Education : ప్రాథమిక హక్కుల రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులు ఇవే.. హెబియస్ కార్పస్ అంటే ఏంటీ..?

Education : ప్రాథమిక హక్కుల రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులు ఇవే.. హెబియస్ కార్పస్ అంటే ఏంటీ..?

భారత పౌరుల హక్కులకు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భవిష్యత్తులో ఏ రకమైన ఆటంకాలు గానీ భంగం కలగకుండా ఉండటం కోసం భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పగించారు. ఈ హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం వంటిదిగా బి.ఆర్.అంబేద్కర్​ వర్ణించారు. రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కులకు పూచీకత్తు వంటిదిగా ఈ హక్కును పేర్కొంటారు. ప్రభుత్వాల అధికార దుర్వినియోగం, నియంతృత్వ విధానాల నుంచి పౌరులు ఈ హక్కు ద్వారా పరిహారాన్ని పొందవచ్చు. 

ఆర్టికల్​ 32(1): పౌరులు ఎవరైనా తమ హక్కులకు భంగం కలిగినప్పుడు వాటి సంరక్షణ కోసం అలాగే ప్రాథమిక హక్కుల అమలు కోసం ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టును సంప్రదించవచ్చు.
ఆర్టికల్​ 32(2): పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం అలాగే హక్కుల అమలు కోసం ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టులు రిట్లు జారీ చేస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు ప్రభుత్వాలకు గానీ ప్రభుత్వ అధికారులకు గానీ అలాగే అధికార సంస్థలకు గానీ రిట్లను జారీ చేస్తాయి. 
ఆర్టికల్​ 32(3): సుప్రీంకోర్టు, హైకోర్టుల రిట్లు జారీ చేసే అధికారంపై పరిమితులు విధించరాదు. 
                          రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే ఉన్నది.
                          రిట్లు జారీ చేసే పద్ధతిని బ్రిటన్ దేశం నుంచి గ్రహించారు.
                          జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ఈ హక్కు అమలును సస్పెండ్​ చేయవచ్చు. 
                           రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా ప్రభుత్వం చర్యలను న్యాయసమీక్షకు గురిచేయడానికి అవకాశం ఉంటుంది.

ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పగించింది. 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు.. 226వ అధికరణ ప్రకారం హైకోర్టు ఐదు రకాల రిట్లు జారీ చేయడం ద్వారా ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం సామాన్యమైన పౌరుడు కూడా ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించడానికి అవకాశం ఉంది. 

హెబియస్ కార్పస్​: బందీ ప్రత్యక్ష, శరీరాన్ని కలిగి ఉండటం అని పేర్కొనే ఆజ్ఞ. ఒక వ్యక్తి అరెస్టు చట్టబద్ధమా? కాదా? అనేది నిర్ణయించడానికి ఉన్నత న్యాయస్థానాలు ఈ ఆజ్ఞలను జారీ చేస్తాయి. ఈ రిట్​ ప్రకారం అరెస్టయిన వ్యక్తిని 24 గంటలలోగా సమీప కోర్టులో హాజరు పర్చాల్సి ఉంటుంది. అరెస్టుకు గల కారణాలు తెలపాలి. అరెస్టయిన వ్యక్తికి తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలి. ఈ రిట్​ను ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. ఒక వ్యక్తి మరో వ్యక్తి(ప్రైవేట్​వ్యక్తి)పై హెబియస్ కార్పస్​ పిటిషన్​దాఖలు చేయవచ్చు. కానీ కోర్టు మాత్రం ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా డైరెక్ట్​గా ప్రైవేట్​వ్యక్తికి ఈ రిట్ జారీ చేయదు. భారత రాష్ట్రపతికి, గవర్నర్లకు, ప్రైవేట్​ వ్యక్తులకు, విదేశీయులకు ఈ రిట్​జారీ చేయరాదు. 

మాండమస్​: ఈ రిట్​పరమాదేశం లేదా వియ్​ కమాండ్​ అనే అర్థాన్ని ఇస్తుంది. ఒక ప్రభుత్వ అధికారికి గానీ లేక అధికార సంస్థకు గానీ మీ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చండి అని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆజ్ఞ. ఒక ప్రభుత్వ అధికారి లేక అధికారయుత సంస్థ తమ విద్యుక్త ధర్మాన్ని అంటే తమ విధులను సక్రమంగా నెరవేర్చని సందర్భంలో వ్యక్తులు తమ హక్కులను కోల్పోయినా లేక భంగం కలిగినా ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించినప్పుడు న్యాయస్థానాలు ఈ రిట్​ను జారీ చేస్తాయి. రాష్ట్రపతికి, గవర్నర్లకు, ప్రైవేట్​ వ్యక్తులకు, విదేశీయులకు జారీ చేయరాదు. 

ప్రొహిబిషన్​:దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్​లో విచారణలో ఉన్న కేసుల విచారణను తక్షణం నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే రిట్. ఉన్నత న్యాయస్థానాలు దీన్ని జారీ చేయడానికి గల కారణం, దిగువ న్యాయస్థానాలకు ఆ కేసును విచారించే అధికారం లేకపోవడం లేదా సాంకేతిక కారణమై ఉండవచ్చు. 

సుప్రీంకోర్టు తీర్పులు:ఎ.కె.గోపాలన్ వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ మద్రాస్ మధ్య జరిగిన వ్యాజ్యంలో  సుప్రీంకోర్టు తీర్పునిస్తూ  ప్రాథమిక హక్కులను సంరక్షించే సందర్భంలోనూ అమలుపరిచే సందర్భంలోనూ సుప్రీంకోర్టు, హైకోర్టులు సమానమైన అధికారాలను కలిగి ఉండటంతో హైకోర్టును సంప్రదించిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని, హక్కుల కోసం వ్యక్తులు నేరుగా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. 

రమేశ్​ థాపర్​ వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ మద్రాస్​ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అప్పగించినందున ఏ వ్యక్తి అయిననూ తన హక్కుల సంరక్షణకు లేక అమలుకు న్యాయస్థానాన్ని సంప్రదించినప్పుడు బాధ్యతను తిరస్కరించే అధికారం కోర్టుకు లేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 

ఫెర్టిలైజర్​ కార్పొరేషన్​ కామ్​గార్ ​యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్​ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యతను మన రాజ్యాంగ ఆర్టికల్​ 32 ద్వారా సుప్రీంకోర్టుకు అప్పగించింది. దీనిని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొన్నది. 

ALSO READ | Good News : స్పెషలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. జిప్ మర్ నోటిఫికేషన్

రూప అశోక్​ హుర్రా వర్సెస్ అశోక్​ హుర్రా మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్ష చేయడానికి క్యురేటివ్​ పిటిషన్ వేసే అధికారం బాధితునికి ఉంటుందని సుప్రీంకోర్టు  తీర్పునిచ్చింది. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినప్పుడు, న్యాయాన్ని అందించడంలో న్యాయస్థానం ఏదైనా ముఖ్యమైన అంశాన్ని విస్మరించినట్టుగా తగిన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచినప్పుడు సుప్రీంకోర్టు తిరిగి పునర్విచారణ చేయవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది.

సెర్సియోరరీ: సాధారణంగా ఈ రిట్​ను ప్రొహిబిషన్​తో కలిపి జారీ చేస్తారు. దిగువ కోర్టుల్లోనూ లేక ట్రిబ్యునళ్లలోనూ కేసు విచారణను తక్షణం నిలిపివేసి ఆ కేసును తనకు లేదా మరో కోర్టుకు బదిలీ చేయాలని ఈ రిట్​ను జారీ చేస్తారు. ఉదాహరణకు దేశంలో సంచలనం సృష్టించిన గుజరాత్​లోని బెస్ట్ బేకరి కేసును జహీరాషేక్ ​కోరిక ప్రకారం ముంబయికి బదిలీ చేశారు. 

కోవారెంటో :ఎట్​ వాట్​ అథారిటీ లేదా అధికార పృచ్ఛగా పేర్కొనే రిట్​ ఇది. ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా లేక న్యాయబద్ధంగా  గానీ ఎలాంటి అధికారాలు లేనప్పటికీ లేని అధికారాలను నిర్వహించే సందర్భంలో ఏ అధికారంతో మీరు ఈ విధులను నిర్వహిస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే రిట్. సదరు అధికారికి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆ అధికారాలను నిర్వర్తించే అధికారం లేకపోవడమే ఈ రిట్​ జారీకి గల ప్రధాన కారణం.