లోక్ సభలో ప్రవేశపెట్టిన సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మనదేశంలోని కొన్ని సరిహద్దు రాష్ట్రాలకు చెందిన సమస్య ప్రస్తుతం దేశవ్యాప్త సమస్యగా మారింది. దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిచేసుకోవడానికే బిల్లు తీసుకువచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే ముస్లింల పట్ల వివక్షకు బిల్లు అద్దం పడుతోందని ప్రతిపక్షాలు రగడ చేస్తున్నాయి.
మనదేశ జనాభా 130 కోట్ల పై చిలుకు. అయితే వీరిలో ‘‘ఎవరు పౌరుడు ? ఎవరు కాదు ?’’ అనే కీలకమైన విషయాన్ని నిగ్గు తేల్చడానికి ఉద్దేశించిందే ‘సిటిజన్ షిప్ (అమెండ్ మెంట్ ) బిల్లు. ‘సిటిజన్ షిప్ యాక్ట్ 1955’కు 2016లో చేసిన సవరణకు పార్లమెంటు ఆమోదం సంపాదించడమే బిల్లు అసలు ఉద్దేశం.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని 5 నుంచి 11వ వరకు గల ఆర్టికల్స్ లో సిటిజన్ షిప్ ప్రస్తావన ఉంది. 1948 జులై 19 లోగా ఎవరైనా పాకిస్తాన్ నుంచి మనదేశానికి వలస వస్తే వారిని పౌరులుగా భావించవచ్చని ఆర్టికల్ 6 స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ తొమ్మిది ప్రకారం మనదేశం డ్యూయల్ సిటిజన్ షిప్ ను అంగీకరించదు. మరో దేశం పౌరసత్వం ఉన్నట్లు తేలితే మన దేశ పౌరసత్వం రద్దవుతుంది.
బిల్లు కాంట్రవర్శీ ఏంటి?
నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించిన సిటిజన్ షిప్ (సవరణ) బిల్లు వివాదాలకు కేంద్రంగా మారింది. ముస్లింలు కానివారికి వ్యతిరేకంగా బిల్లు రూపొందించారన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్… ఈ మూడు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు చెందిన వారు…హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లు మనదేశంలో ఆరేళ్ల పాటు స్థిర నివాసం ఉంటే వారికి పౌరసత్వం ఇచ్చేలా బిల్లులో సవరణలు చేశారు. వీరికి పౌరసత్వం రావాలంటే 11 ఏళ్ల పాటు ఉండాలన్న రూలు గతంలో ఉండేది. దీనిని ఆరేళ్లకు కుదించారు. అయితే ఈ సడలింపులు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు వర్తించవు. బిల్లులోని ఈ అంశమే వివాదమైంది. కేవలం 6 మతాలకు చెందిన వారిని మాత్రమే బిల్లులో చేర్చడం కరెక్ట్ కాదన్నది ప్రతిపక్షాల వాదన. మూడు దేశాల్లో వేధింపులకు గురై ఇండియాకు వలసవచ్చిన ముస్లింలకు కూడా బిల్లును వర్తింపచేయాలన్నది ప్రతిపక్షాల డిమాండ్.
ప్రభుత్వ వాదన
సిటిజన్‌షిప్ (సవరణ) బిల్లుపై కేంద్రం ఖచ్చితమైన వైఖరితో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ దేశాల నుంచి తరిమివేతకు గురై మనదేశానికి వచ్చిన అక్కడి మైనారిటీలను (ముస్లింలు కానివారు మాత్రమే)అక్కున చేర్చుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమంటున్నారు అధికారంలో ఉన్న పెద్దలు. ఈ మూడు దేశాల్లోనూ ఒకే మతస్తులు ఎక్కువ సంఖ్యలో ఉండి తక్కువ సంఖ్యలో ఉన్న మిగతా మతాల వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నది సర్కార్ ఆరోపణ. ఈ ముస్లిం దేశాల్లోని మైనారిటీవర్గాల వారు తరచూ దాడులకు కూడా గురయ్యారని ప్రభుత్వం పేర్కొంది. ఇలా ఈ మూడు దేశాల నుంచి గెంటివేతకు గురై మనదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం మానవత్వంతో కూడిన పని అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముస్లింలకు బిల్లు వ్యతిరేకమన్న ఆరోపణలను తిప్పి కొట్టింది. నూటికి నూరు శాతం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సిటిజన్‌షిప్ బిల్లు రూపొందించినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుంచి మనదేశంలోకి వలసవచ్చిన వాళ్లు వేలాది మంది ఉన్నారు. వీళ్లల్లో ఎక్కువ మంది ముస్లింలే. ఈ వలసలు నిన్నటివో, మొన్నటివో కావు. చాలా ఏళ్ల కిందటివి. వీళ్లంతా ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాల్లో తిష్ట వేసి ప్రస్తుతం పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా సరిహద్దుల్లో కంచెలు దాటి అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించిన వారిపై ఆయా రాష్ట్రాల ప్రజలకు సదభిప్రాయం లేదు. వాళ్లపై బోలెడన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ బ్యాక్ డ్రాప్‌లో మూడు పొరుగుదేశాల నుంచి బతుకుజీవుడా అంటూ వలసవచ్చిన ముస్లింలు కానివారిని దృష్టిలో పెట్టుకుని ‘సిటిజన్ షిప్ (సవరణ)బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈశాన్య రాష్ట్రాల వైఖరేంటి?
సిటిజన్‌షిప్ బిల్లుకు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యతిరేకత కనపడుతోంది. ఎందుకంటే, తమ రాష్ట్రాల్లో తాము మైనారిటీలుగా మారే అవకాశముందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వలసవచ్చిన వారు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం దీనికి కారణం. అయితే ఇవన్నీ అపోహలేనంటున్నారు బీజేపీ లీడర్లు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు, వాళ్ల కల్చర్ ను దెబ్బతీసే ఎలాంటి పనులు తాము చేయబోమని హామీ ఇచ్చారు. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అలాగే సిటిజన్ షిప్ బిల్లు 1985 నాటి అస్సాం ఒప్పందానికి బిల్లు వ్యతిరేకమన్న ప్రచారం జోరుగా జరిగింది. అస్సాం ఉద్యమకారులు, అప్పటి కేంద్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అక్రమ వలసలు ఏవో తేల్చడానికి 1971 మార్చి 25వ తేదీని కటాఫ్ డేట్ గా తీసుకున్నారు. ఆ తరువాత అస్సాంలోకి ఎవరు ప్రవేశించినా, వాళ్లు ఏ మతం వారైనా చొరబాటుదారులుగానే గుర్తిస్తారు. అయితే ఆరేళ్ల పాటు మనదేశంలో ఉంటే వలస వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇచ్చేలా సిటిజన్ షిప్ బిల్లును రూపొందించారన్నది అస్సాం ప్రజల వాదన.
2016 జూలైలోనే లోక్‌సభకు బిల్లు
సిటిజన్‌షిప్ (సవరణ) బిల్లును 2016 జులై 19నే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై స్టడీ చేయడానికి ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’(జేపీసీ) కి పంపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో అదే ఏడాది ఆగస్టు 12న బిల్లుపై జేపీసీ వేశారు. సవరణ బిల్లుపై స్టడీ చేసిన తరువాత 2019 జనవరి 7న జేపీసీ తన రిపోర్ట్ ను పార్లమెంటుకు అందచేసింది. ఆ మర్నాడే..జనవరి 8న బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం జరిగిపోయాయి. ఈ బ్యాక్ డ్రాప్‌లో రాజ్యసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి రెడీ అవుతుండగా ఇదే ఏడాది ఫిబ్రవరి 13న రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. పార్లమెంటరీ నియమాల ప్రకారం ఏదైనా బిల్లు లోక్ సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్ లో ఉంటే సమావేశాలు మళ్లీ ప్రారంభమైన తరువాత ప్రవేశపెట్టవచ్చు. అయితే 2019 ఎన్నికల షెడ్యూల్ రావడంతో 16వ లోక్ సభ రద్దయింది. దీంతో బిల్లును మళ్లీ లోక్ సభ ఆ తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిందేనని పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లును సోమవారం ఫ్రెష్ గా లోక్ సభలో ప్రవేశపెట్టింది.
తప్పులు దిద్దుకోవడానికే..
దేశ విభజన సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికే బిల్లును రూపొందించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.విభజన టైంలో మిగతా దేశాల్లో ఉండి మతం కారణంగా అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ భారతీయ మూలాలున్న వారికి ఆశ్రయం ఇవ్వడానికే బిల్లును రూపొందించినట్లు ఈ ఏడాది జనవరిలో అసోంలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని చెప్పారు. సిటిజన్ షిప్ బిల్లును ఆయన పూర్తిగా వెనకేసుకొచ్చారు.
సవరణకు అసలు కారణం ఇదీ!
దేశ విభజన తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని బెంగాలీ ముస్లింలుగానీ, ఈస్ట్ బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని హిందువులుగానీ అటు ఇటు మారిపోలేదు. ఎక్కడివాళ్లు అక్కడే ఉన్నారు. పాకిస్థాన్‌లోని హిందువులు, సిక్కులు మైనారిటీలు కాగా, ఇండియాలో ముస్లింలు మైనారిటీలు అయ్యారు..
1950లో ఇండియా ప్రధాని నెహ్రూ, పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
- మైనారిటీలకు సెక్యూరిటీ, హక్కులు, ఫ్రీడం.
- మైనారిటీలకు గవర్నమెంట్ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ప్రాధాన్యత.
- స్వదేశానికి తిరిగి రావటానికి ఇష్టపడనివాళ్లను సిటిజన్లుగా గుర్తించాలి.
ఈ ఒప్పందానికి ఇండియా సిన్సియర్‌గా కట్టుబడి ఉండగా పాకిస్థాన్ ఉల్లంఘించింది. ‘సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్లు–2019’పై చర్చల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో ముస్లింల జనాభా పెరుగుతున్నప్పటికీ, పాక్, బంగ్లాల్లో హిందువులు, సిక్కుల పాపులేషన్ తగ్గుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా, ఇండియన్ సిటిజెన్షిప్ యాక్ట్–1955లో అమల్లోకి రాగా, ఇప్పటివరకు 5 సార్లు సవరించారు.