కరోనా సంక్షోభంలో విద్యారంగం పయనమెటు.?

కరోనా కారణంగా ఏర్పడిన నష్టాన్ని ఏ రంగంలోనైనా పూడ్చుకోవచ్చు. కానీ విద్యా రంగంలో అది సాధ్యం కాదు. క్లాస్ రూమ్ పాఠాలకు ఆన్ లైన్ పాఠాలు ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాదు. ఆఫ్ లైన్ బోధనకు సౌలతులు కల్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సర్కార్లు.. ఆన్ లైన్ క్లాసులకే మొగ్గు చూపుతున్నాయి. ఇది సక్సెస్ అయ్యిందంటూ లెక్కలు కూడా చెబుతున్నాయి. అయితే వాస్తవానికి పేద పిల్లలు చదువుకు దూరమైతున్నరు. 

కరోనా క్రైసిస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. ముఖ్యంగా విద్యా రంగం రెండేండ్లుగా గందరగోళంలో చిక్కుకున్నది. క్లాసులు ఆన్ లైన్ లో మేలా, ఆఫ్ లైన్ లో మేలా అనే చర్చ మీడియాలో ఇప్పటికీ నడుస్తున్నది. విద్యారంగ సంక్షేమాన్ని కోరే ఏ ప్రభుత్వమైనా ఆఫ్ లైన్ కే మొగ్గు చూపి సాహసోపేతంగా అమలు చేసేది. ఇందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించి, సౌలతులు కూడా సమకూర్చేది. విధాన నిర్ణయాల అమలు ప్రాధాన్యతలతోనే ఏ ప్రభుత్వమైన సంక్షేమ లక్షణం కలిగి ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సంక్షేమంపై దీర్ఘకాలిక దృష్టి సారించినట్లయితే ఆయా ప్రభుత్వాల ప్రాధాన్యతారంగాలు మారే అవకాశముంటుంది. ప్రభుత్వాలు తమ రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం  లాక్ డౌన్ కాలంలో విపత్తుల చట్టం నియమాలను ఇష్టారీతిన  ఉల్లంఘించాయి. అనేక విధాలుగా జనసమూహాలు కలిసే షాపింగ్ మాల్స్ తదితర వ్యాపార, సామాజిక కార్యకలాపాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు, బార్, రెస్టారెంట్లకు అనుమతులిచ్చాయి. కానీ విద్యారంగంలో ప్రత్యక్ష బోధన ప్రాధాన్యతను గుర్తించలేకపోయాయి. పాఠశాల విద్యలో కనీసం పదో తరగతి, కళాశాల విద్యలో ఇంటర్ సెకండియర్ కోసమైన ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉండేది.  ఏ రంగంలో జరిగిన నష్టాన్నైనా విపత్తు కాలానంతరం పూడ్చుకోవచ్చు. కానీ విద్యారంగంలో అది సాధ్యం కాదు. అత్యంత కీలకమైన ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండగా.. మనం కూడా లైట్ గా తీసుకుంటున్నాం. విపత్తు సందర్భంగా ఆన్ లైన్ తప్ప మరోదారి లేదనే భావన కంటే అధునాతన తరగతి గది ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వాలు అన్వేషణ  కొనసాగించాల్సింది. ఇందుకు  కావాల్సిన టెక్నాలజీ కోసం అవసరమైతే విదేశాల సహకారం కోరే అవకాశం ఉండేది. రెండేండ్లుగా సాగుతున్న నిస్సారమైన ఆన్ లైన్ చదువులు.. భవిష్యత్తులో దుష్ఫలితాలు తెస్తాయి. ఇది అందరూ అంగీకరించే వాస్తవం. ప్రత్యక్ష బోధనకు ఆన్ లైన్ బోధన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాదు. రెండేండ్లుగా పిల్లలు కింది తరగతుల్లోని భాష, గణితం, విజ్ఞాన శాస్త్రాల పరిజ్ఞానం, తరగతికి సంబంధించి కీలక భావనలు, స్థాయి సామర్థ్యాలు నేర్చుకోకుండానే ఉన్నత తరగతులకు వెళుతున్నారు.

కోర్టు ఏమన్నది? 

"ఈ సంక్షోభ సమయంలో పిల్లలకు బడికి పోవల్సిన అవసరముందా?" అని కోర్టు ప్రశ్నించటంలో పిల్లల ఆరోగ్యంపై ఆందోళన, చక్కని వివేచన, ముందుచూపు ఉన్నది. ప్రభుత్వానికి పిల్లల చదువు పట్ల శ్రద్ధ ఉండి ఉంటే వారంలోగానే దీనికి జవాబును సిద్ధం చేసేది. పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహించే విధంగా హైజినిక్ తరగతుల నిర్వహణ ఏర్పాట్లు చేసినట్లయితే ప్రభుత్వం కోర్టుకు ధీటుగానే జవాబు చెప్పేది. బడి ఈడు పిల్లలందరికీ వ్యాక్సిన్ ప్రారంభమే కానప్పుడు, అది పూర్తి అయ్యేందుకు పట్టే కాలం గురించి వాఖ్యానించలేం. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం కూడా కరోనా ఖాతాలోనే ముగిసే అవకాశాలను తోసిపుచ్చలేము. ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై కోర్టుకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించలేని నిస్సహాయతకు 'పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త' అని ప్రభుత్వం ఎన్ని పేర్లన్నా పెట్టవచ్చు. కనీసం ఈ ముఖ్యమైన సందర్భంలోనైనా తన అశక్తతపై పారదర్శకంగా ఉన్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.

సమాజం పాత్ర దూరమైంది.

తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగులు, టీచర్ల పనిసంస్కృతి మీద విష ప్రచారం చేస్తూ వచ్చింది. ఫలితంగా బడికి, సమాజానికి మధ్య దూరం పెరిగింది.  కులాల పరంగా తాయిలాలిచ్చి సమాజంలో ఐక్యత లేకుండా చేసింది. ఫలితంగా పాఠశాల బాగోగులు చూసే బాధ్యతల నుంచి సమాజం దూరమైంది. ప్రభుత్వం పాఠశాల విద్యాకమిటీలను నిర్వీర్యం చేయటంతో వాటి ఉనికి నామమాత్రమై బడి అభివృద్ధి పై కమిటీలకు పట్టు లేకుండా పోయింది. ప్రభుత్వం, సమాజం రెండు వైపుల నిర్లక్ష్యంతో బడి కునారిల్లి పోయింది. ఆన్ లైన్ చదువులకు సంబంధించి పిల్లలకు జరుగుతున్న ఈ నష్టాన్ని వీలైనంత త్వరగా పూరించాల్సి ఉంది. ఆన్ లైన్ తరగతుల మీద గానీ, పాఠశాల పరిశుభ్రత ఉపాధ్యాయులే నిర్వహిస్తున్న విషయం లో గానీ ప్రజల నుంచి స్పందన  లేకపోవడం దురదృష్ట కరం. విద్యారంగంలో తల్లిదండ్రుల చైతన్యవంతమైన జోక్యం, పౌరసమాజం బాధ్యత పెరిగిననాడే ప్రభుత్వాల బాధ్యత పెరుగుతుంది.

వి.అజయ్ బాబు, టీపీటీఎఫ్