
దాదాపు జనాలు చేతిపై నుంచి డబ్బులు ఇవ్వడం మానేశారు. రూపాయి నుంచి కోట్ల రూపాయిల వరకు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. గూగుల్ పే... ఫోన్ పే .. పరిమితికి లోబడి నగదు బదిలీ అవుతుంది. పరిధి దాటితే మాత్రం NEFT, RTGS అనే రెండు పద్దతుల ద్వారా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్‌కు ఏమేమి కావాలి.. వీటిపై విధించే చార్జీల మోత ఎంత.. అసలు NEFT, RTGS అంటే ఏమిటో తెలుసుకుందాం. . . .
దాదాపు జనాలు అందరూ ఎక్కువుగా నగదు బదిలీని ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ విభాగంలో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే నగదు బదిలీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ వివిధ బ్యాంకులలో వ్యక్తిగత ఖాతాలు ఉంటాయి. వాటిలో డబ్బులను డిపాజిట్లు చేసి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా నగదు బదిలీలు అంటే డబ్బును మన ఖాతా నుంచి మరో ఖాతాలకు పంపిస్తుంటారు. ఆ సమయంలో ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ అనే విధానాల ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతుంటాయి. 2020 జనవరి ఒకటి నుంచి ఆన్‌లైన్‌లో చేసిన NEFT ద్వారా నగదు బదిలీలకు చార్జీ విధించడం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ సౌకర్యం కల్పించాయి.
NEFT అంటే ఏమిటి?
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌ను NEFT అంటారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఒకరి నుంచి మరొకరికి డబ్బులను పంపవచ్చు. ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా నిధులను బదిలీ చేయవచ్చు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లో కూడా ఈ అవకాశం ఉంది. దీని ద్వారా సొమ్ములు నిర్థిష్ట సమయానికి బదిలీ అవుతాయి. అది అరగంట నుంచి మూడు గంటల వరకూ ఉంటుంది.
RTGS అంటే..
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్) విధానంలోనూ డబ్బులను వేరొకరికి బదిలీ చేయవచ్చు. దీని ద్వారా బదిలీ చాలా వేగంగా జరుగుతుంది. ఇక్కడ బదిలీ చేసిన వెంటనే వేరొకరికి ఖాతాలో జమ అవుతాయి. అయితే దీనిలో రూ.2 లక్షలకు మించి లావాదేవీలు జరపాలి. గరిష్ట పరిమితి లేదు.
అవసరమైన వివరాలు..
నగదు బదిలీల కోసం కొన్ని వివరాలు చాలా అత్యవసరం. ఆన్‍లైన్‌లో అయినా, బ్యాంకులకు వెళ్లి డబ్బు ట్రాన్స్ ఫర్ చేసినా వీటిని నమోదు చేయాలి.
- ట్రాన్స్ ఫర్ చేయాల్సిన సొమ్ము పంపే వారి ఖాతాలో బ్యాలెన్స్ ఉండాలి.
- బెనిఫీషరీ బ్యాంకు, ఖాతా నంబరు.
- బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్
- డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసి వ్యక్తి మొబైల్ నంబర్/ఇమెయిల్ ఐడీ
- డబ్బును పంపేందుకు కారణం (పర్పస్)
చార్జీల వివరాలు..
బ్యాంకులలో నిర్వహించే NEFT, RTGS బదిలీలకు చార్జీలు వసూలు చేస్తారు. ఆన్ లైన్ లో చేసే బదిలీలకు కొన్ని బ్యాంకులలో మినహాయింపు ఉంటుంది. 2024 ఏప్రిల్ 17 నాటికి ఆ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల నుంచి NEFT బదిలీలకు చార్జీలు వసూలు చేస్తుంది. రూ.పది వేల లోపు బదిలీలకు రూ.2 ప్లస్ జీఎస్టీ, రూ.పదివేల నుంచి రూ.1 లక్ష వరకూ రూ.4 ప్లస్ జీఎస్టీ, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ రూ.12 ప్లస్ జీఎస్టీ, రూ.2 లక్షలకు మించి అయితే రూ.20 ప్లస్ జీఎస్టీ విధిస్తుంది. అలాగే RTGS బదిలీలకు సంబంధించి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ట్రాన్స్ ఫర్ కోసం రూ.20 ప్లస్ GST వసూలు చేస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో NEFT చార్జీల వివరాల విషయానికి వస్తే రూ.1 లక్షలోపు బదిలీలకు రూ.2 ప్లస్ జీఎస్టీ, ఆ పైన వాటికి రూ.10 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ చార్జీలు రూ.15 ప్లస్ జీఎస్టీగా ఉన్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ లో రూ.పదివేల వరకూ 2, రూ.1 లక్ష వరకూ 4, అలాగే 1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ రూ.14, ఆపై రూ.2 లక్షల నుంచి బదిలీలకు రూ.24 చార్జీ వసూలు చేస్తారు. ఇక ఆర్ టీజీఎస్ కు సంబంధించి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రూ.20, అలాగే రూ.5 లక్షల వరకూ రూ.40 చార్జీ విధిస్తారు.