Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. మరి సినిమాల పరిస్థితి ఏంటి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి(టీడీపీ,జనసేన,బీజేపీ) భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్(Pawan kalyan) తదితరులు ప్రమాణస్వీకారం కూడా చేశారు. మంత్రివర్గంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. కనీసం ఒప్పుకున్నాయైనా కంప్లీట్ చేస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది. 

పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు భారీ సినిమాలున్నాయి. వాటిలో హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. వాటిలో.. హరి హర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్ ఇప్పటికే సగానికన్నా ఎక్కువ కంప్లీట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు కలిపి కనీసం పదిహేను రోజుల సమయం ఇస్తే కంప్లీట్ అవుతాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంత వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరి ప్రస్తుతం పరిస్థితులలో ఈ సినిమాలను పవన్ కళ్యాణ్ ఫినిష్ చేస్తాడా అనేది అనుమానంగా ఉంది. 

ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలను పూర్తిగా వదిలేసి వచ్చాడు. కానీ, 2019లో ఘోర పరాభవాన్ని చవిచుశాక పార్టీని నడపడం కోసం తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే ఆయన మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కానీ, ఇంట్రెస్ట్ తో మాత్రం కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఆయన ఒక పని ఒప్పుకున్నారు అంటే దాని కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. మరి.. ఇలాంటి పరిస్థుతుల్లో పవన్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారా.. కనీసం ఒప్పుకున్న సినిమాలైనా కంప్లీట్ చేస్తారా. రెండు పడవలపై ప్రయాణం పవన్ కు సాధ్యం అవుతుందా అనే చర్చ నడుస్తోంది.

మరోపక్క.. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలను ఒప్పుకొకుండా అతి త్వరలో ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఆ తరువాత తన పూర్తి దృష్టిని కేవలం రాజకీయాల కోసమే కేటాయించనున్నాడట. దీంతో.. రానున్న ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ను తెరపై చూడటం కష్టమే అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.