ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆశించిన పదవులు దక్కక అసంతృప్తికి గురైన కొందరు వ్యక్తులు అధికార వ్యామోహంతో, దురాశతో, తక్షణ రాజకీయ పునరావాసం కోసం ఆ ప్రాంతంలో ఏర్పడిన అసమగ్ర అభివృద్ధి, సాచివేత ధోరణులను, అసంతృప్త భావనలను అరువుగా తెచ్చుకొని చర్చా పటిమలతో తెరపైకి వచ్చారు. అప్పటిదాకా ఆయా ప్రాంతాలకు జరిగిన ఆర్థిక, సామాజిక, రాజకీయ, భాష సంస్కృతి రంగాల్లో అన్యాయాలపైన, గొంతు ఎత్తిన మేధావులు, కవులు, రచయితలు తమ తమ కళారూపాల్లో భావజాలాన్ని, ప్రజ బాహుళ్యాల్లోకి తీసుకుపోయారు. సామాన్య ప్రజలను సైతం ఆలోచింపజేశారు. ఆ భావజాలం ఆసరాతో ప్రాంతీయ పార్టీ నాయకులుగా ఎదిగారు. మేధావి లోకం అలా చీమల్లా కూడబెట్టిన సహేతుక భావజాల పుట్టలోకి విషనాగుల్లా రాజకీయ నాయకులు చొరపడ్డారు.
తాము లేకుంటే ‘నేను పుట్టకుంటే పెళ్లామా ఎవరిని చేసుకుంటవన్నట్టు’ ఉద్యమమే లేదన్నట్టు ప్రజాస్వామ్య విధానంలో తమను తాము ఎక్స్పోజ్ చేసుకున్నారు. హంగు ఆర్భాటాలతో భారీ సభల రూపంలో తీసుకువచ్చి ప్రాంతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకొనడానికి జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీపడ్డాయి. అనేక జిత్తులు, ఎత్తులు వేసి తిమ్మిని బమ్మిని చేసి, పునాదిలేని నాయకులు ప్రాంతీయ పార్టీల పేరున అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 70 ఏండ్ల భారత రాజకీయాల్లో నియంతృత్వ, కుటుంబ పాలన, ఏకచ్ఛత్రాధిపత్యం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అన్యాయాలు ప్రాంతీయ పార్టీల్లోనే ఎక్కువగా కనిపించాయి.
జాతీయ పార్టీగా బీజేపీ ఎదిగిన క్రమం..
మండల కమిషన్ నివేదిక తర్వాత 1990 దశకంలో ఎల్కే అద్వానీ రథయాత్ర అనంతరం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో బలమైన శక్తిగా అవతరించింది. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, ఏబీవీపీ, బీఎంఎస్ తదితర అనుబంధ సంఘాల నిర్మాణం ఎప్పుడూ లేనంత ముమ్మరంగా జరిగింది. దేశంలో సరస్వతి శిశు మందిరాల పేరున పాఠశాలలు నెలకొల్పారు. తద్వారా తమ హిందూ భావజాల వ్యాప్తికి పునాదులు పడ్డాయి. తద్వారా ఎదిగి వచ్చిన ఒక తరం నేడు బీజేపీలో ముఖ్య నాయకులుగా కొనసాగుతున్నారు. 2014 తర్వాత సునాయాసంగా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయగలిగారు. సరే వీరి భావనలు హిందూ రాజ్య స్థాపన కావచ్చును గాక.. కానీ, ఒక సుదీర్ఘ జీవిత కాలం పాటు ఓపికగా అదను కోసం ఎదురు చూస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. నేడు దృఢమైన విశాలమైన, ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ శక్తిగా ఎదిగింది .
ద్రవిడ పార్టీల రూటే వేరు
దేశ స్వాతంత్ర్య ప్రారంభ రోజుల్లో ఒక్క తమిళనాడులో ప్రాంతీయ భావనలు పునాదిగా భాష, ఆత్మగౌరవం ఎజెండాగా అన్నాదురై నేతృత్వంలో ‘ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం’ ప్రాంతీయ పార్టీగా ఏర్పడినది. తిరిగి అందులోంచి అనేక విభేదాల కారణంగా ఏఐడీఎంకే బ్రాహ్మణ, డీఎంకే బ్రాహ్మణేతర ప్రాతినిధ్య రాజకీయ పార్టీలుగా చీలిపోయాయి. అయినప్పటికీ ఈ రెండు రాజకీయ పార్టీలు తమిళనాడులో నిరంతరంగా తమ ఆత్మ గౌరవ రాజకీయ నేపథ్యం నుంచి బలమైన పునాదితో రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.
ఆత్మగౌరవం పేర అవకాశవాదం
ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో అధికార కాంక్షతో అంతవరకు ఉన్న జాతీయ పార్టీల నుంచి వేరుపడి ప్రాంతీయ పార్టీలను నెలకొల్పినవారున్నారు. వీరికి ప్రాంతం, ఆత్మగౌరవం శూన్య స్థాయిలో ఉంటుంది. కొండొకచో వీరి ఆత్మగౌరవమే ప్రాంతీయ గౌరవమనే భ్రమల్లో ప్రజలను ఉంచుతారు. అవకాశం రాగానే నియంతలుగా ఎదిగి నానా యాగి చేసి కనుమరుగు అయ్యే స్థాయికి వెళ్ళిపోతారు.
జాతీయ ప్రత్యామ్నాయాలు అవసరం
కాంగ్రెస్ లౌకిక రాజ్యం రాజకీయ ఎజెండాగా నడుస్తున్నది. జాతీయవాదం ఎజెండాతో బీజేపీ నడుస్తున్నది. ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానంలో ప్రతి పక్షమూ ఉండవలసిందే, పాలకపక్షమూ ఉండవలసిందే. ఇవి బండికి రెండు చక్రాలుగా పని చేస్తేనే ప్రజాస్వామ్య రథం గమ్యం వైపు కదులుతుంది.
ఓడినా అహంకారం పోలేదు
ఆయా ప్రాంతీయ పార్టీల నాయకులు ఆయా రాష్ట్రాల ప్రజలను ఘోరంగా వంచించడమే కాకుండా, తమ అవినీతి దుర్బుద్ధితో రాష్ట్రాలను ఆర్థికంగా దివాలా అంచులకు తీసుకుపోయిన ఘటనలు కూడా తాజాగా మనకు కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన నాయకులకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోవడం, మళ్లీ అదే అహంభావంతో, అహంకారంతో ప్రజల పట్ల తాము అనుసరించిన విధానాల పట్ల కొంచెం కూడా పునర్ విచారం వ్యక్తపరచకపోవడం దురదృష్టకరం. ఆయా ప్రాంతాల ప్రజలు నమ్మితే అమ్మినంత పనిచేసిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. దీన్ని పౌర సమాజం కఠినాతి కఠినంగా ఖండించవలసిన అవసరం కూడా ఉన్నది. అప్పుడే దేశం, రాష్ట్రం, ప్రాంతం, వివిధ భాషలు, కూడికలతో ఒక సమగ్రమైన బహుళ సమీకృత రూపం తీసుకుంటుంది.
తెలంగాణాయే ఉదాహరణ
ప్రాంతీయ పార్టీలు అక్కర ఫూర్తిగా వచ్చినయే తప్ప తమిళనాడు తరహా ప్రాంతీయ దృక్పథం లేకపోవడం, తమ హ్రస్వ దృష్టికి కనబడలేకపోవడం వల్ల స్వల్ప కాలంలోనే ఆయా ప్రాంతీయ పార్టీల స్థానంలో జాతీయ పార్టీలు తిరుగులేని విధంగా అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. దీనికి మంచి ఉదాహరణ తెలంగాణనే. రాష్ట్రం పేరున టీఆర్ఎస్గా ఏర్పడిన రాజకీయ పార్టీ దాని నాయకత్వం అనేక రాజకీయ ప్రయోజనాల పరిణామాల వలన బీఆర్ఎస్గా మారింది. అనేక అవకతవకల వలన తొమ్మిదిన్నర ఏండ్లకే కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తన సొంత కుటుంబ ఎజెండా వలన కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడానికి సిద్ధంగా ఉండి.. ప్రస్తుతం ఉత్తరాయణం కోసం అంపశయ్యపై పరుండి ఎదురు చూస్తున్నది.
- జూకంటి జగన్నాథం, కవి,రచయిత