లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్(ఒక దేశం-ఒకే ఎన్నికలు)' బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. మంగళవారం(డిసెంబర్ 17) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఎన్డీయే, దాని మిత్ర పక్షాలు మద్దతు ప్రకటించగా.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
Also Read :- జమిలి బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్కు పట్టుబట్టిన విపక్షాలు
అనంతరం జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపడంపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. అందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేయగా.. 198 మంది వ్యతిరేకించారు. ఆ తరువాత 'జమిలి బిల్లుల'ను కేంద్రమంత్రి సభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆ బిల్లును ఏం చేయబోతుంది..? అసలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఏమిటి..? దీని విధివిధానాలు ఏంటి..? అందులో ఉన్న సభ్యలు ఎవరు..? అనేది తెలుసుకుందాం..
జాయింట్ పార్లమెంటరీ కమిటీ వివరాలు
- జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఏదేని ప్రత్యేక అంశంపై లేదా బిల్లులను పరిశీలించేందుకు పార్లమెంటుచే ఏర్పాటు చేయబడిన తాత్కాలిక కమిటీ.
- ఏదేని ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక దుష్ప్రవర్తన లేదా అవినీతి ఆరోపణలతో కూడిన నిర్దిష్ట సమస్యలను ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది.
- కమిటీ సభ్యులను పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి ఉభయసభ సభ్యులు ఉంటారు. రాజ్యసభ కంటే రెండు రెట్లు ఎక్కువ మంది లోక్ సభ సభ్యులు ఉంటారు.
- ఉదాహరణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 15 మంది సభ్యులు ఉన్నారనుకుంటే.. లోక్‌సభ నుండి 10 మంది, రాజ్యసభ నుండి 5 మంది సభ్యులు ఉంటారు.
- తమ దృష్టికి వచ్చిన సమస్యపై జేపీసీ వివరణాత్మక పరిశోధనలు నిర్వహించే బాధ్యత కలిగి ఉంటుంది. వీరు పత్రాలను సమీక్షించవచ్చు. అధికారులను ఇంటర్వ్యూ చేయవచ్చు. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దానిని లోతుగా పరిశీలించడానికి సాక్ష్యాలను సేకరించవచ్చు. కమిటీ కార్యకలాపాలు చాలా గోప్యంగా ఉంటాయి.
- జేపీసీ సిఫార్సులు చేసినప్పటికీ తమ నివేదిక ఆధారంగా చర్య తీసుకోమని లేదా అమలు చేయమని ప్రభుత్వాన్ని బలవంతం చేయదు. అంటే జేపీసీ ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం లేదు. ఆ విచక్షణ పూర్తిగా ప్రభుత్వానికి ఉంటుంది.
- జేపీసీ చేసిన సిఫార్సులకు ప్రతిస్పందించడం, తీసుకున్న ఏవైనా చర్యల గురించి నివేదించడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ సమాధానం ఆధారంగా కమిటీ పార్లమెంటులో 'చర్య తీసుకున్న నివేదికలను' సమర్పిస్తుంది.
- కమిటీ సూచించిన సిఫార్సులు, ప్రభుత్వ ప్రతిస్పందనలు పార్లమెంటులో చర్చించబడతాయి.
- జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నిర్దిష్ట కాల పరిమితి అంటూ లేదు. కమిటీ తన విధిని పూర్తి చేసిన తర్వాత రద్దు చేయబడుతుంది.
భారతదేశంలో జేపీసీ చరిత్ర
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు అనేక జాయింట్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో వివాదానికి కారణమైన ముఖ్యమైన అంశాలను పరిశోధించడానికి కొన్ని ప్రధాన జేపీసీలు ఏర్పడ్డాయి.
- బోఫోర్స్ కాంట్రాక్టులపై జాయింట్ కమిటీ.
- సెక్యూరిటీలు, బ్యాంకింగ్ లావాదేవీలలో అక్రమాలపై విచారణకు జాయింట్ కమిటీ
- స్టాక్ మార్కెట్ స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ
- శీతల పానీయాలలో పురుగుమందుల అవశేషాలు, భద్రతా ప్రమాణాలపై జాయింట్ కమిటీ.
- 2011లో 2G స్పెక్ట్రమ్ స్కామ్.
- 2013లో VVIP ఛాపర్ స్కామ్.
- భూసేకరణ బిల్లు (2015): భూసేకరణ, పునరావాసం, పునరావాసంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కును పరిశీలించడం కోసం చివరిసారిగా 2015లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.