మానవ సమాజాలు ఏర్పడ్డ తర్వాత సభ్యులందరినీ సమాజ నిర్వహణలో భాగంగా విజ్ఞానవంతులుగా మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం సమాజం ఇతర వ్యవస్థలతో పాటు విద్యావ్యవస్థను రూపొందించుకొన్నది. కుటుంబం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ తదితర వ్యవస్థల నిర్వహణకు సమర్థవంతమైన విద్యావంతుల అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రపంచంలోని సమాజాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించాయి.
విద్య మానవ సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య జ్ఞానాన్ని అందించి మనిషికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా మనిషిని విజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. భారత సమాజంలోని పిల్లలను ప్రతిభావంతమైన, సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన విజ్ఞానవంతులుగా తయారుచేయుట కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్, వివిధ గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు నెలకొల్పాయి.
విద్యాబోధన కోసం ఉపాధ్యాయులకు వివిధ విషయ సామర్థ్య పరీక్షలు నిర్వహించి ఎన్నిక చేసుకుంటారు. భారతదేశంలో ఇంత పకడ్బందీగా అమలు అవుతున్న విద్యావిధానం దేశానికి మంచి విద్యాబుద్ధులున్న పౌరులను అందించాలి. కానీ, పలు విద్య సంబంధ ఎన్జీవోలు, ఎన్సీఈఆర్టీ, ఎన్ఏఎస్సంస్థ వెల్లడించే సర్వే నివేదికల్లో విద్య పరిమాణాత్మకంగానే వృద్ధి జరుగుతోంది తప్ప గుణాత్మకంగా వృద్ధి చెందటం లేదని స్పష్టం చేస్తున్నాయి.
అసర్ నివేదిక -2024
యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎస్ఈఆర్) 2024ను స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 605 గ్రామీణ జిల్లాల్లో 17,997 గ్రామాలలో 6.49 లక్షల మంది పిల్లలను ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో రెండో తరగతి పాఠాన్ని కనీసం చదవగలిగిన మూడో తరగతి పిల్లల సంఖ్య 23.4%. గడిచిన ఇరవై ఏళ్లలో ఇదే అత్యధికం. దీనికి సంతోషపడాలా లేదా 76.6% పిల్లలు తరగతికి తగిన తెలివితేటలు అలవర్చుకోలేకపోయారని బాధపడాలో అర్థంకాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 270 గ్రామాల్లో 5,306 ఇళ్లకు వెళ్లి 3 నుంచి 16 సంవత్సరాల వయసున్న విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలపై సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దాదాపు సగం మంది 2వ తరగతి పాఠాలు తప్పులు లేకుండా చదవలేకపోయారు అని, ఐదవ తరగతి విద్యార్థులు 29.3 % మంది 2వ తరగతి పాఠం చదవగలరని, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల పరిస్థితి స్వల్పంగా మాత్రమే మెరుగ్గా ఉందని అసర్ రిపోర్టు -2024 పేర్కొన్నది. అదేవిధంగా తీసివేతలు, భాగహారాలలోనూ చాలామంది పిల్లలు మెరుగైన ప్రదర్శన లేదని తేలింది. వార్షిక విద్యాస్థాయి నివేదిక అసర్ -2024 సర్వే ప్రకారం 2018తో పోల్చితే దేశంతో పాటు రాష్ట్రంలోనూ విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. గతంలో ఎన్సీఈఆర్టీ రిపోర్ట్ కూడా ఇలాంటి చేదు నిజాలనే బహిర్గతం చేసింది.
విద్యా ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలుచేయాలి
ప్రభుత్వ విభాగాలు మెరుగైన విద్యా ప్రణాళికలతో ముందుకు రావాలి. ఆ ప్రణాళికలు సంపూర్ణంగా క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడాలి. ఉపాధ్యాయులను చిత్తశుద్ధితో భాగస్వాములు అయ్యేలా చూడాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ, వెనుకబడిన విద్యార్థుల సామాజిక, ఆర్థిక, మానసిక స్థితులను అంచనావేసి తగు సూచనలు చేయాలి. పేరెంట్స్ మీటింగ్స్ లో వెనుకబడిన పిల్లల తల్లిదండ్రులకు సరియైన సూచనలు ఇవ్వాలి.
చదవటం, రాయటం, లెక్కించటంలో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక ప్రణాళికలు పాఠశాల స్థాయిలో రూపొందించుకుని చిత్తశుద్ధితో అమలు చేయాలి. పర్యవేక్షణ అధికారులు నిష్పక్షపాతంగా విధినిర్వహణ చేసి లోపాలు ఉన్నచోట తగు తక్షణ చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యాసంబంధ కమిటీలు విద్యా తీరుతెన్నులు, సంవత్సరంలో పిల్లలు ఎంతమేర వివిధ విద్యా విషయాలలో అభివృద్ధి చెందినారో విశ్లేషణచేసి, తగు సూచనలు చేసి వాటి అమలును పర్యవేక్షించాలి.
పటిష్ట ప్రణాళికలు, చిత్తశుద్ధితో క్షేత్రస్థాయిలో అమలు చేయడంతోపాటు, స్థానిక సంస్థల ప్రతినిధుల భాగస్వామ్యం, ముఖ్యంగా పేరెంట్స్ కమిటీల పర్యవేక్షణ, విద్యార్థుల తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే విద్యార్థుల్లో రాయటం, చదవటం, లెక్కించటంలో గుణాత్మక గణనీయమైన మార్పును తక్కువ కాలంలోనే చూడవచ్చు.
నాణ్యమైన విద్య అందకపోతే దేశ భవిష్యత్తు ఏంటి?
అర్థంకాని విషయం ఏమిటంటే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫలితాల సరళిలో ఉన్నతి తొంబై శాతం పైగా ప్రతి సంవత్సరం ఉంటుంది. ఇందులో ఉన్న రహస్యం అందరికీ అర్థం అయినా తెలియనట్టే ఉంటారు. ప్రాథమిక అంశాలపై అవగాహన లేకుండా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పాసయితే విద్యార్థులకు జరిగే ప్రయోజనం ఏంటి? దేశానికి జరిగే ప్రయోజనం ఏంటి? సామాన్య విద్యార్థికి ప్రయోజనం ఏంటి? ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప నిర్మాణాత్మక ప్రయోజనం ఏమీ ఉండదు అనేది చేదు నిజం.
డిగ్రీ , ఇంజినీరింగ్ పట్టభద్రులు చాలామందిలో ఉద్యోగ అర్హతలు కొరవడడానికి కారణం ప్రైమరీ, హైస్కూలు విద్యలో నాణ్యత సన్నగిల్లడం అనేది ఎవరూ కాదనలేని నిజం. నేడు దేశవ్యాప్తంగా 26 కోట్లకుపైగా పాఠశాల విద్యార్థులున్నారు. వారిలో 60% విద్యార్థులు సర్కారీ బడుల్లో చదువుకుంటున్నారు అని గణాంకాలు చెబుతున్నాయి. వారికి నాణ్యమైన విద్య అందకపోతే దేశ భవిష్యత్తు ఏంటి? 76 వసంతాల స్వేచ్ఛా భారతం ఇలా విద్యావిధానంలో పేలవమైన ఫలితాలు ఇస్తే అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండగలమా?