ఏటా స్విట్జర్లాండ్ లోని దావోస్ పట్టణానికి వేలాది మంది రాజకీయ నాయకులు, దేశాధినేతలు, బడా పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారస్తులు వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారు? ఈ జాతర దేని కోసం? వీళ్లు అక్కడ ఏం చర్చిస్తారు? మన దేశం నుంచి కూడా వందలాది మంది ప్రముఖులు వెళ్తుంటారు. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్, ఆయన బృందం, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అక్కడకు వెళ్లారు. 2018లో భారత ప్రధాన మంత్రితోపాటు100 మంది సభ్యుల ప్రతినిధి వర్గం ఆ సమావేశాల్లో పాల్గొన్నది. మహారాష్ట్ర సహా కనీసం ఐదు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఈ సదస్సులో ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది దావోస్ కు వెళ్లి పెట్టుబడులను తీసుకువస్తానని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. ఇట్లాంటి ప్రకటనలు ఏండ్లుగా ఈ సమావేశాలకు వెళ్తున్న తెలంగాణ, ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేస్తూ, ఇక్కడ ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. ఈ ప్రకటనల ద్వారా అక్కడ జరిగే తంతుపైన, చర్చల పైన, వ్యూహాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం దిగ్విజయంగా కొనసాగుతున్నది.
ఈసారి 217 సెషన్లు..
చైనా నుంచి ఉక్రెయిన్ వరకు పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలను 2023 శిఖరాగ్ర సదస్సు ‘విచ్ఛిన్నమైన ప్రపంచంలో సహకారం’ పేరుతో నిర్వహిస్తున్నారు. దాదాపు 500 సమావేశాల ద్వారా ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం నుంచి గ్రీన్ టెక్నాలజీ గురించి, ఇటీవలి వాతావరణ పరిణామాల వరకు చర్చలు జరుగుతాయి. జనవరి16 నుంచి20 వరకు జరిగే దావోస్ శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచంలోని అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. పెట్టుబడిదారులు, వ్యాపార, రాజకీయ నాయకులు, ఆర్థిక వేత్తలు, ప్రముఖులు, పాత్రికేయులతో సహా సుమారు 3,000 మంది పెయిడ్, ఆహ్వానిత అతిథులు ఐదు రోజుల పాటు 500 సెషన్లలో సమావేశమై ప్రపంచ సమస్యలపై చర్చిస్తారు. 2018లో జరిగిన సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 2016 నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతి సమావేశానికి వెళ్తున్నారు. 2018లో భారత ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. అక్కడి భవనాలు, బస్సులపై, భారీ హోర్డింగ్ లతో ప్రకటనలు గుప్పించారు. భారతీయ వంటకాలు లాంజ్ లలో ఏర్పాట్లు చేశారు. దావోస్ సమావేశంలో భారత్ ఉనికి పెరుగుతోంది. 53వ వార్షిక సమావేశంలో అక్కడి ఇండియా లాంజ్ తో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేతల బృందానికి ప్రాధాన్యం ఏర్పడింది. 2023 వరల్డ్ఎకనామిక్ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశం భాగస్వాముల చర్చలు 217 సెషన్లలో జరుగుతాయి. హబ్ పేరుతో 39 అనధికారిక సమావేశాలు,14 డిన్నర్ సెషన్లు కూడా ఉంటాయి. సాధారణంగా ప్రధాన కాంగ్రెస్ కేంద్రంలో జరిగే16 ప్లీనరీ సమావేశాల్లో ప్రభుత్వాధినేతలు, రాష్ట్రాధినేతలు ప్రసంగిస్తారు. దాంతో పాటు11 ఇష్యూ బ్రీఫింగ్ సెషన్స్,10 ఓపెన్ ఫోరమ్ సెషన్లు, అనేక ‘ఆవిష్కరణ’ సెషన్లు, వర్క్ షాప్ లు, రౌండ్ టేబుల్స్, కనెక్ట్, ఎక్స్ఛేంజ్ ఇతర సెషన్ లు, పరిమిత సభ్యులతో కూడిన రహస్య సమావేశాలు కూడా ఉంటాయి.
డబ్ల్యూఈఎఫ్ కార్యక్రమాలను ఆపాల్సిందే..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో అగ్రికల్చర్ డేటా ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రయత్నం చేస్తున్నది. అగ్రిమెట్రిక్స్, డావెక్స్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలకు అనుగుణంగా ప్రైవేటు పరిశ్రమలు తమ డేటాను ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో పంచుకోవడానికి, వినియోగించుకోవడానికి వీలు కల్పించే వ్యవస్థ ఇది. దీని ద్వారా డిజిటలైజ్డ్ భూ రికార్డులు, పంట కోత ప్రయోగాలు, ఉపగ్రహ చిత్రాలు, ఎరువుల వినియోగం, పంట చరిత్ర వంటి వివరాలతో కూడిన డిజిటల్ ఫైనాన్సింగ్, బీమా సేవలు అందుబాటులోకి వస్తాయి. 2025 నాటికి 40 నుంచి -60 శాతం వ్యవసాయ ఉత్పత్తులను డిజిటల్ మార్కెట్ల ద్వారా విక్రయించే అవకాశం ఉందని, ఇది వ్యర్థాలను తగ్గిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధరను10 శాతం పెంచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. డబ్ల్యూఈఎఫ్1.5 డిగ్రీల సెల్సియస్ 2015 పారిస్ ఒప్పందంలో ఉన్న వాతావరణ లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ, దావోస్ సమావేశాల్లో పాల్గొనేవారు మాత్రం ఒక్కొక్కరు తమ సొంత ప్రైవేటు విమానాల్లో అక్కడికి చేరుకుంటారు. సాధారణ ప్రయాణికుల విమానాల్లో ప్రయాణం చేయరు. దాదాపు500 ప్రైవేట్ విమానాల్లో లాబీయిస్టులు, కార్పొరేట్ బాస్ లు, రాజకీయ నాయకులు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023కు ప్రయాణిస్తారని గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్ పరిశోధన ద్వారా తెలుస్తున్నది. స్వయంగా తమ జీవనశైలి తో భూ తాపాన్ని పెంచే కర్బన ఉద్గారాల విడుదలకు, వాతావరణ కాలుష్యానికి దాదాపు 50 నుంచి -60 శాతం కారణ భూతమవుతున్న వ్యాపారాలు చేస్తూ, టెక్నాలజీ వాడుతూ డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పర్యావరణం కోసం పాటుపడుతున్నట్లు నాటకాలాడుతూ, కూలుతున్న తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న డబ్ల్యూఈఎఫ్ సభ్యులను, వారి కార్యక్రమాలను నిలువరించే ప్రయత్నం మనమందరం చేయాలి.
టెక్నాలజీ పేరుతో మైండ్ గేమ్..
వచ్చే దశాబ్ద కాలంలో వ్యూహాత్మకంగా వ్యవసాయం, విద్య, ఇంధనం రంగాల్లో టెక్నాలజీ అత్యంత ముఖ్యమైనదని12,000 మంది గ్లోబల్ ఎగ్జిక్యూటివ్స్ సర్వేలో వెల్లడైనట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. వచ్చే పదేళ్లలో అగ్రిటెక్, ఎడ్టెక్, ఎనర్జీ సంబంధిత టెక్నాలజీలను120కి పైగా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వ్యూహాత్మక వ్యాపారాలు అని డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. టెక్నాలజీ పేరుతో అధికారం స్థిరత్వం చేసుకోవడం, ఆధిపత్యం కొనసాగించడం అలనాటి బ్రిటీష్ వలస పాలన నుంచి చూస్తూనే ఉన్నాం. అత్యంత ఆధునిక డిజిటల్ టెక్నాలజీ అవసరం ఉందని మైండ్ గేమ్ ఆడుతూ, బలహీనపడిన పెట్టుబడిదారీ వ్యవస్థను సరికొత్త రూపంలో అన్ని దేశాల్లో వేళ్లూనుకునే కృషి ఈ ప్రైవేట్ సంస్థ చేస్తున్నది. క్లాస్ స్వాబ్ ఉచ్చులో స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. ఉదారవాదానికి, వారు ప్రోత్సహించే టెక్నాలజీ వాదనలకు దన్నుగా అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. వాటికి నిధులు కూడా దండిగా వస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా, లేదా భిన్నంగా పని చేసే స్వచ్ఛంద సంస్థల మీద జాతీయ ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి పెంచి మూసివేయిస్తున్నారు. డబ్ల్యూఈఎఫ్ ‘‘ప్రభుత్వ-– ప్రైవేట్ సహకారం ద్వారా ప్రపంచ స్థితిని మెరుగుపరచడానికి’ కట్టుబడి ఉందని పేర్కొంది. తన వ్యూహాలు అమలు చేయడానికి, దృక్పథం విస్తృతం చేయడానికి దావోస్ లో వార్షిక ఫోరమ్ సమావేశంతో పాటు, డబ్ల్యూఈఎఫ్ ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇంకా ఇతర చోట్ల అనేకసార్లు ప్రాంతీయ, కొన్నిసార్లు జాతీయ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నది.
దేశీయ విధానాలపై ప్రభావం
డబ్ల్యూఈఎఫ్ ప్రకటనలు, నివేదికలు, చర్చల సరళి, ఫోరం అధినేత క్లాస్ స్వాబ్ ఇంటర్వ్యూలు అన్నీ ఈ వేదిక కపటత్వాన్ని, డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఇది సామాన్య ప్రజల ఆకాంక్షలకు, ప్రజాస్వామ్య ధోరణులకు వ్యతిరేకంగా కొందరు కుబేరులు ఏర్పాటు చేసుకున్న సంస్థ. అయినా మన దేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారులు అక్కడకు ఎందుకు వెళుతున్నారు? ఏమి ఆశించి వెళుతున్నారు? వీరి పర్యటనలకు ప్రజా ధనం ఖర్చు అవుతున్న నేపధ్యంలో వీరు అక్కడ చేస్తున్న పనులు, మాట్లాడుతున్న విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వారి మీద, మీడియా సంస్థల మీద ఉంది. తెలంగాణ మంత్రి వెళ్తే కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందని ప్రకటనలు చూశాం. అవి వాస్తవ రూపం దాల్చిన దాఖలాలు లేవు. అయినా పెట్టుబడిదారుల దగ్గరకు పోయి అడుక్కోవాల్సిన ఖర్మ మన దేశ నేతలకు ఎందుకు పట్టింది? ప్రపంచ కుబేరులు తమ వ్యాపార లక్ష్యాలు చేరుకోవడానికి వాడుకుంటున్నారని వీళ్లకు ఎందుకు అర్థం కావడం లేదు? ఏ పెట్టుబడిదారుడైనా షరతులు విధించి వస్తాడు. ఆ షరతులు మన దేశీయ విధానాల మీద ప్రభావం చూపుతాయి. ప్రజలే సార్వభౌములు అని నిర్వచిస్తున్న భారత రాజ్యాంగం పరిధిలో ఏర్పాటు ప్రాతినిధ్య వేదికలకు ఎన్నికైన రాజకీయ నాయకులు, అదే సార్వభౌమత్వాన్ని దావోస్లో తాకట్టు పెడితే ప్రశ్నించే తత్వం మన దగ్గర కొరవడటం అత్యంత దురదృష్టకరం.
- దొంతి నర్సింహా రెడ్డి,
పాలసీ ఎనలిస్ట్