
‘మామా.. నీ నెత్తి మీద బల్లి రా? ఒరేయ్.. నీ ప్యాంట్ చినిగిందిరా!’ ‘హే.. నీచున్నీకి మట్టి అంటిందే..’ ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే చాలు... ఒకప్పుడు ఇట్లాంటి ప్రాక్టికల్ జోకులు బోలెడు చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు ఆ సీన్ చాలా తగ్గింది. కొత్త రూపం సంతరించుకుంటోంది. ఏది ఏమైనా పక్కవాళ్లని ఆట పట్టించి "ఏప్రిల్ పూల్" అనడం ఒక సరదా. ఇంతకీ ‘సోషల్లీ యాక్సెప్టబుల్‘ అయిన ఈ వేడుక ఎలా మొదలైంది? ఎక్కడెక్క ఏ విధంగా జరుపుకుంటారు? ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
యరోప్ లో ఒకప్పుడు వింత ఆచారం అమలులో ఉండేది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు పదిరోజులపాటు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేవాళ్లు. అయితే 1582లో రస్వోలిన్ (దక్షిణ ఫ్రాన్స్) రాజు తీసుకున్న నిర్ణయంతో కొందరు ప్రజలు బకరాలు అయ్యారు. గ్రెగేరియన్ క్యాలెండర్ అమలులోకి తెచ్చి జనవరి 1న న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని ఆయన శాసనం జారీ చేశాడు. కానీ, ఆ విషయం చాలా మంది ప్రజలకు తెలీక యధావిధిగా మార్చి చివరి వారంలోనే జరుపుకున్నారు.
దీంతో కొందదు ఆలస్యంగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ల వీపులకు పేపర్ చేప బొమ్మలను అంటించి ఆటపట్టించారు. 'గాలానికి దొరికిన చేపలంటూ.. వాళ్లను ఎగతాళి చేశారు. 'ఏప్రిల్ ఫిష్'గా మొదలైన ఆ సరదా, తర్వాతి కాలంలో 'ఏప్రిల్ ఫూల్' డేగా మారింది. ఇలా ఆటపట్టించే విధానం తరువాత ప్రపంచం అంతా పాకింది. అయితే 13వ శతాబ్దం నుంచే కొన్ని పుస్తకాల్లో ఏప్రిల్ పూల్ డే' ప్రస్తావన ఉందంటూ కొందరు చరిత్రకారులు చెప్తుంటారు.
ఇష్టం వచ్చినట్లు...
ఆడుతూ, పాడుతూ... అవతలివారిని ఏడిపించే ఈ రోజును ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాలు జరుపుకుంటాయి. అయితే ఆ జరుపుకొనే తీరులోనే కొంచెం వైవిధ్యం కనిపిస్తుంది. ఏఏ దేశాల్లో ఎలా జరుపుకుంటారో చూద్దాం.
- ఫ్రాన్స్ లో చేప ఆకారంలో కాగితాన్ని అవతలివారికి తెలియకుండా వీపు మీద అంటిస్తారు. దాని మీద 'ఏప్రిల్ ఫిష్' అని రాసి ఉంటుంది.
- పిండిని ఒకరి మీద మరొకరు చల్లుకుని విషెస్ తెలియజేసుకునే సంప్రదాయం ఇప్పటికీ పోర్చుగల్ లో కొనసాగుతోంది.
- ఏప్రిల్ ఫూల్" అని రాసిన పేపరు పోస్ట్ చేసి జనాలను పూల్స్ చేసే సంప్రదాయం ఐర్లాండ్ లో చూడొచ్చు.
- ఇంగ్లండులో ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకే ఫూల్ చేయవచ్చు. ఆ తరువాత ఎవరినైన్నా ఫూల్ చేయాలని ప్రయత్నిస్తే చేసిన వాళ్లనే 'పూల్స్'గా జనకడతారు. బ్రెజిల్ 'టైడే'గా జరుపుకుంటుంది.
- స్కాట్ లాండ్ లో "హంట్ ది గోక్ డే'గా సెలబ్రేట్ చేసుకుంటారు. గోక్ అంటే మూర్ఖత్వాన్ని సూచించే ఒక పదం. ఏప్రిల్ 1న మొదలయ్యే ఈ వేడుకలు రెండు రోజులపాటు కొనసాగుతున్నాయి. రెండో రోజున 'టెయిలీడే" పేరిట మనుషుల వెనకాల తోకల్ని అంటించి ఆటపట్టిస్తుంటారు..
- డెన్మార్క్ లో ఏప్రిల్ 1, మే 1.. ఈ రెండు రోజుల్లోనూ ఫూల్స్ చేయడం పరిపాటుగా కొనసాగుతూ వస్తోంది.
- మన దగ్గర సరదా చేష్టలతో పాటు రంగు నీళ్లు మీద చల్లి ఫూల్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు.