వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. గతంలో ఎప్పుడైనా జరిగాయా .. !

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కసరత్తులు చేస్తోన్న సంగతి తెలిసిందే.   ఈ క్రమంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 1 న  కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించి కేంద్రానికి నివేదికను సమర్పించనుంది.   

అయితే దేశంలో గతంలో ఎప్పుడైనా వన్ నేషన్ -వన్ ఎలక్షన్ జరిగాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.  స్వాతంత్ర్యం వచ్చాక 1951-52లో దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించారు. ఆ తర్వాత 1957, 1962, 1967లో కూడా ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ తర్వాత నుంచి ఆ క్రమం తప్పింది.  

1968, 1969లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది.  1970 జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి కాలపరిమితి ముగియకుండానే లోక్‌సభ కూడా రద్దు అయ్యింది.   మళ్లీ ఒక దశాబ్దం తర్వాత 1983లో ఎన్నికల సంఘం ఏకకాల ఎన్నికలను తీసుకురావాలని ప్రతిపాదించింది. అయితే  అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుందని ఈసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 

ALSO READ:బౌలింగే పాకిస్తాన్ బలం.. వారిని ఎదుర్కోవాలంటే అదొక్కటే దారి: విరాట్ కోహ్లి

ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాతం మళ్లీ వన్ నేషన్ -వన్ ఎలక్షన్ చర్చ తెరపైకి వచ్చింది.  లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, దానివల్ల నిధులు, సమయం ఆదా చేయవచ్చని ప్రధానమంత్రి మోదీ చాలాసార్లు చెప్పారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీల నేతల్లో పలు ఆందోళనలు ఉన్నాయి. 

2015లో వీటిపై చర్చ సందర్భంగా ఏఐఏడీఎంకే, డీఎండీకే, అసోం గణపరిషత్‌, శిరోమణి అకాలీదళ్‌తో పాటు మరికొన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. కానీ, కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎన్‌సీపీ, సీపీఐ, ఏఐఎంఐఎం వంటి పార్టీలు జమిలి ఎన్నికల ఆలోచన అసాధ్యమని వ్యతిరేకించాయి.