గోదావరి జలరవాణా మార్గం ఏమైనట్టు? భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గతంలో ప్లాన్.. అటకెక్కిన ప్రతిపాదన

గోదావరి జలరవాణా మార్గం ఏమైనట్టు? భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గతంలో ప్లాన్.. అటకెక్కిన ప్రతిపాదన
  • దశాబ్దాలు దాటినా అడుగు ముందుకు పడని డ్రీమ్​ ప్రాజెక్ట్
  •  2013లో రూ.కోటి వ్యయంతో గోదావరిలో సర్వే 
  •  ఆ తర్వాత కేంద్రం మౌనంతో  అటకెక్కిన ప్రతిపాదన

భద్రాచలం, వెలుగు: దూరభారాలతో పాటు వ్యయప్రయాసలు తగ్గించే గోదావరి జలరవాణాకు ఇచ్చిన హామీని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేటి వరకు అమలు చేయలేదు. ఐదు దశాబ్దాలుగా కాగితాల్లోనే మూలుగుతున్న ఈ ప్రతిపాదనకు గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చినట్లే ఇచ్చి మౌనంగా కూర్చుంది. పర్యాటకంతో ముడిపడి ఉన్న ఈ డ్రీమ్‍ ప్రాజెక్టుపైనే భద్రాచలం ఆలయ ఆధారిత పర్యాటక ప్రాంతం భవిష్యత్‍  ఆధారపడి ఉంది. 

కాటన్‍ దొర కాలంలో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్ట్.. గోదావరిపై వంతెనల నిర్మాణాలతో మూలకెక్కింది. తడిసి మోపెడవుతున్న రవాణా ఖర్చుల నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నర్సింహారావు తెచ్చిన ప్రతిపాదనలను ఏండ్ల తరబడి కేంద్రం తన వద్దనే తిష్ట వేసుకు కూర్చుంది. గతంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించినపుడు భద్రాచలం నుంచి రాజమండ్రి, భద్రాచలం నుంచి -నాసిక్‍ జల రవాణా మార్గానికి ఆమోదం తెలిపినట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించి గోదావరిలో సర్వేలు కూడా నిర్వహించారు. కానీ, ఆ తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ పడకేసింది. 

ఇంకెంత కాలం?

జాతీయ జల రవాణా పథకంలో భాగంగా కేంద్రం భద్రాచలం- నుంచి రాజమండ్రి(171 కి.మీ), భద్రాచలం నుంచి -నాసిక్‍(1184 కి.మీ)ల మధ్య జలరవాణాకు ఆమోదం తెలిపింది. కానీ తర్వాత ఎందుకో మిన్నకుండిపోయింది . సులభతరంగా సరుకులను రవాణా చేయడమే కాకుండా ట్రాఫిక్‍ రద్దీని నివారించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే.. రోడ్డు రవాణాతో పోలిస్తే జల రవాణాకు ఖర్చు తక్కువగా ఉంటుంది. కిలోమీటరుకు రోడ్డు రవాణా ద్వారా రూ.2.75లు ఖర్చు అయితే, జలరవాణా ద్వారా కేవలం కిలోమీటరుకు ఒక్క రూపాయే ఖర్చు అవుతుంది. 

2014 నుంచి...

మోదీ నేతృత్వంలోని కేంద్రం 2014 నుంచే తెలంగాణ, ఆంధ్రలోని జల వనరులపై దృష్టి సారించింది. జల వనరును ఉపయోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేది కేంద్ర నిర్ణయం. ఇందులో భాగంగా భద్రాచలం నుంచి వయా కుక్కునూరు మీదుగా 171 కి.మీల దూరం రాజమండ్రి వరకు, ఏలూరు కెనాల్‍ -రాజమండ్రి నుంచి విజయవాడ వరకు, ఇందులో గోదావరి, -ఏలూరు కెనాల్‍ మధ్య  74 కి.మీలు, కృష్ణా, -ఏలూరు కెనాల్‍(ఏలూరు నుంచి విజయవాడ) 65 కి.మీల జలరవాణాకు మార్గం సుగమమయ్యింది. ఈ పనులను వేగవంతం చేస్తామని కేంద్రం పేర్కొంది. 

ఇందుకోసం రూ.కోటి వ్యయంతో గోదావరిలో సర్వే సైతం నిర్వహించారు. కానీ, తర్వాత కేంద్రం మౌనం వహించడంతో ప్రతిపాదన అటకెక్కింది.  గోదావరి తీర ప్రాంత గ్రామాల భవిష్యత్‍తో పాటు భద్రాచలం భవితవ్యం కూడా ముడిపడి ఉన్న ఈ జల రవాణా మార్గంపైనే స్థానికులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నారు. కాగా.. ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జలరవాణా మార్గం కోసం కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం నుంచి స్పందన కరువైంది. 

కాటన్‍ దొర కాలంలోనే జల రవాణా..

నాడు కాటన్‍ దొరతోపాటు గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలంతా లాంచీలపైనే రాజమండ్రి వరకు వెళ్లేవారు. వైద్యం, విద్య, ఇతర నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వెళ్లాలంటే ఈ మార్గాన్ని ఉపయోగించేవారు. రాజమండ్రి నుంచి ప్రస్తుత మన తెలంగాణలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు వరకు లాంచీల ద్వారానే అన్నీ సరుకులు వచ్చేవి. గిరిజనుల అటవీ ఉత్పత్తులు, వెదురు రవాణా.. రాజమండ్రి, భద్రాచలం పేపర్‍బోర్డ్స్​కు  జలరవాణా  ద్వారానే వచ్చేవి. నేటికీ కాటన్‍ దొర నిర్మించిన జలరవాణా కెనాల్స్ దుమ్ముగూడెంలో కనిపిస్తాయి.