సర్వ జీవులలో వారి ప్రకృతిగాను, ప్రకృతికి అతీతంగానూ ఉన్నాను' అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి, తాను ప్రకృతికి అతీతుడుగా ఉండటానికి కర్మలు తనకి అంటకపోవటమే. కారణం అని చెపుతున్నాడు.కర్మలు అంటకపోవటానికి కర్మఫలాల మీద దృష్టి లేకపోవటమే కారణం అని చెపుతాడు. ఈవిధంగా ఎవరైతే ఆత్మని తెలుసుకుంటాడో అతడు కర్మల చేతిలో బందీకాదు. పూర్వం ముక్తి పొందాలనుకున్నవారు ఈ రహస్యాన్ని తెలుసుకుని కర్మాచరణం చేశారు.
తరతరాలుగా పెద్దలు అనుసరించిన పద్ధతిని నువ్వు కూడా పాటించు. పెద్దలు అనుసరించి, తరించిన ఈ మార్గాన్ని నువ్వు కూడా అనుసరించి కర్మాచరణం చెయ్యి. అంతే కాని, కర్మాచరణం మాత్రం మానే ప్రయత్నం 'చెయ్యవద్దు' అని అన్నడు.సాధారణంగా కర్మఫలాలని వదలమంటే కర్మలు చెయ్యటమే మానేస్తారు. అందుకనే చెయ్యవలసిన దానిని చెప్పటంతో పాటు, ఏమి చెయ్యకూడదో కూడా చెప్పాడు.ఇది బాగా అర్థం కావటానికి 'కర్మ', 'అకర్మ'ల గురించి వివరించాడు. ఈ రెండింటికి మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోకపోవటం వల్ల జ్ఞానులైన వారు కూడా భ్రమలకి లోనవుతూ ఉంటారు. వాటి నిజ స్వరూపం తెలుసుకుంటే కర్మ విమోచనం జరుగుతుంది.
కర్మ అంటే ఆచరించటం, అకర్మ అంటే ఆచరించకపోవటం. ఇవి మాత్రమే కాక, మూడవ మార్గం ఉంది. దాని గురించి స్పష్టంగా తెలియాలి. ఆ మార్గం తెలుసుకోవటం మాత్రం చాలా దుర్రాహమ్, అంటే గ్రహించటం చాలా కష్టం. అసలు అటువంటిది ఒకటి ఉన్నదనే చాలా మందికి తెలియదు.
ఎప్పటికప్పుడు దానిని ఆచరిస్తూనే ఉంటారు. గుర్తించి, తమకు కావలసినప్పుడు ఆ విధంగా ప్రవర్తించటం అభ్యాసం చేసినప్పుడు కర్మ విమోచనం జరుగుతుంది. ఆచరించటంలో ఆచరించకుండా ఉండటం, ఆచరించకుండా ఉండటంలో ఆచరించటం ఉన్నాయి. దీన్ని గ్రహించాలి. గమనించనంత కాలం ఇదేదో చిక్కుముడిలాగానే అనిపిస్తుంది.
ఉదాహరణకి మిత్రుడితో మాట్లాడుతూ, నడుస్తూ ఉన్నప్పుడు మన మనసు, దృష్టి మాటల మీదే ఉంటాయి. కాని, నడక సాగుతూనే ఉంటుంది. నడక అనే పని చేస్తున్నట్టా? శారీరకంగా చేస్తున్నా, చేసినట్టు కాదు. ఎందుకంటే, నడుస్తున్న స్పృహ లేదు. దారిలో ఎదురైన వాటిని వేటినీ గుర్తించలేదు. పట్టించుకోలేదు. అందువల్ల ఇంత దూరం నడిచామనే అలసట కూడా ఉండదు. నిత్యకృత్యాలని కూడా ఈ విధంగానే కర్మాచరణ చేస్తూనే కర్మ చేసిన ఫలితాన్ని పొందకుండా ఉండవచ్చు.
గాలి పీల్చినంత అలవోకగా నిత్యకృత్యాలని నిర్వహిస్తూ వాటి పట్ల స్పృహ లేకుండా ఉండగలగటం కుదురుతుందా? అనే సందేహం రావచ్చు. అది కుదురుతుంది అనటానికి గాలిపీల్చటమే పెద్ద ఉదాహరణ. తెలిసి, కావాలని గాలి పీలుస్తున్నామా? మనం ప్రయత్నపూర్వకంగా పీల్చాలంటే ఈ పాటికి ఎన్నిమార్లు మర్చిపోయి ఉండేవాళ్ళమో. మానేసి ఉండే వాళ్ళమో!
గుండె కొట్టుకోవటం, రక్తం ప్రసరించటం, తిన్నది. అరగటం.. మన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టే రోజువారీ వ్యవహారాలు పెద్దగా ప్రయత్నం లేకుండానే, సూర్యోదయ సూర్యాస్తమయాలంత సహజంగా జరిగిపోతూ ఉంటే సాధన ప్రయత్నపూర్వకంగా సాగుతూ ఉంటుంది. కొంత కాలానికి అది కూడా సహజంగా అలవాటుగా మారిపోతుంది.సాధన కర్మ చేయటం అయితే, బ్రతకటం కోసం చేసే పనులు మనసు పెట్టి చేసినవి కావు కనుక ఆకర్మ అవుతాయి. అదేవిధంగా అకర్మలో కూడా కర్మ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఎవరిపైన అయినా కోపం వచ్చినప్పుడు 'నీ మొహం చూడను' అని అనేప్పుడు ఎవరి మొహం చూడను అంటున్నారో వారి మొహం చూస్తూనే ఉంటారు కదా. ఇది కంటికి కనపడేది."ఈ విషయాన్ని గురించి నేను తలుచుకోను" అంటున్నప్పుడు ఆ విషయం గురించి తలుచుకున్నట్టే అవుతోంది కదా. ఇది ప్రతికూల భావనలతో జరిగేది. సానుకూలంగా కూడా ఇది జరుగుతూ ఉంటుంది.
బాగా బతికి చెడిన పెద్ద మనిషి ఒకడుండేవాడు. మంచి భోజన ప్రియుడాయన. మజ్జిగతో అన్నం తినవలసి వచ్చింది. గొంతు దిగటం లేదు. అప్పుడాయన ఒక ప్రక్రియ కనిపెట్టాడు. "మా చిన్నతనంలో మా అమ్మమ్మ పొద్దున చద్దన్నంలో మీగడ పెరుగువేసి పెట్టేది. ఎంత రుచిగా ఉండేదనుకుంటున్నారు?". అంటూ మనసులో మీగడ పెరుగుని ఆస్వాదిస్తూ నీళ్ళ మజ్జిగ అన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకుని మింగేవాడు. ఇది ప్రయత్నపూర్వకం. అప్రయత్నంగా కూడా చేసేవారు కనపడతారు. మత్తు మందులకి అలవాటు పడినవారు సమయానికి అవి దొరకకపోతే వాటినే అనుక్షణం తలచుకుంటూ ఉంటారు.
భౌతికంగా మత్తు మందులు తీసుకోలేదు (అకర్మ) గాని మనసంతా దానితోనే నిండి పోయింది (కర్మ). అకర్మలో కర్మ అంటే ఇది. లౌకిక వ్యవహారాల విషయంలో జరిగేది ఇదే.ఎన్నో పనులు ఇలాగే మానసికంగా చేస్తూ ఉంటాడు. మానవుడు, చెయ్యటం లేదు అనుకుంటూనే. ఇదే ఎక్కువ ప్రమాదకరం, బంధకారకం ఎందుకంటే బంధనానికి కారణం.
కర్మలో అకర్మని, అకర్మలో కర్మని జాగరూకతతో గమనించి గ్రహించగలవాడు బుద్ధిమంతుడు, యోగి, సర్వకర్మలను సమగ్రంగా ఆచరించేవాడు అవుతాడు.అసలైన కర్మ సిద్ధాంతం తెలియటానికి ఈ జ్ఞానం ప్రాతిపదిక అవుతుంది.
వెలుగు,లైఫ్
డాక్టర్ అనంతలక్ష్మి,