కేజ్రీవాల్ ఇతర రాజకీయ నాయకులందరిలాగే అహంకార పూరితంగా వ్యవహరించడంతోపాటు అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కొన్నాడు. వరుస విజయాలతో సుపరిపాలనపై ఆసక్తిని కోల్పోయాడు. 2013 నుంచి 2020 వరకు కేజ్రీవాల్ సుపరిపాలనపైనే ప్రధానంగా దృష్టి సారించాడు.
కానీ, 2020 తర్వాత, కేజ్రీవాల్ ప్రజలు ఆశించిన పరిపాలనను అందించలేదు. లిక్కర్ స్కామ్ వంటి భారీ అవినీతి ఆరోపణలను ఎదుర్కోవలసి వచ్చింది. అవినీతి ఆరోపణల కారణంగా కేజ్రీవాల్ కూడా ఐదు నెలలు జైలుకు వెళ్లాడు. ఈ చర్యలు అతనికి ఉన్న ప్రజాకర్షణను తగ్గించాయి. అతని ఓటమికి కారణమయ్యాయి.
కేజ్రీవాల్ తన ఎదుగుదల రాజకీయాలకు చేసిన కృషి అసాధారణమైనప్పటికీ, ఆయన ఓటమి ఇతర రాజకీయ నాయకులందరిలాగే ఉందని చెప్పవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే,కేజ్రీవాల్ ఇతర రాజకీయ నాయకుల మాదిరిగానే ప్రవర్తించడం వల్లే ఓడిపోయాడు.
అర్వింద్ కేజ్రీవాల్ డిసెంబర్ 2013లో అకస్మాత్తుగా భారత రాజకీయ రంగంలోకి ప్రవేశించి సంచలనాత్మకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. కేజ్రీవాల్ 2013కి ముందు రాజకీయాల్లో లేడు. అనంతరం రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఆయన సొంతంగా పార్టీని స్థాపించారు.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఆయన పార్టీ తరఫున గెలుస్తారా అని రాజకీయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. కొంతమంది రాజకీయ నేతలు ఆయన ధైర్యం చూసి మూర్ఖత్వంగా భావించి నవ్వుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2013లో 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న షీలా దీక్షిత్‌ను కేజ్రీవాల్ ఓడించారు.
కేజ్రీవాల్ సంప్రదాయకంగా రాజకీయాల్లోకి రాకపోవడంతో ప్రజలు కూడా తొలుత ఆయన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు. ఎందుకంటే, కేజ్రీవాల్ ఒక రాజకీయ వంశపారంపర్యం నుంచి వచ్చిన నాయకుడు కాదు. అదేవిధంగా ధనవంతుడు కాదు. ఒక కుల సమూహానికి నాయకత్వం వహించలేదు. పెద్ద సినిమా నటుడికి ఉన్న ప్రజాకర్షణ కూడా లేని సామాన్య నాయకుడు.
కాగా, భారతదేశంలోని చాలా మంది రాజకీయ నాయకులు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ, మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరద్ పవార్, ఉత్తరప్రదేశ్ రాజకీయాలను తనచుట్టూ తిప్పుకున్న ములాయం సింగ్ యాదవ్, బిహార్ రాష్ట్రాన్ని సొంత ఇలాకాగా ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ వంటి నేతలు ప్రాంతీయ పార్టీలను స్థాపించి విజయవంతమయ్యారు.
ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అయితే, వారు పెద్ద జాతీయ పార్టీల నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసినవారు. వీరందరికీ భిన్నమైన రాజకీయ నాయకుడు కేజ్రీవాల్. ఏ రాజకీయ ప్రోద్బలం లేకపోయినప్పటికీ 2013 నుంచి 2020 వరకు జరిగిన మూడు ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ వరుసగా గెలిచి ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అనంతరం కేజ్రీవాల్ భారతదేశం అంతటా తను స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను విస్తరించారు. ప్రాంతీయ పార్టీగా మొదలైన ఆప్ ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నుంచి జాతీయ పార్టీ హోదాను సాధించింది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదగటం చాలా తక్కువ పార్టీలకు మాత్రమే సాధ్యమైంది.
కానీ, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగిన కేజ్రీవాల్ 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. కేజ్రీవాల్ వైఫల్యాలు ఏమిటి, ఆయన భవిష్యత్తు ఏమిటి తదితర ప్రశ్నలతోపాటు రాజకీయ వర్గాలు, ప్రజల్లోనూ కేజ్రీవాల్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.
భారత రాజకీయాల్లో కేజ్రీవాల్ మార్క్
ఒక సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించి.. ప్రముఖ జాతీయ పార్టీలను సైతం ఓడించి, ఒక సామాన్యుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కేజ్రీవాల్ నిరూపించారు. ఇతర రాజకీయ నాయకులతో ప్రజలు విసుగు చెందినప్పుడు ‘మార్పు’కు సంకేతంగా ఒక సామాన్య నాయకుడు విశ్వాసం కల్పిస్తే ప్రజలు అతడిని ఆదరిస్తారు.
2013లో కేజ్రీవాల్ తన మొదటి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఆయన అత్యంత సాధారణ వ్యక్తులను ఎమ్మెల్యేలుగా, మంత్రులను చేశారు. ఢిల్లీ ప్రజలు వారిని విశ్వసించారు. ఉపాధ్యాయులు, చిన్న వ్యాపారవేత్తలు, పదవీ విరమణ చేసిన నిపుణులు, నిరుద్యోగ విద్యావంతులైన యువత కూడా ప్రజాప్రతినిధులుగా మారారు. 2025లో ఓడిపోయే వరకు కేజ్రీవాల్ ఈ ధోరణిని కొనసాగించాడు. విద్యుత్, నీరు వంటి ప్రాథమిక అంశాలను ప్రజలకు ఉచితంగా ఇవ్వవచ్చని కూడా కేజ్రీవాల్ ప్రజలకు చూపించాడు.
రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొన్న చరిత్ర
కేజ్రీవాల్ భారతదేశ రాజకీయాల్లో కులరహిత రాజకీయాలను కూడా పరిచయం చేశాడు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో ఆధిపత్య రాజకీయ పార్టీలు. అయినప్పటికీ, ఈ రెండు దిగ్గజాలను పూర్తిగా తరిమికొట్టవచ్చని కేజ్రీవాల్ భారతదేశానికి చూపించాడు. ఈ జాతీయ పార్టీలు కేజ్రీవాల్‌ను ఓడించడానికి అన్ని ఉపాయాలు, వ్యూహాలు ప్రయత్నించాయి. కానీ, వారు 2025 వరకు కేజ్రీవాల్‌ను ఓడించలేకపోయారు.
కేజ్రీవాల్ అర్హత కలిగిన పేద ప్రజలకు కూడా ఆప్ టిక్కెట్లు ఇచ్చారు. ఆ వ్యక్తులు ధనవంతులైన రాజకీయ దిగ్గజాలను ఓడించారు. ఢిల్లీ, పంజాబ్ అనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలను స్వాధీనం చేసుకున్న మొదటి ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆ పార్టీని స్థాపించిన నాయకుడు కేజ్రీవాల్. మరే ఇతర ప్రాంతీయ అధినేత కూడా 2 రాష్ట్రాల్లో తన పార్టీని గెలిపించలేకపోయారు. ఢిల్లీలో ఓటమిపాలైనా కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో ఒక కీలక నాయకుడుగానే ఉంటారనేది వాస్తవం.
కేజ్రీవాల్‌ను కేజ్రీవాలే ఓడించాడు
కేజ్రీవాల్ చేసిన అతిపెద్ద పాపం ఏమిటంటే అతను మధ్యతరగతి ప్రజలను నిరాశపరిచాడు. భారతీయ మధ్యతరగతి ప్రజలు రాజకీయ నాయకుల నుంచి ఏమీ కోరుకోరు. కానీ, రాజకీయ నాయకులకు కొంత మర్యాద, కొంత నిజాయితీ, దేశభక్తి ఉండాలని వారు ఆశిస్తారు. ఇక్కడ, కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారు.
తనను అధికారంలోకి తెచ్చిన మధ్యతరగతిని ఆయన మరచిపోయారు. చాలామంది రాజకీయ నాయకులు మధ్యతరగతి వర్గాలను కోపగించుకోవడం వల్ల విఫలమవుతారు. కేజ్రీవాల్ కూడా అలానే చేశారు. 2024 జూన్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీకి మధ్యతరగతి వారి నుంచి షాక్ వచ్చింది. ఇప్పుడు, కేజ్రీవాల్‌కు ‘మధ్యతరగతి’ షాక్ వచ్చింది. ఏ రాజకీయ పార్టీ కూడా కేజ్రీవాల్‌ను ఓడించలేదు. కేజ్రీవాల్‌ను...కేజ్రీవాలే ఓడించాడు.
కేజ్రీవాల్ భవిష్యత్తు
కేజ్రీవాల్ ముందున్న మొదటి సవాలు తన పార్టీని నిలబెట్టుకోవడం, తన నాయకులు పార్టీ మారకుండా చూసుకోవడం. ఆయనకు ఇది చాలా కష్టమైన పని అవుతుంది. మరో తక్షణ సవాలు తన పంజాబ్ పార్టీని విభజించి పంజాబ్ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోవాలి. ఆయనపై నమోదైన కేసులు, చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడం కూడా సవాలుగా ఉంటుంది. దీనికి చాలా ఓపిక, అసామాన్య ధైర్యం అవసరం. కేజ్రీవాల్ తిరిగి రాజకీయంగా పుంజుకోగలరా అంటే.. దిద్దుబాటు చర్యలతో సాధ్యమే.
కేజ్రీవాల్ తన తప్పులను అంగీకరించి తన దిశను మార్చుకోవాలి. ఒకవేళ కేజ్రీవాల్ తన తప్పులను గుర్తించకపోతే, రాజకీయ పునరాగమనం కష్టం. కేజ్రీవాల్ వయసు 56 సంవత్సరాలు మాత్రమే. చాలా మంది భారతీయ రాజకీయ నాయకులు 80 సంవత్సరాల వరకు చురుకుగా ఉంటారు. కేజ్రీవాల్ భవిష్యత్తు కూడా ఆయన ప్రత్యర్థులు తప్పులు చేస్తారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తును అంచనా వేయడం కష్టం. కానీ, కేజ్రీవాల్ గతం స్పష్టంగా ఉంది. కేజ్రీవాల్ రాజకీయాల్లో చిన్న వయసులోనే అద్భుతమైన విజయాన్ని,సాటిలేని విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.
- పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్-