- రూ.27 వేల కోట్లు ఏ లెక్కన ఖర్చయ్యాయని ప్రశ్నించిన సీడబ్ల్యూసీ
- పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టులో నీటిని ఎలా తెస్తారో జస్టిఫికేషన్ ఇవ్వలేదు
- వార్దా ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రలో ముంపు సమస్యకు పరిష్కారం చూపలే
- మూడు ప్రాజెక్టుల కంప్లయన్స్ రిపోర్ట్‌లు పెండింగ్‌లో పెట్టారని అభ్యంతరం
- డీపీఆర్‌లు తిరస్కరించి వెనక్కి పంపిన సెంట్రల్ వాటర్ కమిషన్
- ఇరిగేషన్ ఈఎన్‌సీకి లేఖ
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మూడో టీఎంసీకి పెడుతున్న అదనపు ఖర్చు లెక్కను ఇప్పటివరకు తేల్చలేదని, ఎన్నిసార్లు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఆక్షేపించింది. అదనపు టీఎంసీకి రూ.27 వేల కోట్లు ఏ లెక్కన ఖర్చవుతుందో చెప్పలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ సీడబ్ల్యూసీ వద్ద 2022 ఏప్రిల్ 6 నుంచి పెండింగ్‌లో ఉందని తెలిపింది. ప్రాజెక్ట్ కెపాసిటీని పెంచడం ద్వారా ఎంత మేర ఆయకట్టును పెంచుతున్నారో చెప్పలేదని, దీని వల్ల కలిగే అదనపు లబ్ధి గురించి వివరించలేదని పేర్కొంది.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు లేఖ రాసినా స్పందన రాలేదని మండిపడింది. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక వచ్చే దిగుబడి, వాటి ధరలకు సంబంధించి.. బెనిఫిట్ కాస్ట్ రేషియోను పెంచి చూపించారని, దానిపైనా జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారని ఆక్షేపించింది. దీనిపై ఈ ఏడాది జనవరి 12న లేఖ పంపినా స్పందన లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం థర్డ్ టీఎంసీతో పాటు పాలమూరు, రంగారెడ్డి, బీఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్‌ల డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను సీడబ్ల్యూసీ తిరస్కరించింది.
ఏడాదికాలంగా ఆయా ప్రాజెక్ట్‌ల కంప్లయన్స్ రిపోర్టులను సబ్‌మిట్ చేయకుండా కాలయాపనచేశారని, అందుకే ఆ మూడు డీపీఆర్‌లను తిప్పి పంపుతున్నామని, ఆ ప్రాజెక్టులను అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరిగేషన్ ఈఎన్‌సీకి గురువారం సీడబ్ల్యూసీ లేఖ రాసింది. ఆయా ప్రాజెక్టుల కంప్లయన్స్ రిపోర్టులను సమర్పించాల్సిందిగా గత నెల 22న కూడా లేఖ రాశామని, అయినా స్పందన లేదంది.
ఆ 45 టీఎంసీల వాటా సంగతేంది ?
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అప్రైజల్ సీడబ్ల్యూసీ వద్ద 2022 సెప్టెంబర్ 13 నుంచి పెండింగ్‌లో ఉందని లేఖలో పేర్కొంది. ‘మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసే 45.66 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వాడుకుంటామని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగాం. దానిపై ఈ ఏడాది ఏప్రిల్ 4న లేఖ రాశాం. కానీ ఇంతవరకూ వివరాలు ఇవ్వలేదు. గోదావరి నీటిని మళ్లించడం ద్వారా 45 టీఎంసీలను వాడుకుంటామని చెప్పారు. పోలవరం నుంచి డైవర్ట్ చేసే 80 టీఎంసీల్లో 45 టీఎంసీలను గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ కేటాయించింది.
Also Read :- ఏసీబీ దర్యాప్తుకు హైకోర్టు ఓకే
కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలూ విడిపోయాయి. ఆ 45 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలూ వాటా కోరుతున్నాయి. ఈ నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తుండడం వల్ల ప్రస్తుతం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ట్రిబ్యునల్ 2లో ఆ అంశం పెండింగ్‌లో ఉంది. దానిపై విచారణ నడుస్తున్నది, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సమ్మతం లేదు.. మరి ఆ నీటిని ఎలా వాడుకుంటారన్న దానిపై క్లారిటీ లేదు’ అని లేఖలో వెల్లడించింది.
మహారాష్ట్రలో ముంపు సమస్యకు పరిష్కారమేదీ ?
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్ట్‌కు సంబంధించిన కంప్లయన్స్ రిపోర్ట్‌కు సంబంధించి 2023 జులై 20, 2023 నవంబర్ 17, 2024 జులై 4న మూడుసార్లు లేఖ రాసినా పెండింగ్‌లోనే పెట్టారని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు అప్రైజల్ ఈ ఏడాది మే 17 నుంచి సీడబ్ల్యూసీ వద్ద రివిజన్‌లోనే ఉందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, డీపీఆర్రివ్యూ కోసం ఇంటర్‌స్టేట్ బోర్డుకు సమర్పించాల్సిందిగా చెప్పామని తెలిపింది. ‘మహారాష్ట్ర అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకోవాలని చెప్పాం, అయినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
ప్రాణహిత, ఎల్లంపల్లి, చేవెళ్ల ప్రాజెక్టులో హెడ్ వర్క్స్, టన్నెల్, ఇతర పనుల వివరాలు, వాటిని వార్ధా ప్రాజెక్టుకు ఎలా వినియోగించుకుంటారో ఇంతవరకు చెప్పలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎన్‌వోసీ తీసుకోలేదు. ముంపును తగ్గించడం లేదా నివారించేందుకు ఇరిగేషన్ ప్లాన్‌లో మార్పులకు సంబంధించి వివరాలు ఇవ్వలేదు’ అని పేర్కొంది.