
ఒక దేశంలోని ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం, విదేశాల్లో గల ప్రజలు, సంస్థలు, ప్రభుత్వంతో జరిపే వ్యాపారమే అంతర్జాతీయ వ్యాపారం. అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. మన దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు అమ్మడాన్ని ఎగుమతులు అంటారు. ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన వస్తువులను మన దేశ పౌరులు కొనడాన్ని దిగుమతులు అంటారు. ఒక దేశ విదేశీ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం అవలంబించే నియమ నిబంధనలను తెలియజేసేది వర్తక విధానం. ప్రభుత్వ వ్యాపార విధానాలు సంప్రదాయపరంగా రెండు రకాలు. 1.స్వేచ్ఛా వ్యాపార విధానం. 2. రక్షణ విధానం.
స్వేచ్ఛా వ్యాపార విధానం
ఒక దేశం ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపైన ఎలాంటి సుంకాలు, కోటాలు, కంట్రోళ్లు లేకుండా, ఎగుమతులపై ఎలాంటి ప్రోత్సాహకాలు, సుంకాలు లేకుండా వ్యాపారం నిర్వహిస్తే అది స్వేచ్ఛా వ్యాపార విధానం.
రక్షణ విధానం
స్వేచ్ఛా వ్యాపార విధానానికి ఇది వ్యతిరేకమైంది. దిగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా గానీ, స్వదేశీ పరిశ్రమలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా గానీ దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పిస్తే అది రక్షణ విధానం. శైశవ దశలో ఉన్న పరిశ్రమలను రక్షించేందుకు, దేశ రక్షణ, ఉపాధి అవకాశాల కల్పన దృష్ట్యా రక్షణ విధానం మేలైంది. దిగుమతులపై రెండు రకాల ఆంక్షలు విధించవచ్చు. అవి.. సుంకాలు (టారిఫ్), సుంకాలేతర అవరోధాలు (నాన్ టారిఫ్ బారియర్స్). దిగుమతులపై అధిక పన్ను వేస్తే అది టారిఫ్ అవరోధాలు. దిగుమతులపై పన్ను రూపంలో కాకుండా దిగుమతుల పరిమాణంపై ఆంక్షలు విధిస్తే అది సుంకాలేతర అవరోధాలు/ పరిమాణాత్మక ఆంక్షలు/ కోటాలు.
స్వేచ్ఛా వ్యాపార విధానం వల్ల ప్రపంచ వ్యాపారం విస్తరించగా, రక్షణ విధానం వల్ల సంకోచిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు రక్షణ విధానాన్ని నామమాత్రంగానైనా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల మధ్యనైనా స్వేచ్ఛా వ్యాపారం జరిగేందుకు స్వేచ్ఛా వ్యాపార ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. రక్షణ విధానం దేశ శ్రేయస్సును పెంచగా, స్వేచ్ఛా వ్యాపార విధానం ప్రపంచ శ్రేయస్సును పెంచుతుంది. ముఖ్యంగా భారత్ దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించింది. అంటే 1991 వరకు భారత్ ఇన్వార్డ్ లుక్కింగ్ పాలసీని అవలంబించింది.
భారత ప్రభుత్వ వ్యాపార విధానం
భారత వ్యాపార విధానాన్ని సంస్కరణలకు ముందు, సంస్కరణల తర్వాత అని విడదీసి పరిశీలించవచ్చు. 1991లో విదేశీ వ్యాపారానికి సంబంధించి భారీ వ్యాపార సరళీకరణ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఈ సంవత్సరాన్ని ఒక మైలురాయిగా భావిస్తారు. సంస్కరణలకు ముందు 1. దిగుమతులపై ఆంక్షలు ఉండేవి. 2. దిగుమతులు ప్రతిస్థాపన విధానాన్ని అవలంబించేవారు.
దిగుమతులపై ఆంక్షలు
మహల్నోబిస్ అభివృద్ధి వ్యూహం భారీ పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడం వల్ల మూలధన ఎక్విప్మెంట్, యంత్రాలను, విడి పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చయింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వాటిని కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఎగుమతుల ఆదాయం దీనికి అనుగుణంగా పెరగలేదు. అందుకే 1956–57 నుంచి దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ వచ్చాయి. దిగుమతులపై లైసెన్సింగ్ విధానం ఉండేది. పరిమాణాత్మక ఆంక్షలు కూడా ఉండేవి. కొన్ని దిగుమతులను స్టేట్ ట్రేడింగ్ ఏజెన్సీలైన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ల ద్వారా అనుమతిస్తారు. వీటిని కేనలైజ్డ్ ఐటమ్స్ అంటారు. ఈ దిగుమతి ఆంక్షలు 1977–78 వరకు కొనసాగేవి.
దిగుమతుల ప్రతిస్థాపన
కొరతగా ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం, ఎక్కువ వస్తువుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడం అనే లక్ష్యాలతో దిగుమతుల ప్రతిస్థాపన చేపట్టారు. దిగుమతుల ప్రతిస్థాపనను మొదటి దశలో దేశీయ వినియోగ వస్తువుల ఉత్పత్తి స్థానంలో, రెండో దశలో దిగుమతి చేసుకునే మూలధన వస్తువుల స్థానంలో, మూడో దశలో దిగుమతి చేసుకునే సాంకేతిక పరిజ్ఞానం స్థానంలో ప్రవేశపెట్టారు.
1977లో జనతా ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి వినియోగ వస్తువుల దిగుమతిని సరళీకృతం చేసింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా విదేశీ వాణిజ్య విధానాన్ని సరళీకృతం చేసే ప్రయత్నం జరిగింది. ఉత్పత్తిలో సమర్థతను పెంచడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతి లభించింది.
సంస్కరణల కాలం – నూతన వ్యాపార విధానం
సంస్కరణల తర్వాత వ్యాపార విధానంలో చెప్పుకోదగిన సరళీకరణ చర్యలు ప్రవేశపెట్టాయి. 1995లో ఏర్పడిన డబ్ల్యూటీఓలో భారతదేశం సభ్యదేశంగా ఉండటంతో దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలు తొలగించడం తప్పనిసరి అయింది. దిగుమతి టారిఫ్‌లను తగ్గించి ప్రపంచ వ్యాపారానికి భారత ఆర్థిక వ్యవస్థను బహిర్గత పరిచారు. ప్రపంచీకరణ దిశగా చర్యలు చేపట్టారు.
1980వ దశకంలో దిగుమతుల సరళీకరణ
1977–78లో దిగుమతుల సరళీకరణ ప్రారంభమైంది. ఎ. ఎక్కువ మూలధన వస్తువులను దిగుమతుల లైసెన్స్ లేకుండానే దిగుమతి చేసుకునే విధంగా ఓపెన్ జనరల్ లైసెన్స్ కేటగిరిలో పెట్టారు. బి. ముడిపదార్థాలను కూడా ఓపెన్ జనరల్ లైసెన్స్‌లో ఉంచారు. సి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం దిగుమతులను సరళీకరించింది. సంస్కరణల ముందు ఎగుమతుల విధానం సంస్కరణలకు ముందు ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది.
పన్ను చెల్లించే ఎగుమతిదారులకు నగదు పరిహార మద్దతును 1966లో ప్రవేశ పెట్టారు.
- 1966లో 36.5 శాతం రూపాయి మూల్యహీనీకరణ చేశారు.
- ఎగుమతుల కోసం దిగుమతి చేసుకునే వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు 1957లో ఇంపోర్ట్ ఎన్టైటిల్మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఈఓయూలను 1981లో ప్రవేశపెట్టారు.
- ఎగుమతిదారులకు స్వేచ్ఛా వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఎక్స్పర్ట్
- ప్రాసెసింగ్ జోన్ల(ఈపీజెడ్)ను 1965లో ఏర్పాటు చేశారు. మొదటి ఈపీజెడ్ కాండ్లా.
- ఎగుమతుల ఆదాయంపై ఆదాయ పన్ను కొంత మినహాయింపు ఇచ్చారు.
- ఎగుమతులు ప్రోత్సహించేందుకు కొన్ని వ్యవస్థాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు.
- 1996లో ఆరు వేలకు పైగా వస్తు దిగుమతులపై సుంకాలు తొలగించారు. 2000–01 ఎక్సిమ్ పాలసీలో 714 అంశాలు, 2001–02 ఎక్సిమ్ పాలసీలో 715 అంశాల దిగుమతులపైన పరిమాణాత్మక ఆంక్షలు తొలగించారు. అంటే డబ్ల్యూటీఓ నిబంధనల మేరకు అన్ని రకాల పరిమాణాత్మక ఆంక్షలు తొలగించారు.
- రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సులపై 1993–94 బడ్జెట్లో 110 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 2007–08 నాటికి 10 శాతానికి తగ్గించారు.
- ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా ఎక్కువ వస్తువులు ఎగుమతులు, దిగుమతులు అయ్యేవి. 1991లో కొన్ని ఎగుమతులు, దిగుమతులను డిక్యాన్సలైజేషన్ చేశారు.
- 1991, జులై 1, 3న భారత రూపాయి వినిమయ రేటును 18 శాతం నుంచి 19 శాతానికి సర్దుబాటు చేశారు. 1992–93లో రూపాయికి పాక్షిక మార్పిడి, 1993–94లో రూపాయికి పూర్తి మార్పిడి, 1994, ఆగస్టులో కరెంట్ ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించారు. మూలధన ఖాతాలో కూడా సరళీకరణ చర్యలు చేపట్టారు. రూపాయి మారకపు రేటు ప్రస్తుతం మార్కెట్ నిర్ణయిస్తుంది. అయితే, ఒడిదొడుకులు ఎక్కువైనప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. దీనిని మేనేజ్డ్ ఫ్లోటింగ్ విధానం అంటారు.
- ఎగుమతులు కోసం ఉపయోగించే దిగుమతులపై పన్ను మినహాయింపు ఇచ్చారు. 2004–09 వ్యాపార విధానంలో ఎక్స్పోర్ట్ హౌస్‌లను ఐదు రకాలుగా విడదీశారు. వీరికి అనేక రాయితీలు ఇచ్చారు.