తెలంగాణలో భారత్​ జోడో యాత్ర ఎఫెక్ట్​ ఎంత? : దిలీప్ రెడ్డి

పునర్వైభవానికి బాట అని కాంగ్రెస్‌ భారీ ఆశలు పెట్టుకున్న రాహుల్​గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ప్రభావంపై రాజకీయ అంచనాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైతే ఆశ–నిరాశల మిశ్రమ ప్రభావాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ముంగిట్లో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక తరుణంలో ఈ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తున్నది. ఉపఎన్నిక పోలింగ్‌ జరిగే నవంబర్‌3న, ఫలితాలు వెల్లడయ్యే 6న కూడా రాహుల్‌ రాష్ట్రంలోనే ఉంటారు. 24 ఏండ్ల తర్వాత నెహ్రూ– గాంధీ కుటుంబేతర వ్యక్తి మళ్లీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టే వేడుకకు రాహుల్‌ గాంధీ ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 27 నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. దేశంలో, రాష్ట్రంలో గడచిన ఎనిమిదేళ్లుగా వరుస ఓటములతో రాజకీయ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి సంస్థాగతంగా కొత్త శక్తినిచ్చే కార్యక్రమం భారత్‌ జోడో. అందుకే భారీ అంచనాలు, ప్రగాఢమైన ఆశలు. ఇప్పటికే నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తయిన యాత్ర తెలంగాణ తర్వాత మరో ఏడు రాష్ట్రాల్లో సాగనుంది. నిర్దిష్ట లక్ష్యం, పకడ్బందీ వ్యూహంతో నిర్వహిస్తున్న ఈ యాత్ర తీరుతెన్నులు, జనస్పందన, ప్రభావాలపై ఆత్మపరిశీలనకిది సముచిత సందర్భమే! ‘పార్టీలో గుత్తాధిపత్యం అనుభవించడమే తప్ప బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాని అధిష్టానం’ అన్న అభియోగం నుంచి గాంధీ కుటుంబం బయటపడేందుకు ఈ యాత్ర, తాజా అధ్యక్ష ఎన్నిక ఏ మేరకు ఉపయోగపడతాయన్నది వేచి చూడాల్సిందే!

రాజకీయ ఫలితాలే గీటురాయి

రాహుల్‌ గాంధీ ‘పప్పు’ అని, దేన్నీ సీరియస్‌గా పట్టించుకోరని ఆయనపై పడిన ముద్ర తొలగించుకోవడానికి ఈ యాత్ర కొంతమేర పనికిరావచ్చు. రాజకీయంగా ఏం డివిడెండ్స్‌ ఇస్తుంది? అన్నది సందేహమే! 2014, 2019 ఎన్నికల ఫలితాలతో నిస్తేజమైన పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపినట్లే, దేశ పౌరుల్లో కొత్త విశ్వాసాలు పెంచి, భరోసా కల్పించగలిగితే రాజకీయంగా సక్సెస్‌ అయినట్టే! పార్టీ ఆశిస్తున్నట్టు 280 కాకపోయినా, ఇప్పుడున్న 50 నుంచి పార్టీ గెలుచుకునే లోక్‌సభ స్థానాల సంఖ్యను వచ్చే సాధారణ ఎన్నికల్లో మూడింతలు చేసి,150 వరకు తీసుకువెళ్లినా గొప్ప విజయమే! మరో విధంగా బీజేపీ లోక్‌సభ స్థానాల సంఖ్యను 300 నుంచి సగం, అంటే150కి పరిమితం చేయగలిగినా, ఆ పరిణామాన్ని భారత్‌ జోడో పాదయాత్ర సాధించిన విజయాల ఖాతాలో వేయవచ్చన్నది రాజకీయ పరిశీలకుల భావన. కానీ ఇప్పటి వరకు జరిగిన యాత్ర అటువంటి సంకేతాలను ఇవ్వలేకపోయింది. బీజేపీ స్థానే కాంగ్రెస్‌ ఓ బలమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఇవ్వగలదనో, రాహుల్‌ ఒక ఆధారపడదగ్గ రాజకీయ నాయకుడు, పార్టీ అధినేత అయ్యారనో దేశ ప్రజానీకానికి నమ్మకం ఈ యాత్ర ఇప్పటివరకు కల్పించలేకపోయింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనాన్ని కలవటం, వారికి సమీపంగా ఉన్న భావన కలిగించడం, కొంతమేర భావోద్వేగాలు రేకెత్తించడం వరకు ఈ యాత్ర ఫలించినట్టే! కానీ, ఏ ప్రజా సమస్యను, ప్రభావితులైన అదే పౌరులతో లోతుగా చర్చించింది లేదు. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన జటిల సమస్యలకో, స్థానికాంశాలకో పరిష్కార మార్గాలు అన్వేషించిందీ లేదు. ప్రభుత్వ వైఫల్యాలను నిర్దిష్టంగా ఎత్తిచూపి, ఎండగట్టిందీ, అవసరం మేర ఎక్కడికక్కడ ఉద్యమించిందీ లేదు. ఇటు ప్రజాసమస్యలు, అటు ఆయా రాష్ట్రాల్లో పార్టీ అంతర్గత విభేదాలు తొలగిపోయేలా సయోధ్య చర్యలు చేపట్టకుండా ఎన్నివేల కిలోమీటర్లు యాత్ర చేసినా ఏం ప్రయోజనం? అనే పెదవి విరుపు ఇంటా – బయటా ఇపుడు తప్పటం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఎందుకీ దుస్థితి...?

జనాభిప్రాయం మన్నించి రాష్ట్ర విభజన చేసిన పార్టీగా కాంగ్రెస్‌ ఎక్కడ, ఏం బావుకుంది? అన్న ప్రశ్న 8 ఏండ్లుగా వెంటాడుతున్నది. దీనిపై ఇప్పటికీ పార్టీలో సరైన ఆత్మశోధన జరగనే లేదు. యాత్ర తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే నాటికే, ఒక ఆత్మపరిశీలన– భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేసుకొని ఉండాల్సింది. సమైక్యం కోరుకున్న ఆంధ్ర పౌర సమాజానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిందనే భావన వల్ల ఏపీలో నామరూపాలు లేకుండా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మరి సబ్బండ వర్గాల అభిలాష మన్నించి రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో పార్టీకి పట్టిన ఈ దుర్గతికి కారణమేంటో ఎవరికీ అంతుబట్టదు. రెండు సార్లూ పరిమిత సంఖ్యలో గెలిచిన వారూ, కాంగ్రెస్‌ను వీడి, పాలకపక్షం పంచన చేరడంతో పార్టీపై జనానికి నమ్మకం పోయింది! రేపు గెలిపించినా అమ్ముడుపోరనే గ్యారెంటీ లేదని జనసామాన్యంలో వచ్చిన అభిప్రాయం పార్టీ విశ్వసనీయతను దిగజార్చింది. ఇంత జరిగాక, రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చినా, ఆశించిన ఫలితాలు అధినాయకత్వం రాబట్టలేకపోతున్నది. పీసీసీకి పూర్తి అధికారం ఇచ్చి కూడా ఐక్యత సాధించలేకపోయింది. రేవంత్‌రెడ్డి పీసీసీ నేతగా వచ్చేముందు, వచ్చిన కొత్తలో ఉన్న ఊపు ఇయ్యాల పార్టీలో లేదు. సీనియర్లు– జూనియర్లను సయోధ్యతో ఆయన కలుపుకుపోతున్న జాడలు లేవు. వారు కలిసి వస్తున్న వాతావరణం అంతకన్నా లేదు. ఢిల్లీ నుంచి వచ్చే దూతలు–ప్రతినిధులెవరూ ఈ పరిస్థితిని చక్కదిద్దే చొరవ, సామర్థ్యంతో లేరు. రేవంత్‌రెడ్డి తాజా మాటలు మునుగోడులో పార్టీ కాడి వదిలేసి, చేతులెత్తేసినట్టుగానే ఉన్నాయి. 30 ఏండ్ల కింద, రాహుల్‌ తండ్రి రాజీవ్‌గాంధీ రాష్ట్రంలో జరిపిన సద్భావన యాత్రను, ప్రజా స్పందనను మాజీ ఎంపీ ఆర్‌.సురేందర్‌ రెడ్డి నేటికీ గుర్తు చేసుకుంటుంటే, జనం తండ్రీ కొడుకుల యాత్రలనే కాదు, నాటి–నేటి పీసీసీ నేతృత్వాలనూ పోల్చి చూస్తున్నారు. చెన్నారెడ్డి – రేవంత్‌ రెడ్డిలకు ఎక్కడా సామ్యం లేకుండా అనేక వైరుధ్యాలే ఉన్నా... ఎన్నికల ముంగిట్లో పార్టీని ఐక్యంగా నడిపించడంలో చెన్నారెడ్డి నేతృత్వం ఎప్పటికీ ఆదర్శమనడానికి సాధించిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. భారత్‌ జోడో పాదయాత్ర ఏ రాష్ట్రంలో ఎంత గొప్పగా సాగినా, తుది ఫలితాల సాధన ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఐక్యత, నాయకుల మధ్య సఖ్యత, స్థానిక ప్రజలకు కల్పించే విశ్వాసాన్ని బట్టే ఉంటుందన్నది వాస్తవం.

రాహుల్‌ వైఖరే కీలకం

రాహుల్‌ మరింత బాధ్యతాయుతంగా ఉంటారనే విశ్వాసాన్ని అంతర్గతంగా పార్టీలో, బయట ప్రజాక్షేత్రంలోనూ కలిగించడం వ్యూహకర్తలకు తక్షణ కర్తవ్యం. కాంగ్రెస్‌లో నిర్ణయ ప్రక్రియ, నిర్ణయాధికారం ఎలా ఉంటుంది? ఎవరెవరు, ఏయే బాధ్యతల్ని నిర్వహిస్తారు? ఏ హోదా – అధికారాలు కలిగి ఉంటారో స్పష్టత ఉండాలి. కొన్నేండ్లుగా వస్తున్న విమర్శలు, అభియోగాలకు ఆచరణాత్మక సమాధానాలు కావాలి. తాజా అధ్యక్ష ఎన్నిక తర్వాత... ‘పార్టీలో నా విధులు – బాధ్యతలేమిటో కొత్త అధ్యక్షుడు నిర్ణయిస్తార’ని వినయంగా వెల్లడించిన రాహుల్‌, ఏ హోదాతో ఆయా రాష్ట్రాల్లో హామీలు ఇచ్చారో, ఇస్తున్నారో? తెలపాలి. వాటిని ఎవరు, ఎందుకు, ఎలా అమలు పరుస్తారో చెప్పగలరా? అన్న సందేహాలు సహజం. ఎప్పుడో పార్టీ బాధ్యతల్లోకి వచ్చిన నుంచి రాహుల్‌ సంస్థాగతంగా పలు విఫల ప్రయోగాలు చేశారు. దేన్నీ హేతుబద్ధమైన ముగింపు వరకు తీసుకువెళ్లలేదు. నిబద్ధతా లేదు. అందుకే, ఏవీ సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు భారత్‌జోడో పాదయాత్రను సవ్యంగా జరిపి, సమీక్షించి, మార్పు – చేర్పులతో, నిఖర ఫలితాలిచ్చేలా అర్థవంతమైన ముగింపునకు తీసుకురావాల్సిన బాధ్యత మిగతా అందరికన్నా రాహుల్‌ పైనే అధికంగా ఉంది.

అందరి యాత్రలూ ఒకటి కావు

2014 మొదలు దేశ ఎన్నికల రాజకీయాల్లో బీజేపీ పైపైకి దూసుకుపోతుంటే, కాంగ్రెస్‌ విఫలమవుతూ వస్తున్న పరిస్థితుల్లో రాహుల్‌ చేపట్టిన ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు కాంగ్రెస్‌ కేంద్రకంగా ఉండాలని కొందరు, కాంగ్రెస్‌ రహిత విపక్ష కూటమి ఏర్పడాలని మరికొందరు భావిస్తున్న వేళ, కాంగ్రెస్‌ తనకు తాను బలోపేతం కావాల్సిన చారిత్రక అవసరాన్ని నాయకత్వం గుర్తించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు, 12 రాష్ట్రాల మీదుగా,150 రోజుల పాటు 3500 కిలోమీటర్లు దూరం భారత్‌ జోడో–రాహుల్‌ పాదయాత్ర సాగుతున్నది. నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఇది సరికొత్త ఆశల్ని రేపింది, కొంత కదలికా తెచ్చింది. దేశ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఆశించిన స్థాయిలో ప్రభావం లేకపోయినా పార్టీ పునరుజ్జీవనానికి దోహదపడుతుందని పార్టీ శ్రేణులతో పాటు తటస్థులు, రాజకీయ ప్రత్యర్థులూ భావిస్తున్నారు. ఈ దేశంలో బుద్ధుడు, ఆదిశంకరుల నుంచి ఏనుగుల వీరాస్వామి, ఆచార్య వినోభాబావె, ‘యంగ్‌ టర్క్‌’లో కీ పర్సన్‌ దివంగత ప్రధాని చంద్రశేఖర్‌, డాక్టర్‌ వైఎస్సార్..​ ఇలా ఎందరెందరో పాదయాత్రలు చేసిన చరిత్ర మన కళ్లముందుంది. ఇటీవల చంద్రబాబునాయుడు, వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి, వైఎస్‌ షర్మిల, తమ్మినేని వీరభద్రం, బండి సంజయ్‌ వరకు పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటించారు. ఎమ్వీరమణారెడ్డి, మైసూరారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ వంటి వారెందరో ఆయా సమయాల్లో స్థానికంగా కొన్ని పాదయాత్రలు జరిపారు. 

- దిలీప్ రెడ్డి,
dileepreddy.ic@gmail.com