- నాలుగేళ్ల కింద హడావుడి చేసిన రెవెన్యూ, సీఐడీ ఆఫీసర్లు
- ఇప్పటికీ రెవెన్యూ రికార్డులన్నీ సీఐడీ కస్టడీలోనే
- 200 ఎకరాల మేర ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జా
- మాజీ సర్పంచే ప్రధాన సూత్రధారి
కరీంనగర్, వెలుగు:నాలుగేండ్ల కింద రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లా బొమ్మకల్ భూకబ్జా కేసు వ్యవహారంలో విచారణ ముందుకు సాగడం లేదు. అప్పట్లో హడావుడి చేసిన సీఐడీ, విజిలెన్స్, రెవెన్యూ ఆఫీసర్లు మళ్లీ అటువైపుగా దృష్టి సారించకపోవడంతో ఆ కేసు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో మాజీ సర్పంచ్, ఆయన అనుచరులు కలిసి కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని సుమారు 200 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల్లో చెరువులు, కుంటలు కూడా ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ భూములను కబ్జా నుంచి విడిపించాలని, నకిలీ ఇంటి పన్నులతో చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని 2020 ఆగస్టులో లోక్ సత్తా ఉద్యమ సంస్థ, పలువురు బాధితులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
తమకు న్యాయం చేయాలని స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కూడా కలిశారు. దీనిపై స్పందించిన అప్పటి కలెక్టర్ శశాంక రెవెన్యూ, పోలీస్, టాస్క్ ఫోర్స్ టీమ్ లతో ఎంక్వైరీ చేయించారు. ఈ విచారణలో విస్తు పోయే విషయాలెన్నో వెలుగు చూశాయి. అయితే బాధ్యులపై కేసులు నమోదు చేసి, భూములను కబ్జా చెర నుంచి విడిపించాల్సి ఉండగా.. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్.. బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైన బొమ్మకల్ భూములను భూమాఫియా చెర నుంచి విడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
బొమ్మకల్ లో 200 ఎకరాలు కబ్జా..
బొమ్మకల్ గ్రామ సర్పంచ్ గా పని చేసిన ఓ మాజీ సర్పంచ్ భూ మాఫియాలో డాన్ గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో అధికార పార్టీలో ఉంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాను గ్యాంగ్ ను మెయింటేన్ చేస్తూ బొమ్మకల్ మేజర్ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా పెట్టారని బాధితులు రోడ్డెక్కారు. రెవెన్యూ, పోలీస్, టాస్క్ ఫోర్స్ జాయింట్ సర్వేలోనూ ఇదే తేలింది. ఎప్పుడో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిన భూములకు కొత్తగా డాక్యుమెంట్లు సృష్టించి తాము కొన్నామంటూ ఆ భూముల్లోకి వెళ్లడం, బెదిరించి సెటిల్మెంట్లకు దిగడం వంటి అనేక దారుణాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి.
అలాగే ఇతర ప్రాంతాల్లో ఉంటూ బొమ్మకల్ లో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారి కోట్లాది రూపాయల విలువైన భూములను ఈ మాఫియా టార్గెట్ చేసి కాజేసినట్లు అధికారులు గుర్తించారు. బొమ్మకల్ పరిధిలోని 28, 74, 105, 108, 728 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు ఉండగా.. వీటిలో 30 ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లు విచారణలో తేలింది. అలాగే బొమ్మకల్ జక్కప్ప చెరువు 46.21 ఎకరాల్లో ఉండగా, అందులో 20 ఎకరాల మేర కబ్జాకు గురైంది. 9.08 ఎకరాల రాయికుంట, 29.10 ఎకరాల గోపాల్ చెరువు పూర్తిగా కబ్జా అయ్యాయి. మల్లె చెరువులోని 14.10 ఎకరాలకు గతంలో ఏక్ సాల్ పట్టాలు ఉండగా.. ఓ తహసీల్దార్ రెగ్యులర్ పట్టాలు జారీ చేశారు. 16.10 ఎకరాల్లో ఉన్న నల్ల చెరువులో 7 ఎకరాలు కబ్జా అయింది. గోధుమకుంటలో 23.02 ఎకరాలకు 10 ఎకరాలు కబ్జా అయింది. బొమ్మకల్ పరిధిలోని చాలా వెంచర్లలో ఖాళీ స్థలాలను కూడా ఈ మాఫియా కబ్జా చేసింది. పార్క్ కోసం కేటాయించిన స్థలాలతో పాటు ఆట స్థలాలు, గుడి కోసం వదిలిన స్థలాలను ఆక్రమించి ఇతరుల పేరిట ఈ మాఫియా రిజిస్ట్రేషన్ చేసింది. దీంతో మాజీ సర్పంచ్ తో పాటు కొందరు రెవెన్యూ ఆఫీసర్లు, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ క్రమంలోనే భూకబ్జాలను అరికట్టేందుకు ఆర్డీవో ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో 8 మందితో కూడిన టీమ్ బొమ్మకల్‌లోని చెరువు, కుంటల శిఖం భూములు, ప్రభుత్వ భూములపై సర్వే చేపట్టి హద్దులు నిర్ధారించినప్పటికీ.. గత నాలుగేండ్లుగా మళ్లీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.
సీఐడీ కస్టడీలో బొమ్మకల్ భూ రికార్డులు..
అప్పట్లో బొమ్మకల్ గ్రామానికి చెందిన వేలాది నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు, భూ రికార్డులను అయిదారు సంచుల్లో ట్రక్కులో తరలిస్తుంటే దుర్శేడ్ సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఇందులో ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్‌బుక్‌లు, పహణీ నకళ్లు, రికార్డు బుక్‌లు, స్టాంపు పేపర్లు, అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మకల్ భూ రికార్డులన్నీ సీఐడీ కస్టడీలోనే ఉన్నాయి. బొమ్మకల్ రైతులు, భూ యజమానులకు బ్యాంకు లోన్లు, ఇతర అవసరాల కోసం పాత పహణీలు అవసరమైతే.. రూరల్ తహసీల్దార్ ద్వారా ఒక దరఖాస్తును ఫార్వర్డ్ చేయించుకుని వెళ్లి సీఐడీ ఆఫీసులో జిరాక్స్ లు తీసుకోవాల్సి వస్తోంది.