Sanatan Dharma: సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Sanatan Dharma: సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

‘ధర్మాన్ని అతిక్రమించకూడదు. మాటకు కట్టుబడి ఉండాలి. తెలియక ధర్మాన్ని అతిక్రమించినా, ఆడిన మాట తప్పినా అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి’ అని భారతం చెప్తోంది. మహాభారతంలో... ద్రౌపదిని పాండవులు ఐదుగురు వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి నారద మహర్షి పాండవులు నివసిస్తున్న ప్రాంతానికి వేంచేశాడు. పాండవులు ఆ మహర్షిని విద్యుక్తంగా సత్కరించారు. ఆ సందర్భంలో నారదుడు, ‘ధర్మరాజా! ఒక స్త్రీ కారణంగా ఎంతో అన్యోన్యంగా ఉన్న సుందోపసుందులు అనే గంధర్వులు ఒకరినొకరు చంపుకున్నారు. మీరు ఐదుగురు ఇంతవరకు ఒకే మాట మీద ఉంటున్నారు. ద్రౌపది కారణంగా మీలో మీకు గొడవలు రాకుండా ఉండేలా చూసుకోండి’ అని సూచించాడు.

అప్పుడు ధర్మరాజు ఆలోచించి,  ‘మునీంద్రా! మేం ఐదుగురం ద్రౌపదితో ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం ఉంటాం. ఆ సమయంలో నియమాన్ని అతిక్రమించి ఎవ్వరు ఆ మందిరంలో ప్రవేశించినా వారు పన్నెండు మాసాల పాటు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం’ అన్నాడు. నారదుడు సంతోషంతో అక్కడ నుంచి నిష్క్రమించాడు.

ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆపదలో ఉండి అర్జునుడి సాయాన్ని అర్థించాడు. ఆ విప్రునికి సాయం చేయటం కోసం అర్జునుడు తన గాండీవాన్ని తెచ్చుకోవటం కోసం ద్రౌపది మందిరానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ధర్మరాజు ఉన్నాడు. నియమాన్ని అతిక్రమించి అర్జునుడు ఆ మందిరంలో ప్రవేశించి తన గాండీవాన్ని తీసుకుని... అన్నగారితో, ‘అనుజా! మన నియమం ప్రకారం నేను ధర్మాన్ని అతిక్రమించాను. ఒక బ్రాహ్మణుడికి నేను సాయం చేయవలసివచ్చింది. ఆ పని పూర్తి కాగానే నేను పన్నెండు మాసాలు తీర్థయాత్రలు చేస్తాను’ అని వినయంగా పలికాడు.

అందుకు ధర్మరాజు, ‘అర్జునా! మన రాజ్యంలో ఉండే బ్రాహ్మణుల్ని కాపాడటం రాజుగా నీ విధి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోవటం దోషమే అవుతుంది. అందువల్ల నువ్వు ధర్మాన్ని అతిక్రమించినట్లు కాదు’ అన్నాడు. అందుకు అర్జునుడు, ‘కారణం ఏదైనా మనం అనుకున్న మాటకు కట్టుబడి ఉండవలసిందే. ఆ మాటను దాటితే, ధర్మాన్ని అతిక్రమించినట్లే’ అని అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు.

ధర్మానికి అంత విలువ ఉండేది. ఒక ధర్మాన్ని ఆచరించి, దానిని ఆ తరువాతి తరాలవారికి ఆచరణీయ యోగ్యంగా చేయటమే సనాతన ధర్మం అని రుషులు పలికారు. ఒక ధర్మాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ ధర్మాన్ని ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించకూడదు. పాండవులు ఐదుగురు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. అందువలననే వారి ప్రవర్తన తరవాతి తరాలకి ఆచరణయోగ్యంగా ఉంది. ఆ విధంగా పాండవులు సనాతన ధర్మాన్ని అనుసరించినట్లు భారతం చెప్తోంది.

ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ధర్మానికి కట్టుబడి అనుసరించి, తరవాతి తరాల వారికి ఆచరణ యోగ్యంగా ప్రవర్తించాలి. శ్రీమద్రామాయణంలో భరతుడు ధర్మాన్ని అనుసరించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన వరాల కారణంగా శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లాడు. తల్లి కోరిక ప్రకారం భరతుడు సింహాసనం అధిష్టించాలి. కాని ధర్మానికి కట్టుబడిన భరతుడు, ‘ఇక్ష్వాకు సంప్రదాయం ప్రకారం రాముడు రాజు కావాలి. నేను ఆ ధర్మాన్ని అతిక్రమించను. వనాలకు వెళ్లి అన్నగారిని తీసుకువచ్చి, పట్టాభిషేకం చేస్తాను’ అని పలికి సనాతన ధర్మాన్ని అనుసరించాడు. అందువలననే నేటికీ భరతుని మార్గం ఆచరణీయంగా ఉంది.

కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగిన శకుంతల ఆ మహర్షి నుంచి ధర్మబద్ధంగా జీవించటం అలవాటు చేసుకుంది. దుష్యంతుని గాంధర్వ విధిలో వివాహం చేసుకుని ఆయనతో జీవించింది. దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లిపోయిన తరువాత శకుంతలకు భరతుడనే కుమారుడు జన్మించాడు. పిల్లవాడికి పది సంవత్సరాలు వచ్చినా దుష్యంతుని నుంచి కబురు రాకపోవడంతో...  కణ్వుడు, తన శిష్యులను వెంట ఇచ్చి శకుంతలను అత్తవారింటికి పంపాడు. అక్కడ దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టనట్లుగా నటించాడు. కాని శకుంతల తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా దుష్యంతుడిని నిలదీసింది. చివరకు ఆకాశవాణి పలకడంతో దుష్యంతుడు శకుంతలను స్వీకరించాడు.

రాజుగా దుష్యంతుడు తన ధర్మాన్ని నిర్వర్తించటంలో భాగంగా శకుంతలను గుర్తుపట్టనట్లుగా ప్రవర్తించాడు. ఆకాశవాణి పలకగానే జరిగిన విషయమంతా తన ప్రజలకు వివరించాడు. రాజు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. కనుక, నేను ఈ విధంగా ఉండవలసి వచ్చింది అని పలికాడు. అదేవిధంగా శకుంతల కూడా తాను ధర్మం తప్పి చరించనని నిరూపించుకోవడంలో ఎంతో ఆత్మస్థైర్యంతో నిలబడి, దుష్యంతుని నిలదీసి, తాను ధర్మపరురాలనని అందరికీ తెలియచేసింది. ఇలా ముందు తరాల వారికి ఆదర్శప్రాయంగా నిలబడటమే సనాతన ధర్మమని పురాణాలు చెప్తున్నాయి. ఇలా ముందు తరాల వారికి ఒక ధర్మమార్గాన్ని బోధించిన మహనీయులు అనుసరించిన సనాతన ధర్మ మార్గంలో అందరూ పయనించాలని రుషుల కాలం నుంచి భారతీయ ధర్మం బోధిస్తోంది.

డా. పురాణపండ వైజయంతి
ఫోన్ : 80085 51232