ఆధ్యాత్మికం : దశరధుడికి ఆ పేరు ఎలా వచ్చింది.. పది రథాల కథ ఏంటీ.. ?

ఆధ్యాత్మికం : దశరధుడికి ఆ పేరు ఎలా వచ్చింది.. పది రథాల కథ ఏంటీ.. ?

రామాయణాన్ని ఆధ్యాత్మికంగా చూసినా, ఫిలాసఫికల్​ గా చూసినా గొప్ప ప్రాముఖ్యత ఉంది. అందులో లోతైన సత్యం ఉంది. మనిషి ప్రయాణం ఎలా ముందుకు సాగాలో అది చెప్తుంది. అయితే, రామాయణం ఎక్కడో.. పురాణాల్లో, పుస్తకాల్లో లేదు. సంఘర్షణ రూపంలో మనలోనే ఉంది. అది తెలుసుకున్న రోజు.. పరివర్తన మొదలవుతుంది. అప్పుడు మనిషి సుగుణాలతో వెలిగిపోతాడు' అంటాడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త   రవి శంకర్. మనలో రామాయణం ఏంటని అనుకుంటున్నారా? ఆయన ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. . 

మహారాజు దశరథుడు తన భార్య కౌసల్య తో కలిసి అశ్వమేథ యాగం చేశాడు. తర్వాత వాళ్లకు నలుగురు కొడుకులు పుట్టారు. మేథ  అంటే శుద్ధి....శ్వ...  అంటే.. నిన్న లేదా రేపు అని అర్థం. అశ్వ అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది అని అర్థం. 'మేథ' అంటే మరో అర్దం  తెలివి, జ్ఞానం అని తెలిసిందేగా! జ్ఞానాన్ని వర్త మానానికి తీసుకురావడం, తనని తాను లోతుగా పరిశీలిస్తూ.. శరీరాన్ని, ఆత్మని శుద్ధి చేసి వర్తమానానికి తీసుకురావడమే అశ్వమేధ యాగం. ఎప్పు డైతే జ్ఞానం వర్తమానంలో ఉంటుందో.. అలాంటి జ్ఞానాన్ని ఏదీ కదిలించలేదు. కేవలం గతం, భవిష్యత్తు మాత్రమే మీ జ్ఞానాన్ని కదిలించగలవు! గతం, భవిష్యత్తు  మధ్య జ్ఞానం కదలాడకుండా స్థిరంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనిషికి అసలైన స్వేచ్ఛ లభిస్తుంది.

దశరథుడు అంటే..

దశరథుడు అంటే.. ఒకేసారి పది రథాలను నడపగలవాదని అర్థం. కౌసల్య అంటే నైపుణ్యం కలిగినది అని అర్థం. దశరథుడు, కౌసల్య ఇద్దరూ కలిసి అశ్వమేథ యాగం చేశారు. అంటే వాళ్లిద్ద రూ కలిసి వర్తమానాన్ని (కర్మలను) శుద్ధి చేశారు. ఫలితంగా రాముడు పుట్టాడు. దశరథుడి ముగ్గురి భార్యల పేర్లు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. మొదటి భార్య పేరు కౌసల్య.. అంటే నైపుణ్యం అని అర్థం. రెండో భార్య పేరు సుమిత్ర... అంటే మంచి స్నేహితుడు అని అర్థం. మంచి వైపు దారి చూపించేది అని మరో అర్థం. మూడో భార్య పేరు కైకేయి. తనను తాను త్యాగం చేసుకొని కరుణ చూపేదని అర్ధం. అయితే కైకేయిపై ఎలాంటి అభి ప్రాయం ఉన్నా.. ఆమె అందరికంటే ప్రత్యేకం. ఆమెకు కరుణ ఎక్కువ. బయటికి ఆమె మనకు అంత బాగా కనపడకపోయినా... లోపల ఎదుటి వాళ్లకు ఏది మంచో.. అదే చేస్తుంది. అది ఆమె కరుణకు ప్రమాణం..

పది రథాలు..

దశరథుడు పది రథాలు నడిపినట్టు. మన శరీరం కూడా రథాలతో నడుస్తుంది. కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఈ ఐదు ఇంద్రియాలు మొదటి ఐదు రథాలు కాగా... చేతులు, పాదాలు,పెద్ద పేగు, జననేంద్రియాలు, నోరు ఈ కర్మేంద్రి యాలు మరో ఐదు రథాలు. ఈ ఐదు ఇంద్రియాల దృక్పథం, ఐదు కర్మేంద్రియాల చర్యలు.. మొత్తం ఈ పది రథాలు ఏ దిక్కుకు వెళితే... జీవితం కూడా ఆ దిక్కుకే మళ్లుతుంది.

రాముడంటే ..వెలుగు

రా.. అంటే వెలుగు అని అర్థం. ..మా... అంటే నాలో.... అని అర్థం. రామా అంటే మన లోపల ఉండే వెలుగు అని అర్ధం. మన ఆత్మే ఆ వెలుగుకి రూపం. ఆ ఆత్మే నిరంతరం మనలో వెలుగుతుం ది. రామునికి ముగ్గురు తమ్ముళ్లు. లక్ష్మణ అంటే.. ఎప్పుడూ మెలకువతో ఉండేవాడని, శత్రుఘ్న అంటే శత్రువులు లేనివాడని, భరతుడు అంటే తెలివైనవాడని అర్థాలు. అయోధ్య అంటే.. ధ్వంసం చేయలేనిదని అర్థం. 

మన శరీరం అయోధ్య లాంటిదే అని అర్ధం చేసుకునేందుకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అందులో దశరథుడు (ఐదు ఇంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు), కౌసల్య (నైపుణ్యం), సుమిత్ర (స్వేహభావం), కైకేయి(క రుణ) ఉంటాయి. అంతేకాదు. మనసు, బుద్ధికి రూపమిస్తే సీత...మనసు ఆత్మకు దూరంగా వెళ్లింది. రావణుడు అంటే అహంకారం. అది సీతను ఎత్తు కెళ్లింది. అప్పుడు రాముడు (ఆత్మ), లక్ష్మణ (మేలు కొలుపు), హనుమంతుడు (జీవన శక్తి) సాయంతో సీతను మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. వీళ్లంతా వర్తమానంలో ఉంటే అయోధ్య( శరీరాన్ని)ను ధ్వంసం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. సీతా రాములు ఇంటికి తిరిగి రావడంపై సంతోషం తె లియజేస్తూ ప్రజలు దీపాలతో స్వాగతం చెప్పారు. అదే దీపావళి అయింది. అయితే, అసలు దీపం మనలోనే ఉందని గుర్తించాలి. అదే ఆత్మ. ఆ ఆత్మ దీపం వెలగాలంటే.. జ్ఞానం అనే నూనె పోయాలి. దాన్ని వర్తమానంలో ఉంచగలిగినప్పుడే ఆ ఆత్మా దీపం ఆరిపోకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాతే ద్వేషం, ఈర్ష వంటి అన్ని నెగెటివ్ ఎమోషన్స్ నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.

-శ్రీశ్రీ రవి శంకర్, ఆధ్యాత్మిక వేత్త-