వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏంటి..ఎన్నిరకాలు?

వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏంటి..ఎన్నిరకాలు?

భారత వ్యవసాయం చాలా కాలం జీవనాధార వ్యవసాయంగానే ఉన్నది. రైతు తాను చేసిన ఉత్పత్తిలో కొంత భాగాన్ని తన అవసరాల నిమిత్తం అమ్ముకుంటాడు. దీనిని గ్రామాల్లో ఉన్న వర్తకులకు, వడ్డీ వ్యాపారులకు మార్కెట్​లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే విక్రయిస్తారు. మార్కెట్​లోకి తీసుకెళ్లినా మధ్యవర్తుల వల్ల సరైన ధర పొందలేకపోతున్నారు. తన ఉత్పత్తులను మార్కెట్ కు చేరవేయడానికి, సరైన ధరకు అమ్ముకోవడానికి వ్యవసాయదారుడికి అవసరమయ్యే సౌకర్యాల కల్పనే వ్యవసాయ మార్కెటింగ్. వ్యవసాయ మర్కెటింగ్ ఆవశ్యకత ఏమిటంటే ఆహార పదార్థాలు దేశం అంతటా పంపిణీ చేయాలి కాబట్టి మార్కెటింగ్ సౌకర్యాలు అవసరం. పరిశ్రమలకు ముడిపదార్థాలు సమకూర్చుకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలు అవసరం. గిట్టుబాటు ధర లభించినప్పుడే రైతు ఉత్పత్తిని కొనసాగిస్తాడు. కాబట్టి మార్కెటింగ్ సౌకర్యాలు అవసరం. దీనికోసం గిడ్డంగులు, రవాణా, గ్రేడింగ్, సమాచారం మొదలైన సౌకర్యాలు అవసరం అవుతాయి. 

మార్కెటింగ్ రకాలు

ప్రాథమిక మార్కెట్లు: వారంలో ఒక నిర్ణీత రోజున వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను గ్రామ సంతలో విక్రయిస్తారు. విక్రయం కాగల మిగులులో 50 శాతం ఇక్కడే విక్రయం అవుతుంది. వీటిని దక్షిణాది రాష్ట్రాల్లో షాండీలు అని ఉత్తరాదిన హాట్, బజార్ లని అంటారు. 

ద్వితీయ మార్కెట్లు: వీటిని టోకు లేదా అసెంబ్లింగ్ మార్కెట్లు అంటారు. ఈ రూపంలో మండీలు ఉంటాయి. గ్రామాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ ఏడాది పొడవునా ఈ మార్కెట్​లో వ్యాపారం జరుగుతుంది. ఉత్పత్తి నిల్వ, బ్యాంకింగ్ వసతులు కూడా ఇక్కడ ఉంటాయి. 

అంతిమ మార్కెట్లు: పెద్ద పట్టణాలు, నగరాల్లో ఇవి ఉంటాయి. వీటి పరిధి ఒక రాష్ట్రం అంతకంటే ఎక్కువ ప్రాంతానికి విస్తరించవచ్చు. అంతిమంగా వినియోగదారునికి వస్తువులు చేర్చడం, వ్యవసాయ ముడిపదార్థాల ప్రాసెసింగ్ యూనిట్లకు చేర్చడం ఇందులో భాగమే. 

సంతలు: ప్రముఖ యాత్రా స్థలాలు, పండుగ రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకానికి సంతలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పశువులు విక్రయం కూడా జరుగుతుంది. 
క్రమబద్ధమైన మార్కెట్లు: మార్కెటింగ్​లో అక్రమ పద్ధతులు, మోసాలు జరగకుండా రైతులకు సరైన ధర లభింపజేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఏర్పాటు చేస్తాయి. 

సహకార మార్కెటింగ్: సహకార సూత్రాల ప్రాతిపదికన రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలకు ఇదిఉత్తమమైన పరిష్కారం. 

విక్రయం కాగల మిగులు: రైతు పండించిన పంటలో స్వయం వినియోగానికీ, విత్తనాలకూ పోగా మార్కెట్ లో అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తిని విక్రయం కాగల మిగులు అంటారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయం కాగల మిగులు తక్కువగా ఉంటుంది.

మార్కెటింగ్ దశలు

అసెంబ్లింగ్: వేర్వేరు స్థలాల్లో రైతు పండించిన పంటను ఒక చోటుకు చేర్చడం.
గ్రేడింగ్: పంట నాణ్యతను బట్టి వేరు చేయడం.
ప్రామాణీకరణ: వేరు చేసిన ఉత్పత్తిని వరుస క్రమంలో అమర్చడం.
ప్రాసెసింగ్: వ్యవసాయ ఉత్పత్తులను వినియోగానికి అనుగుణంగా మార్చడం.
ప్యాకింగ్: ప్రాసెసింగ్ చేసిన పంటను కొంతకాలం నిల్వ ఉంచడానికి ప్యాకింగ్ చేస్తారు. 
పంపిణీ: ప్రాసెసింగ్ చేసిన పంటను టోకు, చిల్లర వ్యాపారులకు చేర్చడం.