వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై ఆప్ ప్రభావమెంత?

ఢిల్లీలో పుట్టిన ఆమ్​ ఆద్మీ పార్టీ అక్కడి ప్రజలను మెప్పించడంతోపాటు పంజాబ్ ​రాష్ట్రంలో అద్భుత విజయం సాధించింది. ఒక ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో దాదాపు క్లీన్ ​స్వీప్​స్థాయిలో 92/117 సీట్లు దక్కించుకోవడం మాటలేమీ కాదు. పంజాబ్ ఉత్సాహంతో మిగిలిన రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పార్టీ చీఫ్ ​అరవింద్ ​కేజ్రివాల్ అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, 2023లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, అసెంబ్లీ ఎన్నికల మీదా ఆప్ ​దృష్టి పెట్టింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తన బలం పరీక్షించుకోనుంది. ఆప్​ ముఖ్యంగా తెలంగాణపై ఫోకస్​ పెట్టినట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో వచ్చే నెలలో కేజ్రీవాల్ పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు మాజీ ఎంపీలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పలు జేఏసీల బాధ్యులు, పలువురు ఎన్నారైలు, ప్రముఖులు, స్టూడెంట్​ లీడర్స్, కార్మిక నేతలు, సింగరేణి ప్రాంత వాసులు ఇప్పటికే కేజ్రీవాల్​తో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో సీఎం కేసీఆర్ మోడల్ పాలన సాగుతోంది. రైతుబంధు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ, వ్యవసాయానికి ఉచిత కరెంట్, ఆసరా పెన్షన్లు, దళిత బంధు లాంటి పథకాలు అమలవుతున్నాయి. ఇలాంటి పథకాలే ఢిల్లీలో అమలు చేసిన కేజ్రీవాల్ అవినీతి రహిత న్యాయమైన పాలన నినాదంతో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.  ఢిల్లీలో కేజ్రీవాల్ ​పాలన సామాన్యులను దృష్టిలో ఉంచుకొని సాగుతోంది. ఆయన విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు. ఇలాంటి విధానాలను తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు, స్టూడెంట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అది ఆప్​ను తెలంగాణ ప్రజలకు చేరువ చేసే అవకాశాలను పెంచుతుంది. కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్రం అప్పులు లేని రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇప్పటికే దాదాపు 4 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణలో ఢిల్లీ తరహా అప్పులు లేని పాలన అందిస్తామని కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజల మద్దతు కోరే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలు ఉంటున్నాయి. డబుల్​బెడ్​రూమ్​  ఇండ్ల పంపిణీ, దళిత బంధు లాంటి స్కీముల అమలులో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో వివిధ సంక్షేమ పథకాల అమలులో అవినీతికి తావు లేకుండా చూస్తున్న కేజ్రివాల్​ను తెలంగాణ విద్యావంతులు, యువకులు విశ్వసించే అవకాశం ఉంది. 

సోమ్​నాథ్​ భారతి పర్యటనలు..
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలపై ఆమ్​ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆప్ ఎమ్మెల్యే, ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌‌‌‌చార్జి సోమనాథ్ భారతి రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని, ఆత్మహత్యలు చేసుకున్నవారికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. కేంద్రం పంపుతున్న నిధులను సీఎం కేసీఆర్ పక్కదారి పట్టించారని.. దానిపై కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేపడుతామని, ఆప్ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తామని సోమనాథ్ సోమనాథ్​ స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌ని కేసీఆర్ కలుస్తారంటూ గత ఢిల్లీ టూర్ సందర్భంగా ఊహాగానాలు వచ్చాయి. ఇద్దరు నేతల మధ్య భేటీ సాధ్యం కాలేదు. అప్పటి నుంచి కేసీఆర్ సర్కార్‌‌‌‌ను ఆప్ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. 

పంజాబ్​ పాలన కీలకం..
పంజాబ్17వ సీఎంగా భగవంత్ మాన్ షహిద్ భగత్ సింగ్ గ్రామంలోని వంద ఎకరాల స్థలంలో భారీ జనం ముందు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ సీఎం ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ సహా ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు.117 సీట్లలో 92 సీట్లు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్​లో సాగించే మెరుగైన పాలన మోడల్​లో మరో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకునే అవకాశం ఉంది. పంజాబ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరిస్తే ఆ ప్రభావం దేశంలోని మిగతా రాష్ట్రాలపైనా ఉంటుంది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కోటి మందికి పైగా ఉన్న మహిళల ఖాతాల్లో  వెయ్యి రూపాయలు వేయడం, నాణ్యమైన విద్య అందించడం,  వైద్య రంగంపై దృష్టి పెట్టి బస్తీ దవాఖానాలను మెరుగుపరచడం లాంటి హామీలు ఆ పార్టీ పంజాబ్​లో నెరవేర్చాల్సి ఉంది.  

సమస్యలను అధిగమిస్తేనే...
పంజాబ్ రాష్ట్రం ఇప్పటికే 2.82లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. డ్రగ్స్ లాంటి నిషా నుంచి ముందు పంజాబ్ ను బయటకు తీయాలి. రసాయనాల కారణంగా వ్యవసాయ భూముల్లో విషం చిమ్మిన పరిస్థితి ఉంది. దాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. నేతల అవినీతి, అక్రమాల కారణంగా పంజాబ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. 2016 నుంచి 2021వరకు చదువులు, ఉద్యోగాల కోసం 2.96 లక్షలమంది విదేశాలకు వెళ్లి ఉన్నారు. 5 వేల ఐఎల్టిఎస్ సెంటర్స్ లో ట్రైనింగ్ పొంది మరీ విదేశాలకు వెళ్తున్నారు. దీని నెట్ వర్త్ వెయ్యి కోట్ల వరకు ఉంటుందంటున్నారు. 378 రోజులు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్ల వద్ద ఉద్యమించిన సందర్భంగా ఊపిరి కోల్పోయిన 750 మందిలో 600 మంది పంజాబ్ కు చెందిన వారే ఉన్నారు. ఆ కుటుంబాలను సైతం ఆదుకోవాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో నీటి సమస్య వేధిస్తోంది. గ్రౌండ్ వాటర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయి. ఢిల్లీ మాదిరి ఇక్కడ బస్తీ దవాఖానాల అవసరం ఉంది. ఆమ్​ఆద్మీ పార్టీ వీటన్నింటిని ఎలా పరిష్కరిస్తుందన్న దానిపైనే ఆ పార్టీ మరో రాష్ట్రంలో బలోపేతం అయ్యే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.  

భగత్​సింగ్​ 8 పాయింట్ల అమలు..
 ప్రభుత్వ కార్యాలయాల్లో బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు మాత్రమే ఉంటాయని పంజాబ్​కొత్త సీఎం భగవంత్​ మాన్ ​ప్రకటించారు. దీంతోపాటు1931లో భగత్ సింగ్ సూచించిన 8 పాయింట్ల విధానం అమలు చేయాలని అధికారులను కోరారు. దాని ప్రకారం అందరికీ ఇల్లు, రైతులకు టాక్స్ నుంచి మినహాయింపు, అందరికీ చదువు, ల్యాండ్ టాక్స్ స్వల్పంగా వసూలు, రైతుల అప్పు మాఫీ, పని గంటలు తగ్గింపు, ఉద్యోగుల జాతీయికరణ, పంటకు మద్దతు ధర,  కలెక్టివ్ అగ్రికల్చర్ తదితర అంశాలపై కొత్త సీఎం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. నిరుపేద కుటుంబాలు 50 వేల దాకా ఉన్నాయి.52 వేల అంత్యోదయ కార్డులు ఉన్నాయి. పేదరికం ఇక్కడ తక్కువేమీ లేదు. దేశంలోని 29 రాష్ట్రాలతోపాటు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో పంజాబీలు ఉన్నారు. ఉద్యోగాలు చదువుల కోసం వెళ్లి కుటుంబ సభ్యుల బాగోగులు అక్కడి నుంచే చూస్తున్నారు. వారందరూ ఆమ్ ఆద్మీ పార్టీ పాలన మీద నమ్మకం పెట్టుకున్నారు. జీఎస్టీ, ప్రజలు చెల్లించే ఇతర పన్నుల నుంచి వచ్చే మొత్తంలో  పొదుపు పాటించి ఖర్చులను తగ్గించుకునే ఢిల్లీ మోడల్ పాలనలోనే భాగంగా ఎమ్మెల్యేలు తమ సొంత నియోజక వర్గాల్లోనే ఉండేలా చూడాలని కొత్త సీఎం భావిస్తున్నారు. త్వరలోనే ఆదేశాలు కూడా జారీ చేయనున్నారని విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్​ తర్వాత మూడో పార్టీగా
దేశంలోని  రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించి ఆప్​ కాంగ్రెస్, బీజేపీ సరసన నిలబడ్డ మూడో పార్టీగా జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ, కాంగ్రెస్ కు దేశంలో తానే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. 2023లో తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ లాంటి పార్టీలు అంటున్నాయి. మరో వైపు అధికార టీఆర్​ఎస్​ కూడా మరోసారి మా ప్రభుత్వమే వస్తుందని చెబుతోంది. ఈ సందర్భంలో తెలంగాణ కు ఆనా జరూర్ పర్ జరా సంబల్కే ఆనా.. పహలే పంజాబ్ కో తో సజాఓ సంభాలో సాదో ఫిర్ తీస్రీ తరఫ్ దే క్ నా కేజ్రీవాల్ జీ.

- ఎండి.మునీర్, సీనియర్ జర్నలిస్ట్