హైదరాబాద్: గ్రీన్ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్, బాటిల్ క్యాప్ చాలెంజ్ లాంటివి చూసుంటాం. కానీ తెలంగాణలో ఇప్పుడు వైట్ ఛాలెంజ్ పాపులర్‌గా మారింది. రాష్ట్ర రాజకీయం ఈ ఛాలెంజ్ చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు కారణమైన వైట్ ఛాలెంజ్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
వైట్ ఛాలెంజ్ ఎలా చేస్తారు?
వైట్ అంటే తెలుపు. ఈ రంగు స్వచ్ఛతకు చిహ్నం. ఇప్పుడు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు తాము డ్రగ్స్ తీసుకోలేదని, తాము క్లీన్ అని నిరూపించుకునేందుకు మొదలైన సవాలే ఈ వైట్ ఛాలెంజ్. ఇందులో వాళ్లు తమ బయో శాంపిల్స్ (రక్తం, గోళ్లు, వెంట్రుకలు, సలైవా, మూత్రం లాంటివి)ను ఫోరెన్సిక్ టెస్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్టులో వాళ్లు డ్రగ్స్ తీసుకోలేదని తేలితే వైట్ ఛాలెంజ్‌లో గెలిచినట్లే. తాము క్లీన్ అని నిరూపించుకొని మరో ఇద్దరికి సవాల్ విసరాల్సి ఉంటుంది.
ఈ ఛాలెంజ్ పుట్టిందిలా..
టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ కేసు వ్యవహారం నుంచి వైట్ ఛాలెంజ్ పుట్టిందని చెప్పొచ్చు. ఈ డ్రగ్స్ కేసు నుంచి సెలబ్రిటీలను బయటపడేయడానికి అధికార పక్ష నేతలు యత్నిస్తున్నారని, సదరు నాయకులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని, వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ సవాల్ విసిరారు. దీనికి కేటీఆర్ కూడా అంతే ధీటుగా స్పందించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని, ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేయించుకునేందుకూ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తన వెంట్రుకలు, గోళ్లు, రక్తం, మూత్రం శాంపిళ్లను ఇవ్వడానికి కూడా రెడీనని కేటీఆర్ చెప్పారు. అయితే రాహుల్ గాంధీ వస్తేనే తాను ఈ సవాల్‌కు ఒప్పుకుంటానన్నారు.
ఈ విషయాన్ని పక్కనబెడితే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్, వైట్, బ్లాక్, ఆరెంజ్ ఏ ఛాలెంజ్ అయినా తాను ఓకేనని బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సంజయ్ రిప్లై ఇచ్చారు. బలిసినోళ్లకు డ్రగ్స్ కావాలని, పేదోళ్లకు అవసరం లేదన్నారు.