రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 317 జీవో ద్వారా ఉద్యోగులు, టీచర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం చీలిక తెచ్చింది. ఉద్యోగులు, టీచర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సర్కారు పంచన చేరిన సంఘాలేవో ఇప్పుడు బట్టబయలైంది. ప్రభుత్వ కుట్రలో భాగస్వాములైన సంఘాల నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రాత్రికి రాత్రే హడావుడి, గందరగోళంతో ఎలాంటి మార్గదర్శకాలు లేని ఏకపక్షంగా జీవో అమలు చేసి పది మంది టీచర్ల ఉసురు తీశారు. ఇదంతా తిరిగి ఎన్నికల్లో అధికారం సాధించుకునే కుట్రలో భాగంగానే జరిగింది. 317 జీవో పేరిట ప్రభుత్వ టీచర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు సాయం చేసిన కుట్రలో బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేసిందెవరు? ప్రభుత్వంతో అంటకాగుతూ టీచర్లను తప్పుదారి పట్టించిందెవరు? ఉద్యోగులు, టీచర్లను ఆందోళనకు గురిచేసిన 317 జీవోకు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీలు పోరాటం చేయడానికి ముందుకు రావడంపై అప్రమత్తంగా ఉండాలి. అవి వారి రాజకీయ ఉనికి కోసం చేసేవిగానే గుర్తించాలి. పది మందికి పైగా మరణించినా, బాధిత టీచర్లు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టింపులేని ద్రోహులను గుర్తించి నిలదీయాల్సిన సమయం వచ్చింది. ఉద్యోగుల చావుకు కారణమైన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజాస్వామ్య శక్తులు, ఉద్యమ సంఘాలు ప్రశ్నించాలి. 317 జీవో అమలు ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ బడులకు సమాధి కట్టే ప్రయత్నమని గుర్తించాలి. బాధిత టీచర్లకు న్యాయం జరిగేంత వరకు నిరసనలు, పోరాటాలు కొనసాగుతాయి.
317 జీవోతో గందరగోళ పరిస్థితులు
317 జీవోతో టీచర్లకు ఎలాంటి ప్రయోజనం లేదు సరికదా, వారి జీవితాలను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసింది. దీంతో స్పందించిన టీచర్ల సంఘాలు నిరసనలు, పోరాటాలు మొదలెట్టాయి. అధికారుల అవగాహనా రాహిత్యం ఫలితంగా అనేక మంది జిల్లా అలకేషన్లలో తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు. ఆప్షన్ కు ముందే టీచర్ల సమగ్ర సీనియార్టీ జాబితాలను, ఆయా జిల్లాల క్యాడర్ స్ట్రెంగ్త్ ను పూర్తిగా ప్రకటించాల్సి ఉండగా, ఆ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉరుకులు పరుగులతో టీచర్ల నుంచి ఆప్షన్లను తీసుకుంది ప్రభుత్వం. వీటి ఆధారంగా చేసిన అలకేషన్లు తీవ్ర నష్టాల్ని తెచ్చింది. 317 జీవో అమలుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల జోక్యం లేకుండా సీఎం నేరుగా సీఎస్, కలెక్టర్ లకు మాత్రమే ఆదేశాలిస్తూ అమలు చేసిన తీరు తీవ్ర ఆక్షేపణీయం.
స్థానికత పట్టింపు లేకుండానే..
స్థానికత పట్టింపు లేని సీనియార్టీ జాబితాల్లో రకరకాల తప్పులు దొర్లటం, వాటిపై వచ్చిన వినతులను అధికారులు పట్టించుకోకపోవడం, జిల్లా డీఈవో కార్యాలయాల్లో సిబ్బంది అవినీతి మధ్య ఏకపక్షంగా సీనియార్టీ పేరిట జిల్లాల అలకేషన్ చేయటంతో టీచర్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు ఈ అలకేషన్ ను వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టారు. మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో టీచర్లు ప్రతిరోజూ తమకు జరిగిన అన్యాయంపై ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. టీచర్ల హక్కులను కాలరాసి, వారి వినతులను వినకుండా, ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు జిల్లాల కేటాయింపును పూర్తి చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి పోరాట కమిటీ తెలియజేసింది. జిల్లాలకు కేటాయించబడిన టీచర్లను స్కూళ్లకు కేటాయించే సందర్భంలో సంఘాల సలహాలు, సూచనలు తీసుకుంటామని ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్కూళ్ల కేటాయింపు కోసం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదని సీఎస్ చెప్పారు. కానీ, టీచర్లను, సంఘాలనూ మోసం చేస్తూ మరునాడే స్కూళ్ల కేటాయింపునకు సంబంధించి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి.. టీచర్లు ప్రత్యక్షంగా లేకుండానే, ఆప్షన్ల ఆధారంగా బడుల కేటాయింపు ఉత్తర్వులను విడుదల చేశారు. అధికార యంత్రాంగం తీరును టీచర్లు, సంఘాలు ఎప్పటికప్పుడు ఎండగడ్తున్నా ప్రభుత్వ నిరంకుశ వైఖరిలో మాత్రం మార్పు రావడంలేదు.
అయోమయ కేటాయింపులతో..
ఒక్కో టీచర్ వందలకొద్దీ స్కూళ్ల పేర్లు రాయడమనేది సరైనది కాదని, వెబ్ కౌన్సెలింగ్ ద్వారానైనా లేదా ఫిజికల్ కౌన్సెలింగ్ ద్వారానైనా ఆప్షన్లు సేకరించాలని చేసిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల జరిగిన నష్టం పూరించలేనిది. సీనియర్లకు రావాల్సిన ప్లేసులు జూనియర్లకు రావడం వంటి అయోమయ కేటాయింపులు ఉద్యోగులు, టీచర్లను అగాధంలోకి నెట్టేశాయి. 2 రోజుల సమయం ఇచ్చి చేసిన హడావుడి వారికి తీవ్ర నష్టాన్ని కొనితెచ్చింది. స్పౌజ్ కేటగిరీలో అంతర్ జిల్లా బదిలీలు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవకాశం ఇస్తూ 19 జిల్లాలకు మాత్రమే జాబితాలు పంపి 13 జిల్లాల్లో ఇన్‌కమింగ్ లేదని నిలుపుదల చేశారు. ఇన్‌కమింగ్ పై వివరణ కోరితే విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శియే కారణం తెలియదని సమాధానమిచ్చారు. మొదటి నుంచి అడుగడుగునా ఎలాంటి మార్గదర్శకాలుగానీ, షెడ్యూల్ గానీ లేకుండానే అర్ధరాత్రులు కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలిస్తూ ఈ తతంగం పూర్తి చేశారు.
మానసిక వేదనలో టీచర్లు..
317 జీవో వల్ల రాష్ట్రంలో అనేక మంది టీచర్లు తమ స్థానికతను కోల్పోయి.. పుట్టి, చదువుకుని, పెరిగిన ఊరును, తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలి జూనియర్ అనే ఒకే కారణంతో తమది కాని ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది వేలాది కుటుంబాల్లో తీవ్రమైన మానసిక సంక్షోభానికి కారణమవుతోంది. ఫలితంగా పది మంది టీచర్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహబూబాబాద్ లో ఆరోగ్యం బాగాలేని జేతూరాం(55 ఏండ్లు) అనే30 ఏండ్ల సర్వీసు ఉన్న సీనియర్ టీచర్‌ను ములుగు జిల్లాకు కేటాయించారు. ఈ వయసులో అక్కడ ఎలా పని చేయాలో తెలియక జేతూరాం అధికారులకు మొరపెట్టుకున్నాడు. అధికారులు స్పందించకపోవటంతో మానసిక వేదనతో ప్రాణాలు వదిలేసాడు. ఇది 317 జీవో కారణంగా నమోదైన మొదటి మరణం. ఆ తర్వాత మరో రికార్డు అసిస్టెంట్, వైద్యశాఖ ఉద్యోగిని, వరంగల్‌లో మరో తెలుగు పండిట్ ఇలా పలు శాఖల ఉద్యోగులు, టీచర్ల వరుస మరణాలు ఉద్యోగ, ఉపాధ్యాయ లోకాన్ని ఆందోళనలోకి నెట్టి వేస్తున్నాయి.
పోరాటంకొనసాగుతుంది..
95 శాతం ఉద్యోగాలు స్థానికులతో భర్తీ చేయాల్సి ఉండగా, ఆ విషయం మరచి రాష్ట్ర ప్రభుత్వం వితండవాదం చేయటం సరైనది కాదు. భార్యాభర్తల బదిలీల్లో కూడా అన్యాయాలు జరిగాయని, తమ పేరు నమోదు కాలేదని, అర్హత ఉన్నా కూడా ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ జాబితాలో తమ పేర్లు లేవని వందల గ్రీవెన్స్ అందాయి. మారుమూల ప్రాంతాల్లో ఎవరు పని చేయాలనే ప్రశ్నతో ముఖ్యమంత్రి టీచర్ల డిమాండ్లపై వక్రభాష్యం చెప్పారు. 317 జీవో అమలు విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా.. మరోవైపు బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆగ్రహావేశాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వారి కుటుంబాలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయి. వారికి న్యాయం జరిగేంత వరకు ఉద్యోగ, టీచర్ సంఘాల తరఫున నిరసన కార్యక్రమాలు, పోరాటాలు కొనసాగిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. ఉద్యోగులు, టీచర్ల హక్కులను కాపాడాలి.
- మైస శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్