మోత్కుపల్లి వీడితే నష్టమెంత?.. బీఆర్ఎస్​ లీడర్ల లెక్కలు

  • రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి మోత్కుపల్లి!
  • ఈసారి తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నం

యాదాద్రి, వెలుగు : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరడం ఖాయమైపోయింది. అయితే,  ఆయన పార్టీని వీడడం వల్ల ఆలేరు నియోజకవర్గంపై కచ్చితంగా ప్రభావం పడుతుందని, అయితే అది ఏ స్థాయిలో పడుతుంది, ఎంత నష్టం జరుగుతుందన్న లెక్కల్లో బీఆర్ఎస్​ లీడర్లు మునిగిపోయారు. బీఆర్ఎస్​లో చేరినప్పటి నుంచి మోత్కుపల్లి అసంతృప్తిగానే ఉన్నారు. సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన ఆయనకు బీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యం దక్కలేదు. టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి 2018 ఎన్నికల తర్వాత  బీజేపీలో చేరారు. కానీ, ఆ పార్టీలో ఇమడలేక రాజీనామా చేశారు. 2021లో బీఆర్ఎస్​లో చేరారు. కేసీఆర్​ ఆహ్వానం మేరకే బీఆర్ఎస్​లో చేరానని మోత్కుపల్లి చెప్పుకున్నారు. కేసీఆర్​ కూడా మోత్కుపల్లికి మొదట్లో గౌరవం ఇచ్చారు. ఆ సమయంలోనే దళితబంధు చైర్మన్​ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే మోత్కుపల్లిని సీఎం కేసీఆర్​ దూరం పెట్టారు. ప్రగతి  భవన్​కు ఆయన స్వయంగా ఫోన్​ చేసి అపాయింట్​మెంట్​ అడిగినా.. ఇస్తామని చెప్పి రెండు రోజులు దాటవేశారు. ప్రగతి భవన్​ నుంచి ఫోన్​ కోసం ఎదురు చూసిన ఆయనకు సీఎం నుంచి రిప్లయ్​ రాలేదు. ఆగస్టులో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మోత్కుపల్లిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన అనుచరులు యాదగిరిగుట్టలో సమావేశం ఏర్పాటుచేసి మోత్కుపల్లికి టికెట్​ ఇవ్వాలని కేసీఆర్​కు లేఖ రాశారు. కాగా, బీఆర్ఎస్​లో అసంతృప్తిగా కొనసాగుతున్న ఆయనకు కాంగ్రెస్​ నుంచి ఆహ్వానం వచ్చిందని మోత్కుపల్లి సన్నిహితులు చెబుతున్నారు. ఆ తర్వాతే చంద్రబాబు అరెస్టు​పై స్పందించిన మోత్కుపల్లి.. కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. అనంతరం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​తో బెంగళూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​తో తనకున్న అనుబంధంపై మోత్కుపల్లి వివరించినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య చర్చలు ఫలించినట్టు సమాచారం. కాంగ్రెస్​లో తగిన ప్రాధాన్యం ఇస్తామని డీకే చెప్పారని మోత్కుపల్లి అనుచరులు పేర్కొంటున్నారు.

ఆలేరుపై  ప్రభావం

బీఆర్ఎస్​ను మోత్కుపల్లి నర్సింహులు వీడడం వల్ల ఆలేరు నియోకవర్గంపై కచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఆలేరు నియోజకవర్గంలో 2,20,638 మంది ఓటర్లు ఉండగా ఎస్సీ ఓటర్లు దాదాపు 45 వేల వరకూ ఉన్నారు. బీఆర్ఎస్​లో  చేరిన తర్వాత ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఎస్సీలతో పాటు ఆయన మద్దతుదారులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పడు ఆయన ఏకంగా బీఆర్ఎస్  పార్టీనే వీడుతుండడంతో కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందని బీఆర్ఎస్​ లీడర్లలో కొంత ఆందోళన  నెలకొంది. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందన్న లెక్కల్లో ఆ పార్టీ లీడర్లు మునిగిపోయారు. కాగా, తుంగతుర్తి ఎస్సీ రిజ్వర్వుడ్​గా మారిన తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోత్కుపల్లి ఆ నియోజకవర్గం నుంచి పోటీచేసి  విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేయడంతో తుంగతుర్తికి దూరమయ్యారు. ఇప్పుడు ఆయన మళ్లీ కాంగ్రెస్​లో చేరుతున్నారు.  గతంలో తుంగతుర్తి నుంచి గెలిచినందున మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మోత్కుపల్లి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రెండు దశాబ్దాల తర్వాత

రెండు దశాబ్దాల తర్వాత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్​లోకి మళ్లీ చేరబోతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. ఆలేరు అసెంబ్లీ నుంచి టీడీపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్​ అభ్యర్థిగా మొత్తం ఐదుసార్లు పోటీ చేసి గెలిచారు. 1991లో నంద్యాల నుంచి పీవీ నర్సింహారావుపై ఇండిపెండెంట్​గా పోటీచేసి ఓడిపోయారు. నిత్యం కాంగ్రెస్​ను విమర్శించే మోత్కుపల్లి.. విధిలేని పరిస్థితుల్లో 1999లో అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా అసెంబ్లీలో కొనసాగారు. 2004, 2008లో టీఆర్ఎస్​ అభ్యర్థి కుడుదుల నగేశ్​ చేతిలో ఓడిపోయారు. 2009లో టీఆర్ఎస్​తో కుదిరిన పొత్తులో భాగంగా తుంగతుర్తి నుంచి మోత్కుపల్లి పోటీచేసి గెలిచారు. 2014లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీచేసి ఓడిపోయారు. టీడీపీలో బహిష్కరణకు గురైన మోత్కుపల్లి 2018లో  ఆలేరు నుంచి బీఎల్ఎఫ్​ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక బీజేపీకి రాజీనామా చేసి 2021లో బీఆర్ఎస్​లో చేరారు. 1999లో కాంగ్రెస్​ అభ్యర్థిగా ఆలేరులో గెలిచిన మోత్కుపల్లి రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కాంగ్రెస్​లో చేరబేతున్నారు.