శతపావళి..అంటే భోజనం తరువాత వంద అడుగులు వేయడం. ఆయుర్వేదంలో శతపావళి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
శతపావళి అంటే…
శతపావళి అనే పదం మరాఠీ భాషకు చెందినది. శత అంటే వంద, పావళి అంటే అడుగులు. వంద అడుగులు వేయడం అని అర్థం. భోజనం తరువాత నడవడం అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు. మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే సంపూర్ణ పోషణ లభించదు. ఆరోగ్యంగా ఉండటానికి, ఆహారం బాగా జీర్ణం కావడం చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచడానికి అనేక పద్ధతులు సూచించారు. శతపావళి జీర్ణక్రియతో ముడిపడి ఉన్న ఒక ప్రక్రియ. దీని వల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
భోజనం తరువాత నడిస్తే లాభాలు..
తిన్న తర్వాత అపానవాయువు, మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే భోజనం చేశాక 100 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. భోజనం చేసిన వెంటనే జీర్ణ క్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన ఎంజైములు విడుదలవడం మొదలవుతుంది. భోజనం తిన్నాక నడవడం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటకు పోయేందుకు వీలు కల్పించినట్టు అవుతుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇలా భోజనం తిన్నాక నడవడం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
మెరుగైన నిద్ర..
రాత్రి భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేయడం వల్ల నిద్ర మత్తుగా పట్టే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని నిమిషాలు పాటు ఉత్త పాదాలతో నడవండి. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్ అదుపులో..
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక కచ్చితంగా 100 అడుగులు నడవాలి. ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ ను వినియోగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
బరువు తగ్గేందుకు..
రాత్రి భోజనం చేసిన తర్వాత పావుగంట పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావంతమైన మార్గాలలో భోజనం చేశాక వంద అడుగులు నడవడం అనేది ఒకటి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆయుర్వేదంలో శతపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి. ఒక నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి.