- దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీని దక్కించుకున్న అదానీ గ్రూప్
- ప్రభావిత గ్రామాల అభివృద్ధి, కార్మికుల హక్కులు, సంక్షేమంపై ఆందోళన
- కంపెనీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష
మంచిర్యాల/కాసిపేట, వెలుగు : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సీకే బిర్లా యాజమాన్యం పరిధిలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ (ఓసీసీ) త్వరలోనే అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది. దేశవ్యాప్తంగా అనేక సిమెంట్ కంపెనీలను టేకోవర్ చేస్తున్న ఆదానీ గ్రూప్ దేవాపూర్ ఓసీసీ కొనుగోలు కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు సీకే బిర్లా, ఆయన కుటుంబసభ్యులు 46.8 శాతం ప్రమోటర్లుగా ఉన్న ఓరియంట్ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.395లతో మొత్తం రూ. 3,791 కోట్లతో కొనుగోలుకు రెండు గ్రూప్‌ల మధ్య అగ్రిమెంట్ కుదిరినట్టు సమాచారం. అయితే ఓరియంట్ సిమెంట్ కంపెనీ బాధ్యతలు ఆదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లాక కార్మికుల భవిష్యత్ ఏంటన్న చర్చ జరుగుతోంది.
42 ఏండ్ల కింద ఏర్పాటు..2,300 మంది కార్మికులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాసిపేట మండలం దేవాపూర్‌లో సీకే బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో 1979లో సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు పునాది పడింది. 1982 సెప్టెంబర్‌లో మొదటి ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించారు. 1996లో సెకండ్ ప్లాంట్, 2007లో థర్డ్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. ఒక వైపు సిమెంట్ ఉత్పత్తి చేస్తూనే మరో వైపు 2009లో పవర్ ప్లాంట్‌ను సైతం నిర్మించారు. ఈ కంపెనీలో ప్రస్తుతం 265 మంది పర్మినెంట్ కార్మికులు, 300 మంది మేనేజ్మెంట్ స్టాఫ్, 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 293 మంది సిమెంట్ లోడింగ్ కార్మికులు ఉన్నారు.
అమలు కానీ సీకే బిర్లా గ్రూప్ హామీలు
కాసీపేట మండలంలో సిమెంట్ కంపెనీ ప్రారంభించిన భూములన్నీ ఆదివాసీలకు చెందిన 1/70 షెడ్యూల్ పరిధిలో ఉన్నాయి. ప్లాంట్ల నిర్మాణం కోసం యాజమాన్యం స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన భూములను సేకరించింది. భూనిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని 1981లోనే హామీ ఇచ్చింది. ఇప్పటికి 42 సంవత్సరాలు గడిచినా.. ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కంపెనీ మేనేజ్మెంట్ మాత్రం పట్టించుకోలేదు. 2023లో నాలుగో ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా మరో 4 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిసర గ్రామాలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని, ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను సైతం గాలికి వదిలేశారు.
కార్మికుల భవితవ్యంపై ఆందోళన
దేవాపూర్లోనే నాలుగో ప్లాంట్ నిర్మిస్తామని చెప్పిన సీకే బిర్లా యాజమాన్యం ఇప్పుడు మాటమార్చి కంపెనీనే అమ్మేయడం చర్చనీయాంశమైంది. సీకే బిర్లా యాజమాన్యం ఇప్పటికే అదానీ గ్రూపుతో మొదటి దశ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలిసింది. ఈ కంపెనీ అదానీ గ్రూప్ చేతికి వెళ్తుండడంతో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీఎమ్మెల్సీ, ఓరియంట్ సిమెంట్ కంపెనీ పర్మినెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.రాములునాయక్ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. వివిధ డిమాండ్లతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు దీక్ష చేస్తానని చెప్పారు.
ALSO READ : సింగరేణితో జాతికి వెలుగులు
కార్మికులకు అన్యాయం జరిగితే పోరాడుతాం
సీకే బిర్లా యాజమాన్యం ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానీ గ్రూప్‌నకు విక్రయించడం వ్యాపారంలో భాగమే. కానీ కంపెనీ విక్రయం వల్ల కార్మికులకు, ప్రజలకు ఇబ్బంది కలిగితే మాత్రం చూస్తూ ఉరుకోం. ఎవరికి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం.
– సీహెచ్.తిరుపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం