స్ ఉన్న గ్లాస్ కంటెయినర్లు లేదా జార్స్ వాడొచ్చు. స్క్వేర్ షేప్ ప్లాస్టిక్ కంటెయినర్స్కి వ్యాక్యూమ్ సీల్ లిడ్స్ లేదా స్నాప్ ఆన్ కవర్స్ ఉన్నవి తీసుకోవచ్చు.కొనుక్కునే కంటెయినర్ల సైజ్ ఫ్రిజ్‌లో పడతాయా? లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్టోర్ చేసేందుకు డెకరేటివ్ బాస్కెట్స్ దొరుకుతున్నాయి.
వాటి కలర్ కో–ఆర్డినేషన్ మంచిగా ఉంటే చూసేందుకు బాగుంటుంది. ఫుడ్ ఐటమ్స్ సర్దేముందు ఫ్రిజ్‌ను జోన్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఫుడ్ హైజీన్ విషయంలో ఇది చాలా ముఖ్యం. వండిన పదార్థాలను పచ్చి పదార్థాల పక్కన పెట్టొద్దు. మాంసం, చేపలను డెయిరీ ప్రొడక్ట్స్‌కు దూరంగా పెట్టాలి. డ్రింక్స్ బాటిల్స్ అన్నీ ఒక దగ్గర, స్క్వేర్, రౌండ్ బాక్స్‌లను ఒక దగ్గర పెట్టాలి. కాయగూరలు, పండ్లను ఒకే రంగు ఉన్న కంటెయినర్లో పెడితే లుక్ ఉంటుంది.ఫ్రిజ్‌లో స్టాక్ పెట్టేటప్పుడు వెనక నుంచి ముందుకు పెడుతూ రావాలి. కొత్త ఐటమ్స్‌ను వెనక పెట్టి ఎర్లీ ఎక్స్పైరీ డేట్ ఉన్న వాటిని ముందు వరుసలో పెట్టాలి.
ఇలా చేయడం వల్ల త్వరగా ఎక్స్పైర్ అయ్యే వాటిని ముందు వాడతారు. దానివల్ల వృథా తగ్గుతుంది. కొందరు డెకరేషన్ అంటే ప్రాణం పెడతారు. అలాంటి వాళ్లు ఫ్రిజ్ షెల్ఫ్‌ల్లో తాజా పూలు ఉంచొచ్చు. అంత అక్కర్లేదు అనుకుంటే కొత్తిమీర, పుదీనా వంటి హెర్బ్స్‌ను జగ్స్ లేదా మేసన్ జార్స్‌లో నీళ్లు నింపి వాటిలో ఉంచొచ్చు. చాలామంది ఫ్రిజ్‌లో ఏ మూల కూడా ఖాళీ లేకుండా డబ్బాలు, గిన్నెలు, బాటిల్స్‌తో నింపేస్తారు. కానీ ఫ్రిజ్ నీట్‌గా కనిపించాలంటే కొంత ప్లేస్ ఖాళీగా ఉంచాలి. మరీ ముఖ్యంగా ఫ్రిజ్ లోపల, బయటా రెగ్యులర్‌గా తుడిచి శుభ్రం చేస్తుండాలి.
ఫ్రిజ్ ఇంటీరియర్
- ఫుడ్ స్టోర్ చేసుకునే కంటెయినర్స్ డిఫరెంట్ షేప్స్, సైజ్, మెటీరియల్, ఫీచర్స్‌తో దొరుకుతున్నాయి. క్లియర్ కంటెయినర్స్ అయితే లోపల ఏం పెట్టారనేది బయటకు కనిపిస్తుంది. అందుకు గ్లాస్ కంటెయినర్స్ అయితే అందులోని పదార్థాలను వేడిచేసుకునేందుకు పనికొస్తాయి. అయితే గ్లాస్ కంటెయినర్స్‌తో పోలిస్తే ప్లాస్టిక్ కంటెయినర్స్ రేటు తక్కువ. కిందపడితే పగులుతాయనే టెన్షన్ ఉండదు. తక్కువ బరువు కూడా. ఈ మధ్య కొందరు మెటల్ బాస్కెట్స్ కూడా వాడుతున్నారు.
- గ్లాస్ లేదా ప్లాస్టిక్ కంటెయినర్స్ వాడడం నచ్చకపోతే ఫుడ్ స్టోరేజ్ బ్యాగ్స్ వాడొచ్చు. వీటిలో కూడా కాటన్ బ్యాగ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. వీటినయితే శుభ్రంగా ఉతికి మళ్లీ వాడొచ్చు. అంతేకాదు మల్టీ పర్పస్‌గా ఉపయోగపడతాయి.
- తీసి పెట్టేలా ఉండే షెల్ఫ్స్ వల్ల స్పేస్ ప్రాబ్లమ్ రాదు. ఇలాంటి షెల్ఫ్స్, డ్రాయర్స్ పేస్టల్ బ్లూ, పింక్, లైట్ బ్రౌన్, క్రీమ్ రంగుల్లో దొరుకుతున్నాయి. వంటగదిలో వాడే షెల్ఫ్ ఆర్గనైజర్స్ ఫ్రిజ్‌లో ఫుడ్ స్టోరేజ్‌కి కూడా బాగా పనికొస్తాయి. ఇవి వద్దనుకుంటే స్టాకబుల్ డ్రాయర్స్ తీసుకోవచ్చు. ఇవి రకరకాల సైజ్‌ల్లో ఉంటాయి. కాకపోతే ఇవి డిష్వాషర్ సేఫ్ కాదు.
- కొన్ని సార్లు గ్రాసరీ ఐటమ్స్ కొన్ని ఫ్రిజ్ మూలల్లోకి చేరి కనిపించవు. ఈ సమస్య లేకుండా ఉండాలంటే ఫుడ్ స్టోరేజ్ టర్న్‌టేబుల్ బాగా పనికొస్తుంది. ఇందులో పెట్టుకుంటే చిన్న చిన్న గ్రాసరీస్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇది చెక్కది అయితే రస్టిక్, నేచురల్ లుక్‌తో ఉంటుంది. ధర తక్కువే.
- ఎక్కువగా గుడ్లు వాడితే డబుల్ డెకర్ ఎగ్ స్టోరేజ్ ట్రే మంచి ఆప్షన్. ఇందులో 40 ఎగ్స్ వరకు పెట్టొచ్చు. పోర్సిలిన్, హ్యాండ్‌మేడ్ ఎగ్ కంటెయినర్స్ కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో.
- చీజ్ వెరైటీల కోసం రకరకాల చీజ్ స్టోరేజ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఫ్రిజ్‌లో చీజ్‌ను తాజాగా నిల్వచేయాలంటే తేమ ఉండాలి. అందుకు చీజ్‌ను చీజ్ పేపర్లో చుట్టి చీజ్ బ్యాగ్‌లో పెట్టాలి. అప్పుడు తాజాగా, రుచిగా ఉంటుంది చీజ్. చీజ్ పేపర్, చీజ్ బ్యాగ్ రెండూ కలిపిన ప్యాక్ దొరుకుతుంది. లేదంటే రీయూజబుల్ సిలికాన్ స్టోరేజి బ్యాగ్‌లో చీజ్ పేపర్లో చుట్టొచ్చు. లేదంటే నేచురల్ వ్యాక్స్ లేదా పర్చ్మెంట్ పేపర్ వాడి నిల్వచేయొచ్చు.
- క్లియర్ బాటిల్స్‌లో పాలు, జ్యూస్‌లు పోస్తే వాటికి లేబుల్ వేసుకోవచ్చు. ఈ బాటిల్స్ కూడా ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ మార్కెట్లో తెచ్చుకోవచ్చు.
- స్టోరేజ్‌కి వాడే బిన్స్ పేస్టల్ కలర్స్‌లో ఉన్నవి అయితే బెస్ట్. స్టోరేజి బిన్స్ రకరకాల రంగులు, సైజుల్లో దొరుకుతాయి.
- ఎర్తీ ఫీల్ ఇష్టపడుతున్నారు ఈ మధ్య చాలామంది. ఆ ఫీల్ కోసం చెక్క మూత ఉన్న కంటెయినర్స్ తీసుకోవాలి. అలాంటి బాస్కెట్స్లో ఒక క్లాత్ వేసి ద్రాక్షలు, నిమ్మకాయల వంటివి పెట్టుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా వంటి తాజా హెర్బ్స్‌ను సెరామిక్ మగ్స్లో ఉంచి స్టోర్ చేయొచ్చు. ఇలాచేస్తే ఫ్రిజ్‌లోకి గార్డెన్ తెచ్చినట్టే ఉంటుంది!
- చెక్క మూతలు ఉన్న ఫుడ్ కంటెయినర్స్ వాడితే ఫ్రిజ్‌లోపల ఇంటీరియర్ లుక్ చాలా బాగుంటుంది. ఫ్రిజ్ మధ్యలో ఫ్రూట్ బౌల్స్ పెడితే హెల్దీ ఈటింగ్‌కు వెల్కం చెప్పినట్టు ఉంటుంది. టాప్ షెల్ఫ్‌లో పెద్ద పూలతో బొకే పెట్టారంటే ఫ్రిజ్ ఇంటీరియర్‌కు వావ్ అనే ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే!