కాంగ్రెస్​లో జరుగుతున్నది ఘర్షణ కాదు.. సంఘర్షణ

రాష్ట్రంలో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీని చూస్తుంటే.. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ కు ఇంకా భవిష్యత్ ఉందనిపిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి డజను మంది పోటీలో ఉన్నారు. పీసీసీ చీఫ్​ ఎంపికతోనే పార్టీ ఫ్యూచర్​ తేలిపోనుందని క్యాడర్ కూడా భావిస్తోంది. ఈ అంశంపై ఆలస్యమయ్యే కొద్దీ పార్టీ మరింత ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్ ఎలా గట్టెక్కిస్తారనేది ఆసక్తికరం. ఠాగూర్ ఇన్​చార్జ్​గా వచ్చాక జరిగిన దుబ్బాక, గ్రేటర్​ ఎన్నికల్లో కోలుకోలేని స్థితిలోకి కాంగ్రెస్​ దిగజారింది. దీంతో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కన్నా బీజేపీ సవాల్ గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఠాగూర్​కు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత  కొత్త పంథాలో కాంగ్రెస్ ను చూడబోతున్నారని ఠాగూర్ ప్రకటించారు. కానీ, ఆ కొత్తదనం ఏమిటనేది తేలాల్సి ఉంది. మెజారిటీ నుంచి అభిప్రాయాల సేకరణ వాస్తవానికి పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పీసీసీ చీఫ్​లుగా నియమించినప్పుడు పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదు. హైకమాండ్​ కూడా మెజారిటీ అభిప్రాయం తీసుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే వారిద్దరూ సీల్డ్ కవర్ పీసీసీ ప్రెసిడెంట్స్. ఇప్పడు పీసీసీ ఎంపిక కోసం జరుగుతున్న ప్రక్రియలో మార్పు కనిపిస్తోంది. దీని వల్ల హైకమాండ్​కు పీసీసీ చీఫ్​ ఎంపిక విషయంలో అనేక అనుమానాలకు పరిష్కారం దొరుకుతుంది. దాదాపు 165 మంది నుంచి హైకమాండ్​ అభిప్రాయం తీసుకుంది. 165 మంది ఒకే పేరు చెప్పకపోయినా వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. వీరిలో మొదట మెజారిటీ ఒపీనియన్ తెలుస్తుంది. మరోవైపు ఎవరెవరు ఇంట్రెస్ట్ తో ఉన్నారనేది బయటకొస్తుంది. దీంతో హైకమాండ్ కు క్లారిటీ వస్తుంది. ఎవరికి పదవి ఇస్తే ఏం జరుగుతుందో ముందే ఒక అంచనా వస్తుంది. ఇదంతా ఠాగూర్ చెప్పిన కొత్త కాంగ్రెస్ లో భాగమని చెప్పాలి. ఈ ప్రక్రియను కూడా వ్యతిరేకించే వారున్నారు. మెజారిటీ ఒపీనియన్ కాదు ఏకాభిప్రాయం కావాలని అంటున్నారు. రేవంత్​కే ఎక్కువ అవకాశాలు మెజారిటీ సాధించలేకపోయామని అనుకునే నేతలు కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనది మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి పీసీసీ చీఫ్​ ఇవ్వాలనే అంశం. రేవంత్ రెడ్డికి ఇవ్వొద్దనేది వీరి వాదన. అయితే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పైగా ఎంపీ అన్న లాజిక్ ను వీరు మిస్​అవుతున్నారు. అందువల్ల ఈ అంశాన్ని హైకమాండ్ కొట్టిపారేస్తోంది. రేవంత్​పై కేసులున్నాయని మరికొందరు రిపోర్టులు పంపిస్తున్నారు. ఈ అంశంపైనా స్పందించిన హైకమాండ్ పార్టీలో చాలామందిపై కేసులు ఉన్నాయని చెబుతోంది. రేవంత్ కే పీసీసీ ఖాయమని చెప్పకపోయినా ఆయన దానికి అర్హుడేనన్న విషయం దీనిని బట్టి అర్థమవుతోంది. ఠాగూర్ సేకరించిన సమాచారంలోనూ మెజారిటీ ఒపీనియన్ రేవంత్ కే అనుకూలంగా వచ్చినట్టు తెలిసింది. పోటీ ఇస్తున్న కోమటిరెడ్డి పీసీసీ చీఫ్​ ఎంపికలో మరో ప్రధాన పోటీదారుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన కూడా ఎంపీ. హైకమాండ్​ ఆయనను విస్మరించలేదు. వెంకట్​రెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో వారికి వర్గ బలం ఉంది. అయితే పీసీసీ చీఫ్​ కాకుండా చాలా పదవుల్లో మార్పులు జరుగుతాయని సమాచారం. అందులో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్​కు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక బీసీలకు చాన్స్​ ఇవ్వాలని కొంత మంది చెప్పారు. ఇక్కడ అనేక అంశాలు ఠాగూర్ దృష్టికి వచ్చాయి. రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న బీసీల్లో ముదిరాజ్, పద్మశాలి, యాదవులకు అన్ని పార్టీల్లోనూ ప్రాధాన్యత లేదు. కాంగ్రెస్ వీరిని ఆకర్షించి పార్టీ పదవులు, ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వచ్చింది. ఠాగూర్ ఆల్రెడీ ఇదే వర్క్​లో ఉన్నారని సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎవరికి పీసీసీ చీఫ్​ పదవి వచ్చినా కత్తి మీద సామే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి పట్టాలు ఊడిపోతున్న బండిలా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్​ను ఖతం చేస్తే అధికారంలోకి రావచ్చనే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. టీఆర్ఎస్.. బీజేపీ పట్ల భయంగానే ఉన్నా కాంగ్రెస్ ఖతం అయితే ఆ పార్టీకి  వచ్చిన నష్టం లేదు. కొత్త పీసీసీ అధ్యక్షుడు బీజేపీని, టీఆర్ఎస్ ను ఎదిరించి నిలిస్తేనే కాంగ్రెస్ గేమ్ లో ఉంటుంది. లేకుంటే గాంధీభవన్ కే పరిమితమవుతుంది. – బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ For More News.. అప్పులకు ఫుల్ డిమాండ్​! ఐసీసీ టీ20 బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంక్ మెరుగుపరచుకున్న కోహ్లీ కరోనా టైంలోనూ విదేశీ పెట్టుబడులు ఆగలేదు లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్‌ ఆర్డర్లు