బడి భవిష్యత్​ ఎట్లుంటదో?

బడి భవిష్యత్​ ఎట్లుంటదో?
కరోనా ఎఫెక్ట్​తో మార్చి నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు బందయ్యాయి. స్టూడెంట్లందరూ దాదాపుగా చదువుకు దూరమయ్యారు. లాక్​డౌన్​ ఎత్తేసినా ఫిజికల్​ డిస్టెన్స్, స్టూడెంట్ల సేఫ్టీ దృష్ట్యా చాలా రాష్ట్రాలు స్కూళ్లను ఇంకా తెరవలేదు. కొన్ని రాష్ట్రాల్లో బడులను తెరిచినా స్టూడెంట్ల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం అధికారికంగా డిజిటల్ క్లాసులకు అనుమతులు ఇవ్వకపోయినా.. ప్రైవేటు స్కూళ్లు వాటిని నడిపిస్తున్నాయి. డిజిటల్ క్లాసుల వల్ల స్టూడెంట్లపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బడులను పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుస్తారనే ప్రశ్న స్టూడెంట్లు, పేరెంట్స్​ను టెన్షన్​ పెడుతోంది. ఒకవేళ తెరిచినా లాస్​ అయిన ఈ విద్యా సంవత్సరాన్ని ఎలా కవర్​ చేస్తారనేది కూడా పెద్ద క్వశ్చన్​ మార్కే.   స్కూళ్లు, కాలేజీలను అక్టోబర్ 15 నుంచి తెరవొచ్చని అన్​లాక్​ గైడ్​లైన్స్ 5.0 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే వీటికి కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పింది. కరోనా ప్రొటోకాల్ నిబంధనలకు తోడు కేంద్ర విద్యా శాఖ ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్​వోపీ)తోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన రూల్స్​ పెట్టి స్కూళ్లు, కాలేజీలు నిర్వహించుకోవాలని సూచించింది. పిల్లలను స్వచ్ఛందంగానే బడికి పంపుతున్నట్లు, ఒకవేళ వారికి కరోనా సోకినా ఎవరినీ బాధ్యులను చేయబోమని పేరెంట్స్​ అంగీకార పత్రాలు ఇవ్వాలనే నిబంధన విధిగా పాటించాలని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్.. రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను పాక్షికంగా తెరిచారు. స్టూడెంట్ల హాజరు చాలా పరిమితంగా అంటే సగటున 5–15 శాతం ఉన్నట్లు  తెలుస్తోంది. తర్జనభర్జనలో చాలా రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలను తెరిచే విషయంలో మిగిలిన రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణ కూడా సంక్రాంతి తర్వాత విద్యా సంస్థలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. కర్నాటకలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్టూడెంట్ల హాజరు 5 శాతం మాత్రమే ఉన్నందున స్కూళ్లు తెరిచే అంశాన్ని మళ్లీ పరిశీలిద్దామని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. హర్యానాలో 9–12 తరగతులను డిసెంబర్ 21 నుంచి ప్రారంభించాలని, కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చిన స్టూడెంట్లనే అనుమతించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి మేరకు డిసెంబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు స్కూళ్లు ప్రారంభించేది లేదని ఢిల్లీ సర్కార్​ ప్రకటించింది. కరోనా తగ్గేదాకా బడులు తెరిచేది లేదని బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. డిసెంబర్ నెలాఖరు వరకు విద్యాసంస్థలు పని చేసే అవకాశం లేదని రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ప్రకటించాయి. డిసెంబర్ రెండో వారం నుంచి బడి తలుపులు తెరుస్తామని గతంలో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్​ ఎ. శ్రీదేవసేన.. ఈ విషయంపై సీఎం కేసీఆర్ అనుమతి కోసం చూస్తున్నామని ఇటీవల చెప్పారు. సరికొత్త సమస్యగా డిజిటల్ క్లాసెస్​ స్కూళ్లలో ఫిజికల్​గా విద్యాబోధన జరిగే అవకాశం లేకపోవడంతో ఆన్​లైన్​ క్లాసుల ట్రెండ్ వచ్చేసింది. దానితో పాఠశాల విద్యలో నెలకొన్న అనేక అసమానతలకు తోడు డిజిటల్ డివిజన్ సరికొత్త సమస్యగా మారింది. ఈ విభజన ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల మధ్య అసమానతలకే పరిమితం కాకుండా ప్రైవేట్ స్కూళ్ల మధ్య, వాటిలోని స్టూడెంట్ల మధ్య కూడా అసమానతలకు దారితీసింది. కొన్ని కార్పొరేట్ స్కూల్స్, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు మాత్రమే ఆన్​లైన్​ క్లాసులు చెబుతున్నాయి. అవి కూడా ఫీజులు చెల్లించిన వారిని మాత్రమే క్లాసులకు అనుమతి ఇస్తున్నాయి. తక్కువ ఫీజులు తీసుకునే బడ్జెట్ స్కూళ్లు రికార్డ్ చేసిన పాఠాలను సోషల్ మీడియా ద్వారా అందించడం తప్ప లైవ్ క్లాసులు చెప్పలేక పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సకల సౌకర్యాలు, డిజిటల్ బోధనలో శిక్షణ పొందిన టీచర్లు కలిగిన కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు కొంత మేరకు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాయి. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలోని స్టూడెంట్లకు దక్కింది టీవీ పాఠాలే. కొంతమంది హైస్కూల్ స్టూడెంట్లకు వాట్సాప్ సందేశాలే. వాటిని కూడా బడుగు బలహీన వర్గాల స్టూడెంట్లు అందుకోలేకపోయారు. మరోవైపు ఫీజులు కట్టే స్తోమత లేని ప్రైవేట్ స్కూళ్ల స్టూడెంట్లు మానసికంగా నలిగిపోయారు. మొత్తం మీద డిజిటల్ లెర్నింగ్, ఆన్​లైన్​ క్లాసులు, వాట్సాప్ పాఠాల ద్వారా 30% మంది స్టూడెంట్లే ఎంతో కొంత నేర్చుకున్నారు. ఇవన్నీ కాలక్షేప కార్యక్రమాలే తప్ప వాటితో సిలబస్ పూర్తయినట్లు చూసే అవకాశం లేదు. అందువల్ల 2020–21 విద్యా సంవత్సరంపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వ భరోసా ఉండాలి స్కూల్​ ఎడ్యుకేషన్​ను అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. కరోనా ప్రొటోకాల్ నిబంధనలు, ఎస్ వోపీలను పాటిస్తూ బడులు తెరిచి ‘‘పిల్లలకు ఏమీ కాదు. వారిని స్కూళ్లకు పంపండి. కరోనా సోకితే ప్రభుత్వమే ట్రీట్​మెంట్​ చేయిస్తుంది’’ అనే భరోసా ఇవ్వగలిగితేనే తల్లిదండ్రులు స్పందిస్తారు. కరోనా విపత్తులో తగిన జాగ్రత్తలతో క్లాసులు నిర్వహించాలంటే స్టూడెంట్ల నుంచి అదనంగా ఫీజు వసూలు చేయాల్సి వస్తుందని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు గతంలోనే ప్రకటించాయి. థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్, ఫిజికల్​ డిస్టెన్స్, మంచి నీరు, మధ్యాహ్న భోజనం, కరోనా టెస్టులు మొదలైన అవసరాలకు తగిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వ స్కూళ్లు నిర్వహించడం చాలా కష్టం. ఒకవేళ జనవరి మొదటి వారం నుంచి స్కూళ్లు తెరిస్తే విద్యా సంవత్సరం ఎప్పటికి ముగిస్తారనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో 220 రోజులు విద్యా సంస్థలను నడిపించలేకపోయినా, సగం రోజులైనా అదనపు పని గంటలతో నిర్వహించి, కొంత సిలబస్ తగ్గించుకుని రీషెడ్యూల్ చేయవచ్చు. సీబీఎస్ఈ పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలను మార్చిలో నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. అందువల్ల ఈసారి విద్యా సంవత్సరం ముగింపు, పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయాలను కేంద్రంతో రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలి.