కావాల్సింది సుందరీకరణ కాదు..సహజ వనరుల రక్షణ

అక్టోబర్‌‌ 13‌‌న కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌‌ ‌‌నగరం అతలాకుతలమైంది. వరద నీటితో అసాధారణ విధ్వంసాన్ని ఎదుర్కొంది. వరదలతో బస్తీలు, మిడిల్​ క్లాస్​ కాలనీలు వరదల్లో మునిగిపోయాయి. చాలా అపార్ట్​మెంట్లలో సెల్లార్లు, గ్రౌండ్​ ఫ్లోర్ల వరకు మునిగిపోయాయి. దీంతో పాలు, కూరగాయల్లాంటి నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. సమస్య అందరికీ వచ్చినప్పటికీ.. బస్తీల్లో పేదలు మాత్రం సర్వస్వం కోల్పోయారు. గత కొన్నేండ్లుగా హైదరాబాద్​ స్లమ్స్​ లో పని చేస్తున్న సామాజిక కార్యకర్తలం వరద బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగాం. వివిధ బస్తీల్లో ప్రజలను షెల్టర్​ హోమ్స్​కు తరలించేందుకు, ఆహార పదార్థాలు అందజేసేందుకు పౌర సమాజం నుంచి 500 మంది వరకు పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వం చేయాల్సినంత సాయం, కృషి ఈ విషయంలో చేయడం లేదు.

70 ఏండ్లుగా నీటి వనరుల విధ్వంసం

నగరంలో గత 70 ఏండ్లుగా జరుగుతున్న నీటి వనరుల విధ్వంసం, చెరువులు, కుంటలను ఆక్రమించి వెలసిన భారీ భవంతులు, విల్లాలు, అపార్ట్​మెంట్లతోనే ఈ పరిస్థితి దాపురించింది. హైదరాబాద్‌‌ ‌‌సంస్థానం దేశంలో విలీనమయ్యే సమయానికి హైదరాబాద్‌‌ ‌‌నగరంలో, చుట్టూరా చిన్నాపెద్దా చెరువులు 600పైగానే ఉండేవి. దూద్​ బౌలి, పుత్లీ బౌలి పేరిట పెద్ద బావులు కూడా ఉండేవి. 1975 లో జరిగిన ఒక సర్వే ప్రకారం చెరువుల సంఖ్య 159గా తేలింది. 2000 నాటికి చెరువుల సంఖ్య 40కి పడిపోయింది. ఇరవయ్యేండ్ల తర్వాత ఇవి వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యకు చేరాయి. ఉన్న చెరువులు కూడా ఆక్రమణలతో కుచించుకుపోయాయి. చెరువులు, కుంటలు ఉండాల్సిన చోట కాంక్రీట్​ భవనాలు వెలియడంతో నీళ్లు భూగర్భంలోకి చేరే పరిస్థితి లేకుండా పోయింది.

అభివృద్ధి నమూనా మారాలి

నగర నిర్మాణానికి, సంపన్నుల సౌఖ్యానికి చెమటను చిందిస్తున్న పేదలు ఉంటున్న 60 గజాల స్థలానికి నివాస హక్కులు దొరకడం లేదు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్​ విధ్వంసమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన పాలకులు.. అవేమీ పట్టించుకోకుండా మరింత విధ్వంసం సృష్టిస్తున్నారు. వేలాది ఎకరాల పంట భూములు పారిశ్రామిక పార్కులుగా మార్చేస్తున్నారు. రింగ్​ రోడ్లు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లతో సహజంగా వరద నీరు పారాల్సిన వైపు పారకుండా ఊర్లను, నగరాన్ని ముంచెత్తుతోంది. అపార్ట్​మెంట్లు, ఫ్లై ఓవర్లు, మెట్రో రైళ్లు, పెద్ద పెద్ద షాపింగ్‌‌ ‌‌మాల్స్, కేబుల్​ బ్రిడ్జిలు, పరిశ్రమలు, ఎయిర్​ పోర్టుల్లాంటి పైపై మెరుగులకు పోతూ సహజ వనరుల సంరక్షణను ప్రభుత్వాలు మరిచిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అభివృద్ధి నమూనా మారాలి. నగర అభివృద్ధిలో ప్రకృతి, సహజ వనరులు, పేదల మనుగడ ఉండేలా సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. కేవలం ప్రకృతి మీద నెట్టేసి బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే ఇలాంటి విపత్తులు ఏడాదికోసారి
వస్తూనే ఉంటాయి.

సజయ, సోషల్​ యాక్టివిస్ట్