Ambedkar Jayanti 2025 : అంబేద్కర్ ఫిలాసఫీ ఎంత మందికి తెలుసు.. గాంధీ తత్వంపై ఆయన అభిప్రాయం ఏంటీ..?

Ambedkar Jayanti 2025 : అంబేద్కర్ ఫిలాసఫీ ఎంత మందికి తెలుసు.. గాంధీ తత్వంపై ఆయన అభిప్రాయం ఏంటీ..?

అంబేద్కర్ తన జీవిత కాలమంతా పీడిత వర్గాల మంచి కోసమే పోరాడాడు. ఆయన ఆలోచనల నుంచే కొన్ని ఫిలాసఫీలు పుట్టుకొచ్చాయి. దళితుల హక్కుల కోసం పోరాడే అంబేద్కరిజం అనే సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నామంటే అదే. ముఖ్యంగా మూడు విధాలుగా అంబేద్కర్ ఫిలాసఫీని చూడొచ్చు. సామాజిక, విద్య, రాజకీయపరమైన విషయాల్లో ఆయన ఫిలాసఫీ గురించి చెప్పుకోవాలి. 

>>> కుల వివక్ష లేని సమాజాన్ని అంబేద్కర్ కోరుకున్నాడు. సమాజం కులాలుగా విడిపోయిన తర్వాత ఒక వ్యక్తిని సమాజానికి కలిపే అవకాశాన్ని ఆ కులం దూరం చేస్తుందని చెబుతాడు. అంటరానితనం, వివక్ష.. వీటన్నింటికీ దూరంగా సమాజం ముందుకెళ్లిన రోజు కోసం కృషి చేయాలన్నాడు అంబేద్కర్. 

 >>> సమాజంలో మనం కోరుకునే ఏ మంచి మార్పుకైనా చదువు అన్నది బాగా ఉపయోగపడుతుంది. అంటాడు అంబేద్కర్. ఆ చదువు వ్యక్తిని మంచి వైపు అడుగు వేయించేదిగా, గొప్ప ఆలోచనలున్న వ్యక్తిగా ఎదిగేలా తోడ్పడాలంటాడు. పెద్ద కులాల వాళ్లు వీధి వెంట నడుస్తుంటే, దళితులకు అటువైపు వెళ్లడానికి కూడా అనుమతి లేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోంచి వచ్చి అంబేద్కర్ చదువు వల్లనే అంతస్థాయికి చేరుకున్నాడన్నది సత్యం. ఆ చదువు కులంతో సంబంధం లేకుండా అందరికీ అందాలని కోరుకున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్లను చదువుకు దూరం చేసిన పరిస్థితులను కూడా విమర్శించాడు అంబేద్కర్. ఆడవాళ్లు బాగా చదువుకోవాలని గట్టిగా కోరుకున్నాడు. 

>>> అంబేద్కర్ రాజకీయ ఆలోచనల్లో సమాజంలో రావాల్సిన సమానత్వం ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి పౌరుడికీ హక్కులు అందేలా చూడాలంటాడు. స్వేచ్ఛ, సమానత్వం అందరికీ సమానంగా అందినప్పుడే మన ప్రజాస్వామ్యం సరిగ్గా నడుస్తున్నట్టు అని చెప్తాడు అంబేద్కర్

గాంధీ తత్వమే లేదు ! 

మహాత్మా గాంధీ ఆలోచనలను అంబేద్కర్ ఎప్పుడూ విమర్శిస్తూనే వచ్చాడు. ముఖ్యంగా గాంధీ తత్వమనే ఆలోచనే లేదని ఆయన అన్నాడు. "గాంధీ నిరాడంబరంగా బతుకుతాడని దాన్ని 'గాంధీ తత్వం' అనుకోవద్దు. అంటరానితనం అనే కుల వివక్ష నుంచి విముక్తి కలిగించే సిద్దాంతం గాంధీ తత్వమని ఎవరో అన్నారు. కానీ గాంధీ తత్వం వల్ల ఇది అయ్యే పనా? గాంధీ ఆలోచనల్లో పెద్ద కులాల మీద గౌరవం కనిపిస్తూనే ఉంటుంది. అంటరాని వారిని తాకిన తర్వాత స్నానం చేస్తున్న హిందువులను, ఆ పని చెయ్యొద్దని గాంధీ ఎన్నడూ చెప్పలేదు” అంటూ అంబేద్కర్ గాంధీ తత్వాన్ని విమర్శించాడు.

►ALSO READ | రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళి