ముల్క్ అంటే రాజ్యం లేదా దేశం. ముల్కీ అంటే స్థానికుడు లేదా దేశీయుడు అని అర్థం. నాన్ ముల్కీ లేదా గైర్ ముల్కీ అంటే స్థానికేతరుడు లేదా విదేశీయుడు. ప్రారంభంలో స్థానికులను దక్కనీలు, స్థానికేతరులను అఫాకీలుగా సంబోధించేవారు. అసఫ్‌జాహీల కాలంలో సైనికులతోపాటు అనేక మంది దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో ముస్లింలు, హిందువులూ ఉన్నారు. వీరినే బహమనీల కాలంలో దక్కనీలుగా పిలిచారు. వీరందరు స్థానికులుగా గుర్తింపు పొంది అనేక పదవులు నిర్వహించారు. బహమనీ సుల్తానుల పరిపాలనా కాలంలో ఇరాన్, ఇరాక్, టర్కీ తదితర దేశాల నుంచి అనేక మంది వచ్చి దక్కన్లో స్థిరపడ్డారు. వీరందరినీ అఫాకీలు అనేవారు. అఫాకీలు అంటే వలసదారులు.
ఇతర దేశాల నుంచి వచ్చిన అఫాకీలు ప్రభుత్వం కల్పించిన ఆర్థిక ప్రోత్సాహకాలతో వ్యాపారాల్లో చేరి ఆర్థికంగా బలోపేతమయ్యారు. సైన్యంలో, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందారు. స్థానికులుగా ఉన్న దక్కనీలు రెండో శ్రేణి పౌరులుగా ఉండేవారు. అఫాకీలు మంత్రి పదవులు సైతం సంపాదించి అన్ని ప్రయోజనాలు పొందారు. తద్వారా దక్కనీలకు, అఫాకీలకు మధ్య అన్ని రంగాల్లో విభేదాలు వచ్చి శత్రుత్వం ఏర్పడింది. వీటికితోడు మత విభేదాలు కూడా తోడయ్యాయి. దక్కనీలు సున్నీలు కాగా, అఫాకీలు షియా మతస్తులు. బహమనీ రాజ్యంలో పేరు ప్రఖ్యాతలు గడించిన ప్రధానులు హసన్, మహ్మద్ గవాన్లు కూడా అఫాకీలే. గుజరాత్‌పై హసన్ దాడి చేసినప్పుడు సైన్యంలోని దక్కనీలు సహాయ నిరాకరణ వల్లనే ఓటమి చెందారు. దీనిని ఆసరాగా తీసుకొని గుజరాత్ సైన్యం హసన్తోపాటు చాలా మంది సైన్యాన్ని అంతం చేసింది.
మూడో మహ్మద్ షా కాలంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అఫాకీ మహ్మద్ గవాన్ రాజధాని బీదర్‌లో పెద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇందులో బోధకులు, విద్యార్థులుగా అఫాకీలకు పెద్ద పీట వేశారు. గవాన్ చేపట్టిన సంస్కరణలు దక్కనీలకు పూర్తి నష్టం కలిగించాయి. బీదర్ పట్టణంలో దక్కనీలకు, అఫాకీలకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగి అనేక మంది మరణించారు. వీరి మధ్య అంత: కలహాల కారణంగానే బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమై ఐదు స్వతంత్ర్య రాజ్యాలు అవతరించాయి. బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం తర్వాత గోల్కొండ కేంద్రంగా ఏర్పడిన కుతుబ్‌షాహీ వంశస్తులు స్థానికులకు పెద్దపీట వేసి సంయమనం పాటించారు. స్థానిక భాష తెలుగును ప్రోత్సహిస్తూ అక్కన్న, మాదన్న వంటి వారిని ప్రోత్సహించారు. తద్వారా స్థానిక, స్థానికేతర సమస్యలు అంతగా రాలేదు. 1724లో ఔరంగాబాద్ రాజధానిగా ఏర్పడిన అసఫ్‌జాహీల కాలంలో మళ్లీ ముల్కీ, నాన్ ముల్కీల సమస్య తలెత్తింది. ఐదో నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో ముల్కీ సమస్య తీవ్ర రూపం దాల్చింది.
సాలార్జంగ్ సంస్కరణల ఫలితం
సిపాయిల తిరుగుబాటు అనంతరం మొగల్సామ్రాజ్యం అంతరించగానే అవధ్, లక్నో, బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, ముర్షిదాబాద్ మొదలైన రాజ్యాల నుంచి పదవులు కోల్పోయిన వారంతా నిజాం రాజ్యంలోకి వలస వచ్చారు. శాంతియుతంగా నివసించడానికి ఏ ఇబ్బంది లేని నిజాం రాజ్యం వారికి ప్రధాన దిక్కయింది. వీరు అనతికాలంలోనే ఉన్నత పదవులు పొంది ముల్కీల అవకాశాలను చేజిక్కించుకున్నారు. మొదటి సాలార్జంగ్ 1853లో ప్రధాని అయ్యాక హైదరాబాద్‌ను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా అనేక సంస్కరణలు చేపట్టాడు. వాటి అమలు కోసం బెంగాల్, బొంబాయి, మద్రాస్ ప్రావిన్సుల నుంచి విద్యావంతులైన మేధావులను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఇలా వచ్చిన వారిలో అత్యధికులు ముస్లింలే. కాయస్తులు, ఖత్రీలు కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందారు. హైదరాబాద్‌లో సివిల్ సర్వీసెస్ స్థాపించిన సాలార్జంగ్–1 అలీఘఢ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యావంతులను హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. వీరు స్థానిక ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, వారికి విధులు కేటాయించి వెళ్లిపోతారని స్థానికులు భావించారు. కానీ వారు ఇక్కడే తిష్ఠ వేసి ఉన్న ఉద్యోగాలే కాకుండా రాబోయే ఉద్యోగాల్లో కూడా తమ వారిని నియమించుకొని ముల్కీలకు అన్యాయం చేశారు.
సాలార్జంగ్ ప్రధాని అయ్యే నాటికి హైదరాబాద్ రాజ్యంలో పరిపాలనా వ్యవస్థ నిర్మాణాత్మకంగా లేదు. హైదరాబాద్ నగరంలో కొంత మేరకు పరిపాలనా యంత్రాంగం ఉన్నా జిల్లా, గ్రామ స్థాయిలో అంతగా లేదు. చాలీచాలని పరిపాలనా యంత్రాంగం వల్ల ఉన్న ఉద్యోగుల్లో నైపుణ్య లేమి స్పష్టంగా ఉండేది. దీంతో నైపుణ్యులతో కూడిన పరిపాలన వ్యవస్థ ఏర్పాటుకు సాలార్జంగ్ కృషి చేశాడు. పాలనా యంత్రం విస్తరించడంతో నైపుణ్యం పేరుతో సాలార్జంగ్–1 నాన్ ముల్కీ లేదా గైర్ ముల్కీలకుహైదరాబాద్ సంస్థానంలో పెద్దపీట వేశాడు. ఇతని కాలంలోనే ఉత్తరప్రదేశ్ నుంచి బిల్‌గ్రామీ వంశస్తులు అనేక మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంలోనే బెంగాల్ నుంచి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతను నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.
నాన్ ముల్కీల వలసలు ఎక్కువ కావడంతో స్థానిక ముల్కీలకు ఉపాధి లేక వారి జీవితాలు చిందరవందర అయ్యాయి. దీంతో హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ ఉద్యోగుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ముల్కీలపైన నాన్ ముల్కీల ఆధిపత్యం క్రమంగా పెరగడంతో స్థానికులు అసంతృప్తికి, అసహనానికి, అశాంతికి గురయ్యారు. గైర్ ముల్కీలపై ముల్కీలు వ్యతిరేకత పెంచుకున్నారు. నాన్ ముల్కీలపై ఎన్ని ఆంక్షలు విధించినా వారి ఆధిపత్య ధోరణి తగ్గకపోవడం, నోబుల్స్, స్థానికులతో నాన్ ముల్కీ ఉన్నత ఉద్యోగులపై నాన్ ముల్కీల పెత్తనం పెరగడం, ముల్కీలకు నాన్ ముల్కీలకు మధ్య విద్వేషపూరిత వాతావరణం నెలకొనడం, ఉత్తర భారతదేశ ముస్లింలకు, స్థానిక ముస్లింలకు మధ్య వివాదాలు ఏర్పడటం తదితర కారణాల వల్ల ఉద్యోగ నియామకాల గురించి పునరాలోచనలో పడ్డారు. 1867–68 నాటికి ఈ పరిస్థితి ఏర్పడింది. మొదటి సాలార్జంగ్ ముల్కీలను విద్యావంతులను చేసి, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలనే దృఢ సంకల్పంతో ఐదో నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో 1868లో మొదటిసారి హైదరాబాద్‌లోని అన్ని పరిపాలనా విభాగాల్లో ముల్కీలనే నియమించాలని అధికారికంగా ఆదేశాలను జారీ చేశారు.
ముల్కీ గెజిట్ – 1888
నాన్ ముల్కీల ఆధిపత్యం, అహంకార ధోరణితో విసిగిపోయిన ముల్కీలు ఉద్యమం చేపట్టారు. నాన్ ముల్కీలకు సాలార్జంగ్–2 మద్దతు ఇస్తున్నాడని ముల్కీలు ఆరో నిజాంకు వినతిపత్రం సమర్పించారు. దీన్నే ముల్కీ పత్రం అంటారు. దీంతో నిజాం హైదరాబాద్ సంస్థానంలో ఎంత మంది నాన్ ముల్కీలు పనిచేస్తున్నారు? వారి హోదా ఏమిటి? తదితర వివరాలను వెంటనే సమర్పించాలని సాలార్జంగ్–2ను ఆదేశించాడు. దీంతో ఉద్యోగుల సాధారణ జాబితాను తొలిసారిగా 1886లో విడుదల చేశారు. 1884లో హైదరాబాద్ ప్రభుత్వం ప్రారంభించిన సివిల్ సర్వీసు తొలి జాబితాను నిజాం ఆదేశానుసారం సాలార్జంగ్–2 1886లో తొలిసారిగా ప్రకటించాడు. సంస్థానం మొత్తం ఉద్యోగుల్లో ముల్కీలు 52 శాతం, వీరిపై ప్రభుత్వ వ్యయం 42 శాతం కాగా, నాన్ ముల్కీ ఉద్యోగులు 48 శాతం ఉండగా, వీరిపై 58 శాతం ఖర్చు చేస్తున్నట్లు తేలింది.
రెండో సాలార్జంగ్ కాలంలో
రెండో సాలార్జంగ్ మద్దతుతో నాన్ ముల్కీ అధికారుల ఆధిపత్యం నిజాం ప్యాలెస్, కోర్టులో కూడా మొదలైంది. బ్రిటీష్ వారి ప్రోద్బలంతో ఇంగ్లీష్ తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టాడు. తద్వారా ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం లేని ముల్కీలకు ఉద్యోగ నియామకాల్లో ప్రాతినిధ్యం తగ్గింది. దీనికితోడు నాన్ ముల్కీలకు ఎక్కువ జీతాలు ఇచ్చి ముల్కీలకు తక్కువ జీతాలు ఇచ్చి రెండో పౌరులుగా చూడటం మొదలైంది. 1884 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అత్యధిక ఉద్యోగాలు నాన్ ముల్కీలకే దక్కాయి. కారణం ఉర్దూ భాషను అభ్యసించడం వల్ల వారికి ఉద్యోగాలు లభించాయి. ఈ సమస్య ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కి తెలవడంతో ప్రభుత్వంలోని సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పట్టికను వారి పుట్టిన స్థలం ఆధారంగా తయారు చేయాలని రెండో సాలార్జంగ్ ఆదేశించాడు.