వర్సిటీ వ్యవహారాల్లో.. నవీన్ ​మిట్టల్​ పెత్తనమేంది?

  • వర్సిటీ వ్యవహారాల్లో నవీన్ ​మిట్టల్​ పెత్తనమేంది?
  • రిజిస్ట్రార్​గా యాదగిరిని మార్చినప్పటి నుంచి టార్గెట్
  • ఆయన ఆర్డర్​ తేకపోతే కేసు  నా దగ్గర ప్రతి పైసా చెల్లింపు తాలూకు నోట్​ఫైల్​ ఉంది 
  • ప్రెస్​ మీట్​లో తెలంగాణ      వర్సిటీ వీసీ రవీందర్​ గుప్తా ​
  • దూసుకొచ్చిన విద్యార్థి నేతలు

నిజామాబాద్,  వెలుగు:   అటానమస్​ బాడీ అయిన తెలంగాణ యూనివర్సిటీ  వ్యవహారాల్లో ఉన్నత విద్యా శాఖ కమిషనర్​నవీన్​ మిట్టల్​పెత్తనం ఏమిటని వీసీ రవీందర్ ​గుప్తా ప్రశ్నించారు. యాదగిరి రిజిస్ర్టార్ ​పదవిలో కొనసాగించనందుకే తనను టార్గెట్​ చేశారన్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహకరించడం లేదని ఆరోపించారు. ఇతర వర్సిటీలకు అక్కడి ప్రజాప్రతినిధులు గవర్నమెంటు నుంచి నిధులు తెస్తున్నారని ఇక్కడా పరిస్థితి లేదన్నారు. శనివారం ఆయన వర్సిటీలోని తన కార్యాలయంలో ప్రెస్​మీట్​ నిర్వహించి మాట్లాడారు. 

హెచ్​వోడీలు  అడిగినందుకే నియామకాలు

వర్సిటీ అవసరాలు కౌంట్​లోకి తీసుకొని రూ.498 రోజువారీ చెల్లింపులతో ఔట్​సోర్సింగ్​ నియామకాలు చేశామని వీసీ వెల్లడించారు. ప్రతి హెచ్​వోడీ,  ప్రొఫెసర్లు సిబ్బంది కావాలని అడిగారన్నారు. ప్రతి పైసా చెల్లింపు తాలూకు నోట్​ఫైల్​ఉందన్నారు. తెలంగాణ వర్సిటీ ఒక్కటే కాదని ఉస్మానియాలో 600, కాకతీయలో 300, మహాత్మాగాంధీ వర్సిటీలో 150 మందిని నియమించారన్నారు. 

యాదగిరికి రెండు రోజులు టైం ఇస్తున్నా...

రిజిస్ట్రార్​ బాధ్యతను యాదగిరి ఈ నెల తొమ్మిదో తారీఖున శివశంకర్​కు అప్పగించారని, ఒకసారి వదులుకున్నాక ఈసీ మీటింగ్​ తీర్మానం చేశారని మళ్లీ రావడం కుదరదన్నారు. తీర్మాణం, ఆర్డర్​ రెండూ వేరన్నారు. ఈ విషయాన్ని తాను యాదగిరికి ఫోన్​లో చెప్పినా వినలేదన్నారు. 19 తారీకు ఈసీ తీర్మానాలపై హైకోర్టు తాజాగా స్టే విధించినందున ఆయన రిజిస్ట్రార్​ బాధ్యతలు చెల్లవన్నారు.  అయినా ఆర్డర్​ తెచ్చుకోవడానికి యాదగిరికి రెండు రోజులు ఛాన్స్​ ఇస్తున్నానని, ఆ తర్వాత కుర్చీలో కూర్చుంటే పోలీసు కేసు పెడతానన్నారు. పది రోజులు తాను నియమించిన విద్యావర్ధిని రిజిస్ట్రార్​గా ఉంటారని, తర్వాత ఓయూ నుంచి ఒకరిని నియమించుకుంటామన్నారు. అయితే,  అక్కడే ఉన్న విద్యావర్థిని తాను రిజిస్ట్రార్​గా ఉండనని చెప్పారు. 

గెట్​అవుట్​ అని అవమానించారు

గత 17 నెలల నుంచి ఈసీ మీటింగ్​ ఎందుకు పెట్టలేదని వీసీని విలేకరులు ప్రశ్నించగా అన్ని వర్సిటీలకు ఈసీ సభ్యుడైన నవీన్​ మిట్టల్​కు తాను 12 సార్లు దీని గురించి చెప్పేందుకు ఫోన్​ చేశానన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కమిషనర్ ​అయినందున తెలంగాణ వర్సిటీ ఈసీ మీటింగ్​ నిర్వహణకు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు.  ఈ నెల 19 తారీఖు​ అజెండాను రిజిస్ట్రార్ ​హోదాలో  విద్యావర్థినితో తయారు చేయించామని, ఆమె మీటింగ్​కు వెళ్తే 'గెట్​ అవుట్​' అంటూ అవమానించారన్నారు.  విద్యావర్థిని ప్రొఫెసర్ అన్నది కూడా గుర్తించలేదన్నారు. ఆమెను సస్పెండ్​ చేసిన తీర్మానం చెల్లదని వీసీ చెప్పగా తనకు అలాంటి ఆర్డర్​ రాలేదని విద్యావర్థిని వివరించారు.

గవర్నర్​ను కలిసి చెబుతా..

19వ తేదీ ఈసీ మీటింగ్​ తీర్మానాలకు మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించి..26 తేదీ తీర్మానాల రద్దుకు కోర్టులో మరో పిటిషన్​ వేస్తారా? అని ప్రశ్నించగా 26 తేదీ తీర్మానాలు కూడా చెల్లవన్నారు.  నవీన్​ మిట్టల్​ఈసీ సభ్యులతో బలవంతంగా సంతకాలు  తీసుకొని వింత తీర్మానాలు చేయించారన్నారు. అన్ని విషయాలను తాను గవర్నర్​ తమిళి​సైకి చెప్పబోతున్నానన్నారు.  ఉద్యోగాలు కోల్పోయిన 149 మందిలో కొందరు వీసీని కలువగా కోర్టు స్టే గురించి చెప్పి ఉద్యోగాలు ఎటూ పోవని సర్ది చెప్పారు.

విద్యార్థుల నినాదాలు 

ఏబీవీవీ, పీడీఎస్​యూ విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్​, శివ నేతృత్వంలో ప్రెస్​మీట్​ నిర్వహిస్తున్న గదిలోకి చొచ్చుకు వచ్చి వీసీ గోబ్యాక్​ అంటూ నినాదాలు చేశారు. టేబుల్​పైకి ఎక్కి గందరగోళం చేయగా వీసీ పోలీసులకు సమాచారమిచ్చారు. రెండు సార్లు వీసీ ఛాంబర్​లోకి వచ్చిన విద్యార్థులను సీఐ కృష్ణ, ఎస్ఐ గణేశ్​అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు.