పోలీస్ డైరీ అంటే ఏమిటి?

పోలీస్ డైరీ అంటే ఏమిటి?

భారత రాజ్యాంగం ప్రకారం,  భారతీయ న్యాయ సంహిత ( బీఎన్ఎస్) ప్రకారం  న్యాయ సూత్ర హక్కులను బాధితులకు అలాగే నేర ఆరోపణదారులకు చట్ట ప్రకారం కల్పించడం జరిగింది.  ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో పోలీసుల పాత్ర  ‘లా అండ్ ఆర్డర్’  విషయంలో చాలా క్రియాశీలకమైనది. 

ఈ క్రమంలో  నేర విచారణలో భాగంగా పోలీస్ అధికారులు భారతీయ న్యాయ సంహితలోని నియమ, నిబంధనలను  తప్పక పాటించాలి. ఇందులో భాగంగా సెక్షన్ 192 భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.. పోలీస్ డైరీ గురించి చెబుతుంది.  

ఒక పోలీస్ అధికారి ఏదైనా ఒక కేసు విషయంలో  విచారణలో భాగంగా.. ఏ సమయానికి నేరానికి సంబంధించిన విషయం తెలిసింది.  ఎవరు చెప్పారు.  ఎవరైనా ఫిర్యాదు చేశారా లేదా మరేవిధంగా సమాచారం అందింది.  దీంతోపాటు ఆ విషయం తెలిసిన తరువాత నేర స్థలానికి ఎప్పుడు వెళ్ళాడు.  వెళ్ళిన క్రమంలో ఏం చేశాడు, ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ చేశాడు,  పంచనామా,  సాక్షుల స్టేట్​మెంట్లతోపాటు  నేర పరిసర ప్రాంతం మ్యాప్​లను  ప్రిపేర్ చేసిన విషయాలను  క్రమం తప్పకుండా పోలీస్ డైరీలో పూర్తిగా రాయాలి.  

సాక్షులు ఏం చెప్పారో కూడా రాయాలి. అలాగే  పోలీస్ డైరీలో విచారణలో  చేసిన విషయాలను పేజీ నంబర్లతో సహా వేయాలి.  సంబంధిత కోర్టులో ఆ కేసు ట్రయల్​కి  వచ్చినప్పుడు ఆ  పోలీస్ డైరీని కోర్టు గనుక ఏదైనా ఒక విషయం పట్ల స్పష్టత తీసుకోవాలనుకున్నప్పుడు పోలీస్ డైరీని తీసుకురమ్మని పోలీస్ వారిని ఆదేశించవచ్చు.

పార్ట్ వన్ కేసు డైరీ

ఈ నేపథ్యంలో ఆ పోలీస్ డైరీని  నేర విచారణ ఖైదీ  ట్రయల్​లో భాగంగా చూడటానికి వీలులేదు.  ఒకవేళ ఆ పోలీస్ డైరీని ఇన్వెస్టిగేషన్ అధికారి జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగిస్తే  అప్పుడు నేర విచారణ ఖైదీ ఆ పోలీస్ డైరీని ఉపయోగించుకోవచ్చు.  పోలీస్ డైరీని  ‘పార్ట్ వన్ కేసు డైరీ’  అని కూడా పిలుస్తారు.  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 172 కూడా  పోలీస్ డైరీ  గురించి చెబుతున్నది.  పోలీస్ అధికారులు తప్పకుండా పార్ట్ వన్ కేసు డైరీని నిబంధనలు అతిక్రమించకుండా నిర్వహించాలి.  

ప్రత్యేక సందర్భంలో  కోర్టుగనుక పోలీస్ డైరీని విచారణలో భాగంగా తీసుకురమ్మని ఆదేశించవచ్చు.  కేసు రికార్డులో పొందుపర్చిన విషయాలు,  సాక్ష్యాలు,  పోలీస్ డైరీలో గనుక ఎలాంటి భిన్నాభిప్రాయం లేకుండా సరిగ్గా వివరించి ఉంటే.. ఒక పారదర్శకమైన విచారణ చేపట్టినవారిగా పోలీస్​వారికి కీర్తి ప్రతిష్టలు, పోలీస్​విభాగం పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది.  

అదేవిధంగా  కోర్టుకు  కూడా పోలీస్ అధికారులు  చేసిన ఇన్వెస్టిగేషన్​పై  నమ్మకం ఏర్పడుతుంది. అంతేగాక నేరస్తులను  కోర్టుచేత  చట్టం ప్రకారం శిక్షించడానికి  దోహదం చేసినవారు అవుతారు.  తద్వారా  సమాజంలో  నేరం చేసినవారికి శిక్ష తప్పదన్న  సంకేతాన్ని తెలియజేయవచ్చు. కాబట్టి,  పోలీస్ డైరీ  క్రిమినల్ కేసులలో చాలా క్రియాశీలకమైన పాత్ర  పోషిస్తుందని గమనించాలి.  కాగా,  ఏపీ హైకోర్టు ఇటీవల 2025(1) ALT (Crl.) 121 (A.P.) తీర్పులో  పోలీస్ డైరీ ప్రాముఖ్యతను పోలీసులకు మరోసారి గుర్తుచేసింది.

-–- రాచకొండ ప్రవీణ్ కుమార్,న్యాయవాది, వరంగల్–