- వార్నింగ్ ఎవరికి?
- మొన్నటిదాకా కేటీఆర్ సమక్షంలోనే లీడర్ల ‘సీఎం’ డిమాండ్
- వేదికలపైనే గ్రీటింగ్‌లు.. కేటీఆర్ ముసిముసి నవ్వులు
హైదరాబాద్, వెలుగు: సీఎం మార్పుపై కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడం ఎవరిని ఉద్దేశించి అయి ఉండొచ్చని టీఆర్ఎస్ లీడర్లు చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసబెట్టి.. కేటీఆర్ ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు వాటిని ఎవరూ ఖండించలేదు. దీంతో ప్రగతిభవన్ వర్గాల సూచనల మేరకే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని భావించి మిగతా లీడర్లు కూడా పోటీలు పడి కేటీఆర్‌కు గ్రీటింగ్స్ చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే ‘‘ఫ్యూచర్ సీఎం కేటీఆర్ కంగ్రాట్స్’’ అంటూ అభినందనలు తెలిపారు. ఇలా చాలా మంది లీడర్లు కేటీఆర్ సీఎం కావాలని పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు సీరియస్ అయ్యారని టీఆర్ఎస్ లీడర్లు ఆరా తీస్తున్నారు.
అప్పుడు కేటీఆర్ చిరునవ్వులు, మౌనం
తనను సీఎం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తుంటే కేటీఆర్ ఎప్పుడూ వారి మాటలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గత నెల 21న సికింద్రాబాద్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్.. ‘‘పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బహుశా కాబోయే సీఎం.. కేటీఆర్ కు శుభాకాంక్షలు’’ అని అన్నారు. అదే వేదికపై ఉన్న కేటీఆర్ పద్మారావును చూస్తూ చిరునవ్వులు నవ్వారు. అంతకు 2 రోజులముందు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఫేస్ బుక్ లో ‘కేటీఆర్‌కు కంగ్రాట్స్’ అని మెసేజ్ పెట్టినా ఏమీ అనలేదు. తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు అభినందనలు తెలుపుతుంటే కేటీఆర్ చిరునవ్వు నవ్వారు. గత వారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ ప్రోగ్రామ్ లో ‘‘కాబోయే సీఎం కేటీఆర్’’ అంటూ లీడర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేసినప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలప్పటి నుంచి..!
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ‘కేటీఆర్ సీఎం’ డిమాండ్ జోరందుకుంది. ముందుమినిస్టర్లు స్టార్ట్ చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు అందుకున్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని మాట్లాడకపోతే ఎక్కడ వెనుకపడి పోతామోననే ఆందోళనతో లీడర్లు పోటీలు పడి ప్రకటనలు చేశారు. ఇదంతా జరుగుతున్నా ప్రగతిభవన్ వర్గాలు వారించలేదు.
ఒకరెనుక ఒకరు
నెల కింద మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘సీఎం మార్పు ఉంటే ఉండొచ్చు’’ అని చెప్పారు. అటు తర్వాత ‘‘సీఎంగా కేటీఆర్ అయితే తప్పేంటి? ఇప్పుడైతే సీఎం కేసీఆర్ అంతా బాగానే చేస్తున్నరు. ఏ విషయమైనా సరైన టైంలో కేసీఆరే నిర్ణయం తీసుకుంటరు’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘‘కేటీఆర్ సీఎం పదవికి సమర్థుడు.ఆయన్ను సీఎంగా అందరూ అంగీకరిస్తరు’’ అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ కనుసన్నల్లోనే కేటీఆర్ సీఎంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నరు. కేసీఆర్ ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నం’’ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. సీఎం అయ్యేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ ముఖ్యమంత్రిగా జరగాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. రెండు రోజుల కింద ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య.. కేటీఆర్ సీఎం కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్టు తిరుమలలో అన్నారు. గతంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
డిమాండ్ వికటించిందనే టాక్
కేటీఆర్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేయడం వికటించిందనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. ‘‘కేసీఆర్ అసమర్థుడా? కొడుకునే ఎందుకు సీఎం చేయాలి? దళిత నేతనైనా, బీసీ నేతనైనా సీఎం చేయాలి’’అని అపోజిషన్ పార్టీలు డిమాండ్ చేయడంతో కేసీఆర్‌కు కోపం వచ్చిందని పార్టీలో జరుగుతోంది.
హరీశ్‌తో విడిగా సమావేశం
టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ విడిగా సమావేశమయ్యారు. హరీశ్‌ను ఆయన తన చాంబర్ కు పిలిచి విడిగా భేటీ అయ్యారు. ఇద్దరు దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.